కలిసిరాని కాలంతో కవిత కిందామీదా పడుతున్నారా?

Update: 2019-12-17 05:30 GMT
వడ్డించేటోడు మనోడైతే బంతిలో చివరన ఉన్నా అన్ని అందుతాయన్న నానుడికి భిన్నమైన పరిస్థితి తాజాగా నెలకొందని చెప్పాలి. పదవులు ఇచ్చేది స్వయాన తండ్రి అయినప్పటికీ.. కాలం కలిసి రాకపోతే పరిస్థితులు ఇలానే ఉంటాయని చెప్పాలి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కమ్ మాజీ ఎంపీ కవితకు బ్యాడ్ టైం నడుస్తుందన్న మాట వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి.

నిజామాబాద్ ఎంపీగా బరిలోకి దిగి ఓడిన ఆమెను.. రాజ్యసభకు ఎంపిక చేస్తారన్న వాదన వినిపించింది. మరికొద్ది నెలల్లో రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు రెండు ఎంపీ స్థానాలు దక్కే వీలుంది. ఈ సందర్భంగా ఆమెను ఎంపీని చేస్తారన్న వాదన వినిపించింది. అయితే.. ఇప్పుడా పరిస్థితి లేదంటున్నారు. ఎందుకంటే.. ఉన్నరెండు స్థానాలకు ఉన్న పోటీ అలాంటిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కేకే టర్మ్ పూర్తి కావటం.. తప్పనిసరిగా ఆయనకు రాజ్యసభ సభ్యత్వాన్నికొనసాగించాల్సిన పరిస్థితి. దీంతో.. ఒక్క స్థానమే మిగలనుంది. ఈ ఒక్క స్థానానికి సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు కమ్ మాజీ ఎంపీ వినోద్ సైతం రాజ్యసభ బరిలో నిలవటంతో ఈసారికి కవితకు సారీ తప్పించి మరో అవకాశం లేదంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో పార్టీ స్టాండ్ ను బలంగా వినిపించే గొంతు మిస్ అయ్యిందన్న భావన అంతకంతకూ పెరుగుతోంది. ఇలాంటివేళ.. వినోద్ తో ఆ లోటును భర్తీ చేయించాల్సిన అవసరం ఉందంటున్నారు. కేకేను పక్కనపెట్టి రెండు స్థానాల్ని వినోద్.. కవితలకు ఇవ్వరా? అంటే.. ఒకేసామాజిక వర్గానికి చెందిన వారికి రెండు రాజ్యసభ పదవులు కట్టబెట్టటం సాధ్యం కాని పరిస్థితి. ఈ సమీకరణాలను చూసినప్పుడు కవితక్కకు కాలం కలిసి రావటం లేదని చెప్పక తప్పదు.
Tags:    

Similar News