జ‌న‌సేన‌కు ఆ టెన్ష‌న్ త‌ప్పిన‌ట్టేనా?

Update: 2022-08-31 07:16 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీకి గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆరు శాతం వ‌ర‌కు ఓట్లు వ‌చ్చాయి. అయితే కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్దేశించిన ప్ర‌మాణాల‌ను అందుకోలేక‌పోవ‌డంతో రాజ‌కీయ పార్టీగా ఎన్నిక‌ల సంఘం జ‌న‌సేనను గుర్తించ‌లేదు. ఇప్ప‌టికీ జ‌న‌సేన పార్టీ గుర్తింపు పొంద‌ని పార్టీగానే ఉంది.

ఈ నేప‌థ్యంలో జన‌సేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసు ప్ర‌మాదంలో ప‌డింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ మృతితో తిరుప‌తి పార్ల‌మెంటుకు జ‌రిగిన ఉప ఎన్నిక‌లో జ‌న‌సేన పార్టీ పోటీ చేయ‌లేదు. బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన ర‌త్న‌ప్ర‌భ‌కు మ‌ద్ద‌తు ఇచ్చింది. దీంతో జ‌న‌సేన పార్టీ ఎన్నిక‌ల గుర్తు అయిన గాజు గ్లాసును ఎన్నిక‌ల సంఘం వేరే వారికి కేటాయించింది.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు ద‌క్క‌క‌పోవ‌చ్చ‌ని వార్త‌లు వ‌చ్చాయి. మ‌రోవైపు త‌మ ఆదాయ‌, వ్య‌య వివ‌రాల‌ను, విరాళాల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించని పార్టీల‌ను నిషేధిస్తామ‌ని గ‌తంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి జ‌న‌సేన పార్టీ త‌న ఆదాయ‌, వ్య‌య వివ‌రాల‌ను, విరాళాల లెక్క‌ల‌ను స‌మ‌ర్పించింది.

దీంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం గాజు గ్లాసు గుర్తును జ‌న‌సేన పార్టీకే కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో జనసేన పోటీ చేసిన చోటల్లా గాజు గ్లాస్ గుర్తు ఆ పార్టీకే ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక జ‌న‌సేన విరాళాల విష‌యానికొస్తే త‌మ‌కు రూ.26.37 కోట్లు విరాళాలుగా వ‌చ్చాయని ఆ పార్టీ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి నివేదిక స‌మ‌ర్పించింది.

భవనాల రూపంలో రూ. 1.01 కోట్లు, వాహనాల రూపంలో రూ. 66.37 లక్షలు, ఆఫీస్ ప‌రిక‌రాల రూపంలో రూ. 56.34 లక్షలు, బీమా రూపంలో రూ.95.47 లక్షల ఆదాయం ఉందని జ‌న‌సేన పార్టీ.. కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి నివేదించింది. ప్రస్తుతం బ్యాంకులో రూ.7.60 కోట్లు నిల్వ ఉన్నట్లు పేర్కొంది.

మ‌రోవైపు వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో పార్టీ కార్య‌క్ర‌మాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌డానికి జ‌న‌సేన పార్టీ.. నా సేన కోసం నా వంతు అనే కార్య‌క్ర‌మానికి కొద్ది రోజుల కింద‌ట శ్రీకారం చుట్టింది. నా సేన కోసం నా వంతు కార్య‌క్ర‌మం ద్వారా విరాళాలు సేక‌రించాల‌ని ఆ పార్టీ నిర్ణ‌యించింది. ఇందుకోసం ఒక ఫోన్ నంబ‌ర్‌ను ఇచ్చింది. రూ.10 నుంచి విరాళాలు ఇవ్వ‌వ‌చ్చ‌ని వెల్ల‌డించింది. గూగుల్ పే, పోన్ పే త‌దిత‌రాలు ద్వారా విరాళాలు ఇవ్వ‌వ‌చ్చ‌ని ఆ పార్టీ తెలిపింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News