బాలయ్యకు తారక్ ఫ్యాన్స్ హ్యాండిచ్చేశారట..!

Update: 2019-05-09 11:43 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత అన్ని పార్టీలు లెక్కల్లో మునిగిపోయాయి. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం నాయకులు ఈ ఎన్నికల్లో గెలుపోటములపై సమీక్షలు చేసుకుంటున్నారు. అధిష్ఠానాలు ఇచ్చిన ఆదేశాలో.. లేక మరో కారణమో తెలియదు కానీ, ఓటింగ్ సరళిని పరిశీలించి తమ పార్టీ అభ్యర్థికి విజయం దక్కుతుందో లేదోనన్నది అంచనాలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలు ఆసక్తికర అంశాలు తెరపైకి వస్తున్నాయి. వీటినే ప్రత్యర్థి పార్టీల నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకమైన స్థానం.. ముఖ్యమైన అభ్యర్థి విషయంలో జరిగిన వ్యవహారంపై ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇది ఆ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌ గా మారింది.

అనంతపురం జిల్లాలోని హిందూపురం అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెబుతారు. దీనికి కారణం టీడీపీ ఆవిర్భావం తర్వాత 2014 వరకు జరిగిన ఎన్నికల్లో అక్కడ ఆ పార్టీకి ఓటమన్నది ఎదురుకాకపోవడమే. అలాంటి కీలక స్థానం నుంచి గత ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ నిశ్చల్‌ పై పదహారు వేల పైచిలుకు మెజారిటీతో ఆయన గెలుపొందారు. అంతేకాదు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ఆయనే టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే, టీడీపీ అధిష్ఠానం.. ఎమ్మెల్యే బాలకృష్ణ అనుకున్న ప్రకారం మాత్రం అక్కడ ఎన్నికలు జరగలేదు. ఎందుకంటే కంచుకోట కావడంతో ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ అక్కడి అభివృద్ధిపై పెద్దగా పట్టించుకోలేదు కాబట్లే.

తన పీఏలకు హిందూపురం బాధ్యతలు అప్పగించడంతో వారు అందిన కాడికి దోచుకున్నారన్న ప్రచారం జరిగింది. దీంతో ఈ ఎన్నికలు ఆయనకు క్లిష్టంగా మారాయి. దీనికితోడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టింది. గతంలో ఐజీగా పని చేసి రిటైర్ అయిన ఇక్బాల్ అహ్మద్ ఖాన్‌ ను తీసుకొచ్చి బాలయ్యపై పోటీ చేయించింది. ఇవి చాలవన్నట్లు హిందూపురం నియోజకవర్గంలోని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ ఎన్నికల్లో బాలయ్యకు మద్దతుగా నిలవలేదని తెలుస్తోంది. అక్కడ బాలయ్య ఫ్యాన్స్ పెత్తనం చేయడంతో పాటు వారిని కలుపుకుని పోకపోవడం వల్లే వారు ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. బాలయ్యపై ఉన్న వ్యతిరేకతకు తోడు మేజర్ రోల్ పోషించే తారక్ అభిమానులు పని చేయకపోవడంతో ఆయన విజయంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో బాలయ్యతో పాటు ఆయన అనుచరులు, టీడీపీ అధిష్ఠానం ఆందోళనగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News