మోడీ - అమిత్ షా..ఇప్పుడు రెడీనా ఒకే ఎన్నిక‌ల‌కు?

Update: 2020-02-14 03:30 GMT
మొన్న‌టి వ‌ర‌కూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు ఒక దేశం- ఒకే ఎన్నిక అంటూ చాలా ఉబ‌లాట‌ప‌డ్డారు. వారికి ఈ ఆలోచ‌న కొత్త‌ది ఏమీ కాదు. గ‌త ప‌ర్యాయం తాము అధికారంలో ఉన్న‌ప్పుడే అందుకు స‌మాలోచ‌నలు చేశారు. సీఈసీ ద‌గ్గ‌ర ఈ ప్ర‌తిపాద‌న పెట్టారు. వివిధ పార్టీల అభిప్రాయాల‌ను తీసుకున్నారు. అయితే అప్ప‌ట్లో ఎన్డీయేతర పార్టీలు ఆ విష‌యంలో అభ్యంత‌రం చెప్పాయి. 'ఒక దేశం- ఒకే ఎన్నిక' అనేది అవ‌స‌రం లేద‌ని వారు వాదించారు. అప్ప‌ట్లో మోడీ స‌ర్కారు త‌గ్గింది.

అయితే 2019 ఎన్నిక‌ల్లో సంచ‌ల‌న విజ‌యం సాధించాకా మ‌ళ్లీ ఒక దేశం ఒకే ఎన్నిక అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. అందుకు రంగం సిద్ధం అన్నారు. ఈ సారి మూడేళ్ల‌కే మోడీ స‌ర్కారు కూడా ఎన్నిక‌ల‌కు వెళ్తుంద‌ని, దేశంలోని అన్ని అసెంబ్లీల‌కూ అప్పుడే ఎన్నిక‌ల‌ను కూడా పెట్టేస్తుంద‌నే ఊహాగానాలు వ్యాపించాయి. మొద‌ట్లో ఆ హ‌డావుడి జ‌రిగింది. అయితే ఆ త‌ర్వాత క‌థ క్ర‌మంగా మారుతూ వ‌స్తోంది.

మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా, జార్ఖండ్.. ఇప్పుడు ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో భార‌తీయ జ‌న‌తా  పార్టీకి ఊహించ‌ని ఫ‌లితాలు ఎదుర‌య్యాయి. మ‌హారాష్ట్ర‌లో కూట‌మిగా నెగ్గినా యూజ్ లేక‌పోయింది. ఇక జార్ఖండ్ లో చేతిలోని అధికారం చేజారింది. హ‌ర్యానాలో ఏదోలా కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఢిల్లీలో చిత్తు అయ్యారు! ఇలా వ‌ర‌స‌గా వివిధ రాష్ట్రాల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి వ్య‌తిరేక ఫ‌లితాలు వ‌స్తున్నాయి. బీజేపీకి 2019 లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఉన్నంత అనుకూల‌త ఇప్పుడు లేద‌ని స్ప‌ష్టం అవుతోంది.

జాతీయ వాదం మీద‌, హిందుత్వ వాదం మీద‌ - పాక్ ను బూచిగా చూపి - భావోద్వేగాల‌తో ఎన్నిక‌ల రాజ‌కీయాన్ని సాగించ‌డం ఎక్కువ కాలం సాగే ప‌ని కాద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతూ ఉన్నారు. మ‌రి ఇప్పుడు మోడీ - అమిత్ షాలు ఒక దేశం ఒకే ఎన్నిక‌కు రెడీనేనా? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయి.  ఒక్కో రాష్ట్రం త‌మ చేజారుతుంది. మ‌రి ఇప్పుడు లోక్ స‌భ‌ను ర‌ద్దు చేసి.. మ‌రో రెండేళ్ల‌లో అయినా మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు, లోక్ స‌భ‌తో పాటు.. వివిధ రాష్ట్రాల‌కు అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు మోడీ ప్ర‌భుత్వం రెడీనేనా? అంటే.. మొద‌ట్లో క‌నిపించిన దూకుడు అయితే ఇప్పుడు లేదు. కానీ మోడీ, షాలు ఏం చేస్తారో ఎవ‌రూ చెప్ప‌లేరు కూడా!
Tags:    

Similar News