కేజీఎఫ్ అక్కడ రిపీట్ అయ్యిందా?

Update: 2022-05-31 09:30 GMT
కేజీఎఫ్.. కర్ణాటకలోని కోలార్ బంగారు గనులపై ఆధిపత్యం కోసం జరిగిన ఈ ఫైట్ తెరపై అద్భుతంగా ఆవిష్కృతమై సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ మూవీలో బంగారం కోసం బానిసలుగా ప్రజలను మార్చి చంపడం.. ముఠా తగాదాలు, గ్యాంగ్ స్టర్ లు, రాజకీయ కోణం.. మొత్తంగా తెరపై కేజీఎఫ్ బంపర్ హిట్ కొట్టింది.  ఇప్పుడు అదే కేజీఎఫ్ ఆఫ్రికాలో రిపీట్ అయ్యింది. విలువైన బంగారం కోసం జరిగిన అల్లర్లలో ఏకంగా 100 మంది చనిపోయారు.

ఆఫ్రికా దేశంలో జరిగిన అల్లర్లలో 100 మంది చనిపోవడం విషాదం నింపింది. ఉత్తర చాద్ లో మే 23, 24 తేదీల్లో బంగారు గని కార్మికుల మధ్య ఘర్షణలు జరిగాయి.  అందులో 100 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ రక్షణ మంత్రి దావూద్ యాయా బ్రాహిమ్ సోమవారం తెలిపారు.

లిబియా దేశ సరిహద్దుకు సమీపంలోని పర్వత ప్రాంతాలైన కౌరీ బౌగోడీ జిల్లాలో ఒక అనధికారిక బంగారు గనుల ప్రదేశంలో రాత్రి సమయంలో హింస చెలరేగింది. ఈ గొడవలో చాలా మందికి గాయాలయ్యాయి.గొడవను ఆపడానికి అధికారులు రంగంలోకి దిగారు.  మే25న నిజ నిర్ధారణ కమిటీని పంపించారు. అప్పటికే 100 మంది చనిపోయారని.. ఇంకెంతో మంది గాయపడినట్లు గుర్తించారు.

అనధికారికంగా ఇఖ్కడ జరుగుతున్న బంగారం మైనింగ్ కార్యకలాపాలను అధికారులు నిలిపివేశారు. ఘర్షణలు జరిగిన ప్రాంతం నుంచి ప్రజలను ఖాళీ చేయించే పనిని చేపట్టారు.

లిబియా సరిహద్దుల్లోని ఈ ప్రాంతంలో మౌరిటానియన్లు, లిబియన్ల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘటన బుధవారం వెలుగుచూసింది. ఘర్షణల్లో చాలా ప్రాణ నష్టం వాటిల్లింది. అనేకమంది గాయపడ్డారని ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. అక్కడ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇదే మొదటి సారి కాదు..

బంగారం వెలికితీత పనులకు సంబంధించి చాద్, అక్కడి పొరుగు ప్రాంతాల మైనర్ల మధ్య తరచూ గొడవలు, ఉద్రిక్తతలు తలెత్తుతాయి. గతంలో చాలా ఘర్షణల్లో చాలా మంది చనిపోయారు. ఇదంతా విలువైన బంగారం ఖనిజం కోసమే కావడం గమనార్హం.
Tags:    

Similar News