వైసీపీకి ప్రత్యామ్నాయం జనసేనేనా ?

Update: 2022-09-15 09:30 GMT
ఒక వైపేమో ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి రాబోయేది తెలుగుదేశ పార్టీయే అని చంద్రబాబునాయుడు అండ్ కో పదే పదే చెబుతున్నారు. ఇదే సమయంలో వైసీపీకి ప్రత్యామ్నాయ పార్టీ జనసేన మాత్రమే అని దాని అధినేత పవన్ కల్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చెబుతున్నారు. ఎన్నిపార్టీలు కలిసి పోటీచేసినా 2024 ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రాబోయేది తామే అని వైసీపీ బల్లగుద్ది మరీ చెబుతోంది.

సరే ఎవరి వాదనలు ఎలాగున్నా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనించాల్సిందే. 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎలాగూ వైసీపీ బలంగానే ఉంది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు అందుబాటులో ఉన్న అన్నీ అవకాశాలను ఉపయోగించుకుంటుంది.

ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఘోర ఓటమితో నేతల్లో కొందరు పార్టీని వదిలేశారు. చాలామంది నేతలు ఎందుకనో స్తబ్దుగా ఉన్నారు. అయితే క్యాడర్ మాత్రం చాలా బలంగా ఉంది.

మరి జనసేన విషయం చూస్తే అసలేమందో అర్ధం కావటం లేదు. నేతలూ లేరు క్యాడరూ లేదు. పవన్ కు ఉన్నదంతా అభిమానులు మాత్రమే. ఈ అభిమానులు కూడా తనతో పాటు జనసేనకూ ఓట్లేయలేదని స్వయంగా పవనే చెప్పారు. మరి ఏ ధైర్యంతో అధికారంలోకి రావటం ఖాయమని పవన్ పదే పదే చెబుతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. వైసీపీకి ప్రత్యామ్నాయం తామే అని టీడీపీ చెప్పుకుందంటే అర్ధముంది.

చట్టసభల్లో కానీ క్షేత్రస్థాయిలో కానీ ఎలాంటి బలం లేని జనసేన కూడా అధికారపార్టీకి తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటే జనాలు ఎలా నమ్ముతారు ? వైసీపీకి ధీటుగా అధికారం అందుకునే స్ధాయిలో జనసేన ఎదిగిందని చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్క ఉదాహరణ కూడా కనబడటం లేదు.

అయినా సరే పవన్ అలాగే ప్రచారం చేసుకుంటున్నారు. పవన్ అంటే ఏదో భ్రమల్లో ఉండి ప్రచారం చేసుకుంటున్నారని సరిపెట్టుకోవచ్చు. మరి దశాబ్దాలుగా రాజకీయాల్లోనే ఉన్న నాదెండ్లకు ఏమైంది ?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News