ఎన్టీఆర్‌తో సూప‌ర్ స్టార్‌కు విభేదాలు..నిజ‌మేనా?

Update: 2022-11-15 11:30 GMT
ఒక‌రు విశ్వ‌విఖ్యాత  న‌ట‌సార్వ‌భౌముడు ఎన్టీఆర్‌. మ‌రొక‌రు సూప‌ర్‌స్టార్ కృష్ణ‌. ఈ ఇద్ద‌రు కూడా క‌త్తికి రెండు వైపుల ప‌దును అన్న‌ట్టుగా బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో తెలుగు తెర‌ను ఏలిన‌వారే. విభిన్న పాత్ర‌లు, సినిమాలు చేస్తూ.. త‌మ‌దైన శైలిలో తెలుగు ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేసిన వారే. అంతేకాదు.. ఇద్ద‌రూ కూడా తెలుగు భాషాభిమానులే కావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఈ ఇద్ద‌రు కూడా దాదాపు ప‌దేళ్ల‌పాటు విభేదాల‌తోనే కాలం గ‌డిపారు. ఒక‌రి సినిమాకు మ‌రొక‌రు అంటీ ముట్ట‌న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రించారు. ఈ విష‌యం అప్ప‌ట్లోనే కాదు.. ఇప్ప‌టికీ ఆస‌క్తిక‌ర‌మే!

సినిమా క‌థల విష‌యంలో ఎన్టీఆర్ లాగానే కృష్ణ కూడా ప‌ట్టుద‌ల‌తో ఉండేవారు. యువ‌త‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారిని దృష్టిలో ఉంచుకుని పాత్ర‌ల‌ను సిద్ధం చేసుకునేవారు. ఈ క్ర‌మంలో ఎన్టీఆర్ కోసం రెడీ చేసిన ఒక సినిమాను.. అనూహ్యంగా కృష్ణ‌తో తీశాడు ఆదుర్తి సుబ్బారావుగారు.

ఈ విష‌యం తెలిసిన ఎన్టీఆర్ ఇది కృష్ణ కావాల‌నే చేశార‌ని భావించారు. ఇలా మొద‌లైన విభేదాలు.. త‌ర్వాత మ‌రింత పెరిగాయి. దాదాపు ప‌దేళ్ల పాటు ఒక‌రినొక‌రు ఎదురు కూడా ప‌డ‌లేదు. ఇలా.. సాగుతున్న క్ర‌మంలోనే కృష్ణ అల్లూరి సీతారామ‌రాజు సినిమాను తీశారు.

ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యింది. ఈ విష‌యం తెలిసిన ఎన్టీఆర్‌.. పోటీగా తాను కూడా ఇదే సినిమా తీయాల‌ని అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పరుచూరి బ్రదర్స్ను కథ రాయమని అడిగారు. అయితే పరుచూరి బ్రదర్స్.. కృష్ణ అల్లూరి సినిమా చూశారా అని అడిగారట. అప్పుడు ఎన్టీఆర్ చూడలేదు అంటే.. ఓ సారి చూడండి అని సలహా ఇచ్చారట. కానీ, ఎన్టీఆర్ మాత్రం చూడ‌ద‌లుచుకోలేదు. పోనీ.. క‌థ రాయిద్దామంటే ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ కూడా ఒప్పుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే.. ఒక‌రోజు అనుకోకుండా.. వాహినీ స్టూడియోలో ఎన్టీఆర్‌, కృష్ణ‌లు తార‌స‌ప‌డ్డారు.

దీంతో  'బ్రదర్ ఇలా రండి' అంటూ ఎన్టీఆరే జోక్యం చేసుకుని కృష్ణ‌ను ప‌ల‌క‌రించారు. అంతేకాదు, అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని చూడాలనుకుంటున్నాన‌ని,  మీరే దగ్గరుండి చూపించాలని అడిగారట‌. వెంటనే ప్రింట్ తెప్పించిన కృష్ణ‌.. పక్కనే కూర్చుని చూపించారు.

ఇంటర్వెల్కే అద్భుతంగా ఉందని, ఇక సినిమా మొత్తం అయిపోయాక కృష్ణ‌ను కౌగిలించుకుని మ‌రీ ఎన్టీఆర్‌ ప్రశంసించారట‌. త‌ర్వాత‌.. కొన్నాళ్ల‌కు.. ఎన్టీఆర్ ఇంట్లో జ‌రిగిన శుభ‌కార్యానికి కృష్ణ‌ను ప్ర‌త్యేకంగా ఆహ్వానించ‌డంతో వీరిమ‌ధ్య ఉన్న వివాదాల‌కు ఫుల్ స్టాప్ ప‌డింద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో కృష్ణ చెప్పుకొచ్చారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News