కోహినూర్ వ‌జ్రం ఆ దేవాల‌యానిదా?

Update: 2022-09-14 13:30 GMT
కోహినూర్ వ‌జ్రం.. ప్ర‌పంచంలోనే దీనికి విశిష్ట చరిత్ర ఉంది. అప్ప‌ట్లో ప్ర‌పంచంలోనే అత్యంత విలువైన వ‌జ్రంగా ఖ్యాతిగాంచిన ఈ వ‌జ్రం అనేక చేతులు మారింది. ప్ర‌స్తుతం బ్రిట‌న్ రాణి ద‌గ్గ‌ర ఈ కోహినూర్ ఉంది. ఎప్ప‌టి నుంచో ఈ వ‌జ్రాన్ని వెన‌క్కి తీసుకురావాల‌ని డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి.

కోహినూర్ వ‌జ్రం.. గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి స‌మీపంలోని కొల్లూరులో ల‌భించింద‌ని చెబుతారు. కృష్ణాన‌దీ తీరంలో ల‌భించింద‌ని దీనిపై గాథ‌లు ఉన్నాయి. ఆ త‌ర్వాత ఇది మొగ‌ల్ చ‌క్ర‌వ‌ర్తులు.. జ‌హంగీర్, షాజ‌హాన్, ఔరంజేబు, బ‌హ‌దూర్ షా.. ఆ త‌ర్వాత పంజాబ్ పాల‌కుడు రంజిత్ సింగ్ కిరీటాల్లో చేరి వెలుగులీనింది. ఆ త‌ర్వాత ఆయ‌న కుమారుడి నుంచి మ‌న‌దేశాన్ని బ్రిటిష‌ర్లు ప‌రిపాలిస్తున్న‌ప్పుడు వారు స్వాధీనం చేసుకున్నార‌ని స‌మాచారం. ఆ త‌ర్వాత బ్రిటిష‌ర్లు ఆ విలువైన కోహినూర్ వ‌జ్రాన్ని బ్రిట‌న్ రాణి చెంత‌కు చేర్చారు. అలా కొన్ని వంద‌ల ఏళ్ల నుంచి ఈ కోహినూర్ వ‌జ్రం బ్రిటిష‌ర్ల చేతిలోనే ఉంది.

ఇటీవ‌ల కాలం వ‌ర‌కు కోహినూర్ వ‌జ్రం బ్రిట‌న్ మ‌హారాని ఎలిజబెత్‌-2 (96) వ‌ద్దే ఉంది. అయితే ఆమె కొద్దిరోజుల క్రితం మ‌ర‌ణించ‌డంతో 'కోహినూర్‌' వజ్రం ఎవ‌రికీ ద‌క్కుతుంద‌నేది చర్చనీయాంశంగా మారింది. ఎలిజబెత్-2 ధరించిన కిరీటంలోని కోహినూర్‌ వజ్రం ఎవరికి దక్కుతుందోనని అంతా ఆసక్తి చూపుతున్నారు.

అయితే కోహినూర్ వ‌జ్రం పూర్తిగా భార‌త్‌కు చెందిందే కాబ‌ట్టి భార‌త్‌కు తిరిగి అప్ప‌గించాల‌ని డిమాండ్లు మ‌రోసారి ఊపందుకున్నాయి. ఈ విష‌యం మీద సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అనేక మంది ట్వీట్ల‌తో కోహినూర్ వ‌జ్రం ట్విట్ట‌ర్ ట్రెండింగ్‌లో నిలిచింది.

ఈ నేపథ్యంలో తాజాగా కోహినూర్ వ‌జ్రం గురించి అనేక అంశాలు బ‌య‌ట‌కొస్తున్నాయి. ఒడిశాకు చెందిన జగన్నాథ్‌ సేన అనే సామాజిక, సాంస్కృతిక సంస్థ 'కోహినూర్ వ‌జ్రం' తమ దైవం పూరీ జగన్నాథుడిదేనని తాజాగా స్ప‌ష్టం చేసింది. దాన్ని యూకే నుంచి తిరిగి భారత్‌కు తెప్పించాలని డిమాండ్‌ చేసింది. ఈ విషయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకొని ఈ వజ్రాన్ని చారిత్రక పూరీ ఆలయానికి తెప్పించాలంటూ విన్న‌వించింది. ఈ కోహినూర్ వజ్రాన్ని పూరిలోని జ‌గ‌న్నాథుడి ఆలయానికి తిరిగి తీసుకొచ్చే ప్రక్రియను సులభతరం చేసేలా జోక్యం చేసుకోవాలని పూరీకి చెందిన 'శ్రీ జగన్నాథ్‌ సేన' రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒక వినతి పత్రం కూడా ఇచ్చింది.

''కోహినూర్‌ వజ్రం పూరి జగన్నాథుడిది. ఇప్పుడది బ్రిట‌న్ రాణి వద్ద ఉంది. ఆ వజ్రాన్ని తిరిగి తీసుకొచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రిని కోరండి. పంజాబ్‌ మహారాజు రంజిత్‌ సింగ్‌ అఫ్గాన్‌కు చెందిన దురానీపై యుద్ధంలో గెలిచిన తర్వాత దీన్ని జగన్నాథ స్వామికి విరాళంగా ఇస్తానని మొక్కుకున్నారు'' అని జగన్నాథ్‌ సేన కన్వీనర్‌ ప్రియదర్శన్‌ పట్నాయక్‌.. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు ఇచ్చిన విన‌తిప‌త్రంలో పేర్కొన్నారు.

కోహినూర్ వజ్రంపై ప్ర‌ముఖ‌ చరిత్రకారుడు అనిల్‌ ధిర్ చెబుతున్న‌ వివరాల ప్రకారం.. మహారాజా రంజిత్‌ సింగ్‌ పూరీ జగన్నాథుడికి విరాళంగా ఇస్తానని చెప్పినప్పటికీ వెంటనే కోహినూర్‌ను స్వామికి ఇవ్వలేదు. 1839లో పంజాబ్‌ మహారాజా రంజిత్‌ సింగ్ మ‌ర‌ణించారు. అనంతరం ఆయన తనయుడు దులీప్‌ సింగ్‌ నుంచి బ్రిటిష్‌ వాళ్లు కోహినూర్‌ వజ్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, అప్పటికే దాన్ని రాజు పూరీ జగన్నాథుడికి విరాళంగా ఇస్తానన్నారన్న విషయం ఆంగ్లేయులకు తెలుసు అని తెలిపారు. అలాగే, మహారాజా రంజిత్ సింగ్ మరణానికి ముందు పేర్కొన్న వీలునామాలో కూడా కోహినూర్ వ‌జ్రాన్ని పూరీ జగన్నాథుడికి విరాళంగా ఇచ్చినట్టు ఉందని అంటున్నారు. అలాగే ఆ వీలునామాను ఒక బ్రిటిష్‌ సైనిక అధికారితో ధ్రువీకరించార‌ని కూడా చెబుతున్నారు. దీన్ని నిరూపించే ఆధారం కూడా ఢిల్లీలోని నేషనల్‌ ఆర్కివ్స్‌లో అందుబాటులో ఉన్నట్టు చ‌రిత్ర‌కారుడు అనిల్ ధిర్ వివ‌రిస్తున్నారు.

మరోవైపు, ఈ వ్యవహారానికి సంబంధించి తాను క్వీన్‌ ఎలిజబెత్‌-2కి లేఖ రాశానని.. తనకు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ నుంచి 2016 అక్టోబర్‌ 19న సమాచారం కూడా అందినట్టు ప్రియదర్శన్‌ పట్నాయక్‌ తాజాగా వెల్లడించ‌డం విశేషం. నేరుగా ఈ విష‌యాన్ని యూకే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని.. కేబినెట్ మంత్రుల సలహా మేరకు రాణి చర్యలు తీసుకుంటారని.. రాజకీయాలకు అతీతంగానే ఉంటారని ఆ లేఖలో పేర్కొన్నట్టు ప‌ట్నాయ‌క్ చెబుతున్నారు.

అయితే, మరి ఈ ఆరేళ్లలో ఎందుకు మౌనంగా ఉన్నారని ప‌ట్నాయ‌క్‌ను మీడియా ప్ర‌శ్నించింది. ఇంగ్లాండ్‌ వెళ్లేందుకు తనకు వీసా లభించలేదని.. అందువల్లే యూకే ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లలేకపోయానని పట్నాయక్ అంటున్నారు.

మరోవైపు, ఇదే అంశంపై 2016లో ఒడిశాలోని అధికార బీజేడీ ఎంపీ భూపేందర్‌ సింగ్‌ రాజ్యసభలో ప్ర‌శ్న లేవనెత్తారు. కోహినూర్‌ డైమండ్‌ను వెనక్కి తీసుకురావాలని ఆయన కేంద్రాన్ని కోరారు. అలాగే, పూరీకి చెందిన భాజపా ఎమ్మెల్యే జయంత్‌ సారంగి కూడా ఈ అంశాన్ని ఒడిశా అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు.

కాగా క్వీన్‌ ఎలిజబెత్‌-2 మరణానంతరం తదుపరి రాజుగా ఆమె తనయుడు ప్రిన్స్‌ చార్లెస్‌ నియమితులయ్యారు. దీంతో ఆయన సతీమణి కెమిల్లా (డచెస్‌ ఆఫ్ కార్న్‌వాల్‌)కు రాణి హోదా దక్కింది. దీంతో అక్కడి నియమాల ప్రకారం కోహినూర్‌ వజ్రం పొదిగి ఉన్నఅత్యంత విలువైన ఈ  కిరీటాన్ని ఇకపై కెమిల్లా ధరించనున్నార‌ని స‌మాచారం.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News