ఆహా : కేసీఆర్ భూముల‌ను మోడీ అమ్ముతున్నాడా ?

Update: 2022-06-21 14:30 GMT
హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బ‌న్స్ లిమిటెడ్‌, ఇండియ‌న్ డ్ర‌గ్స్ అండ్ ఫార్మాసూటిక‌ల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ మెషీన్ టూల్స్‌, సిమెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ మెషీన్ టూల్స్‌, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల‌కు సంబంధించి తెలంగాణ‌లో గ‌తంలో కేటాయించిన భూములు ఇప్పుడు వివాదాల‌కు తావిస్తున్నాయి. ఇవ‌న్నీ రాష్ట్ర ప్ర‌భుత్వం స‌దుద్దేశంతో ఇచ్చినా వీటిని అమ్ముకునేందుకు కేంద్రం ముందుకు రావ‌డం అన్న‌ది శోచ‌నీయం అని టీ స‌ర్కారు అంటోంది. అభిప్రాయ‌ప‌డుతోంది.

గ‌త కొద్ది నెల‌లుగా కేంద్రానికి,  తెలంగాణ రాష్ట్రానికి మ‌ధ్య వివాదం న‌డుస్తోంది. ముఖ్యంగా ఇప్ప‌టికే త‌మ అధీనంలో ఉన్న కొన్ని ప్ర‌భుత్వ  రంగ సంస్థ‌ల‌ను కేంద్రం విక్ర‌యించేందుకు పావులు క‌దుపుతోంది. దీనిని అడ్డుకునేందుకు కేసీఆర్ స‌ర్కారు కొంత మేర‌కు ప్ర‌య‌త్నించినా అవేవీ స‌ఫ‌లీకృతం కావ‌డం లేదు అన్న వాద‌న కూడా ఉంది.

సింగ‌రేణి బొగ్గు గ‌నుల కేటాయింపుల్లోనూ ఇదే విధంగా వ్య‌వ‌హ‌రిస్తుంది అన్న వాదన ఉంది. ఇవ‌న్నీ స‌మాఖ్య స్ఫూర్తికి విఘాతంగానే ఉన్నాయి అని టీఆర్ఎస్ వ‌ర్గాలు త‌రుచూ రోడ్డెక్కుతున్నాయి. అయినా కూడా ఇవేవీ ప‌ట్టించుకోకుండా కేంద్రం త‌న‌దైన శైలిలో రాజ‌కీయం చేసుకుంటూనే, ఆస్తుల అమ్మకం య‌థేచ్ఛ‌గా సాగిస్తోంది.

కేంద్రం ఇచ్చిన నిబంధ‌న‌ల ప్ర‌కారం కొన్ని సంస్థ‌ల ఏర్పాటే ల‌క్ష్యంగా భూములు ఇచ్చిన  రాష్ట్ర స‌ర్కారుకు ఇప్పుడు చుక్క‌లు క‌న‌ప‌డుతున్నాయి అని తెలుస్తోంది.  ఏక ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించి భూములు అమ్ముకోవాల‌ని చూడ‌డం అత్యంత హేయ‌మైన చ‌ర్యే అని టీ స‌ర్కారు అభిప్రాయ‌ప‌డుతూ ఢిల్లీ పెద్ద‌ల‌తో ప్ర‌స్తుతానికి మాట‌ల యుద్ధం చేస్తోంది. రేప‌టి వేళ ఆందోళ‌న‌లు  తీవ్ర త‌రం అయ్యే అవ‌కాశాల‌ను కూడా కొట్టిపారేయ్య‌లేం.

కేంద్రానికి తాము సేక‌రించి ఇచ్చిన కోట్లు విలువ చేసే భూముల‌ను ప్ర‌ధాని మోడీ చెప్పా పెట్ట‌కుండా అమ్ముకుంటున్నార‌ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపిస్తూ ఉన్నారు.  ఏడు వేల రెండు వంద‌ల ఎక‌రాల భూమిని ఇప్ప‌టికే వేర్వేరు కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల ఏర్పాటుకు తాము ఇచ్చామ‌ని, వాటి విలువ ప్ర‌స్తుతం న‌ల‌భై వేల కోట్లు ఉంటుంద‌ని, వాటినే త‌మ‌కు చెప్ప‌కుండా అమ్ముకుంటూ ఆదాయం పిండుకోవాల‌ని చూస్తున్నార‌ని అభియోగాలు చేస్తున్నారు.

అస‌లు ఇంత‌టి అధికారం ఎవ‌రు ఇచ్చారు అన్న‌ది కేటీఆర్ ప్ర‌శ్న. తాము   స్కై వే  కోసం భూములు అడిగితే మార్కెట్ వాల్యూ ప్రకారం చెల్లించాల‌ని కేంద్రం అంటోంది అని, కానీ అదే త‌మ భూములు మాత్రం మూడో కంటికి తెలియ‌కుండా అమ్ముకోవాల‌ని చూస్తోంద‌ని మండిప‌డ్డారాయ‌న.
Tags:    

Similar News