కేసీఆర్ ముంద‌రి కాళ్ల‌కు ఈటెల బంధం.. ఇక పారిపోలేడా..?

Update: 2022-07-15 10:30 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు. ప‌రిచ‌యం అక్క‌ర లేని పేరు. రాజ‌కీయాల్లో త‌ల‌పండిన మ‌హాగండ‌ర‌గ‌డుడు. త‌న వాగ్ధాటితో ప్ర‌త్య‌ర్థుల‌ను మూడు చెరువుల నీళ్లు తాగించే ర‌కం. మొక్క‌వోని ధైర్యంతో ఒంటి చేత్తో ప్ర‌త్యేక రాష్ట్ర స్వ‌ప్నాన్ని సాధించిన ధీశాలి. విప‌క్షాల ఎత్తుల‌ను చిత్తు చేయ‌డ‌మే కానీ ఏనాడూ వెన్ను చూప‌ని మొండిఘ‌టం. అలాంటి వ్య‌క్తి తొలిసారి క‌ల‌వ‌రం చెందుతున్నారా..? అదీ త‌న ఉద్య‌మ స‌హ‌చ‌ర నేత ఈటెల వ్యూహంలో చిక్కుకోబోతున్నారా..? ఇక ఎటూ త‌ప్పించుకునే ప‌రిస్థితి లేదా..? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి.

సిద్దిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి మొద‌లైన కేసీఆర్ ప్ర‌స్థానం రెండుసార్లు సీఎం ప‌ద‌విని అధిరోహించే వ‌ర‌కు వెళ్లింది. తెలుగుదేశం పార్టీ త‌ర‌పున‌ ప‌లుమార్లు సిద్దిపేట నుంచి గెలుపొంది ప‌లు మంత్రి ప‌ద‌వులు చేప‌ట్టారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వికే ప‌రిమితం చేయ‌డంతో రాజీనామా చేసి ప్ర‌త్యేక పార్టీ ఏర్పాటు చేశారు. ఇక అక్క‌డి నుంచి వెనుదిర‌గ‌లేదు. క‌రీంన‌గ‌ర్‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఎంపీ స్థానాల్లో గెలుపొంది కేంద్ర మంత్రిగా కూడా ప‌ని చేశారు.

ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ‌డంతో సొంతంగా మెజారిటీ సాధించి సీఎం కుర్చీ ఎక్కారు. రెండోసారి కూడా అంత‌కంటే అత్య‌ధిక ఫ‌లితాలు సాధించి ముఖ్య‌మంత్రి పీఠాన్ని ప‌దిలం చేసుకున్నారు. కానీ మూడోసారి మాత్రం ప‌రిస్థితులు అంత అనుకూలంగా లేవు.

ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డినా ఆ ఫ‌లితాలు ప్ర‌జ‌ల‌కు అంద‌క‌పోవ‌డం.. ఉద్య‌మ కారుల‌ను ప‌క్క‌న‌పెట్టి బంగారు తెలంగాణ బ్యాచ్ ను అంద‌లం ఎక్కించడం.. భూ ఆక్ర‌మ‌ణ‌ల పేరుతో త‌న స‌హ‌చ‌ర ఉద్య‌మ‌కారుడు ఈటెల రాజేంద‌ర్ ను బ‌య‌టికి పంపించ‌డం.. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దిగ‌జార‌డం.. మంత్రులు, ఎమ్మెల్యేల ఆగ‌డాలు మితిమీరుతుండ‌డం వంటి కార‌ణాల‌తో ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త నెల‌కొంది.  

ఇలాంటి త‌రుణంలో కేసీఆర్ ప‌రిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో ప‌డిన‌ట్లు అయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ‌జ్వేల్ నుంచి పోటీ చేస్తాన‌ని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ చెప్ప‌డ‌మే ఇందుకు కార‌ణం. ఇందులో ఈటెల వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. త‌న‌ను మెడ‌ప‌ట్టి బ‌య‌టికి పంపింనందుకు కేసీఆర్ పై ప్ర‌తీకారంగా క‌నిపిస్తున్నా అంత‌కు మించి బ‌ల‌మైన కార‌ణ‌మే ఉన్న‌ట్లు తెలుస్తోంది. అదేమిటో కాదు.. త‌న వ్యాఖ్య‌ల‌తో కేసీఆర్ ను గ‌జ్వేల్ కే క‌ట్ట‌డం చేయ‌డం.

ఎందుకంటే కేసీఆర్ ఈసారి గ‌జ్వేల్ కాకుండా సిద్దిపేట లేదా ఆలేరు లేదా మునుగోడు స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి బ‌రిలో దిగుతార‌ని.. లేదా జాతీయ రాజ‌కీయాల దృష్ట్యా మెద‌క్ లేదా భువ‌న‌గిరి నుంచి పార్ల‌మెంటుకు పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని లీకులు ఇచ్చారు. గ‌జ్వేల్ లో వంటేరు ప్ర‌తాప్ రెడ్డికి అవ‌కాశం ఇవ్వ‌నున్నార‌ని గ‌తంలో చ‌ర్చించుకోవ‌డం జ‌రిగింది. ఇపుడు కేసీఆర్ నిజంగానే నియోజ‌క‌వ‌ర్గం మారితే ఈటెల‌కు బ‌య‌ప‌డి పారిపోయార‌నే వాద‌న‌లు వినిపిస్తాయి. లేదా గ‌జ్వేల్ లోనే బ‌రిలో ఉంటే అపుడు కేసీఆర్ కు, ఈటెల‌కు మ‌ధ్య‌ ర‌స‌వ‌త్త‌ర పోటీ ఖాయం. ఏది జ‌రిగినా అది బీజేపీకే ఉప‌యోగ‌ప‌డే అంశం. అలా కేసీఆర్ ముందరి కాళ్ల‌కు ఈటెల బంధం వేసిన‌ట్లు అయింది. చూడాలి మ‌రి ముందు ముందు ఏం జ‌రుగుతుందో..!
Tags:    

Similar News