పవన్ కళ్యాణ్ ఏమైనా బీజేపీ కింద పాలేరా...?

Update: 2022-11-21 07:31 GMT
పవన్ కళ్యాణ్ ప్రముఖ  సినీ నటుడు. ఆయన జనసేన పార్టీని స్థాపించి తనదైన శైలిలో రాజకీయం చేసుకుంటున్నారు. ఆయన మానాన ఆయన ఒక స్వతంత్ర  పార్టీ అధినేతగా ఉన్నారు. మరి అలాంటి పవన్ బీజేపీకి ఏమైనా తాబేదారుగా ఉన్నారా అన్న చర్చ అయితే వస్తోంది. నిజానికి బీజేపీతో జనసేనకు మిత్ర బంధం ఉంది. అది ఎంతవరకూ సక్సెస్ ఫుల్ గా సాగుతోందో అందరికీ తెలిసిందే.

ఎవరి దారిలో వారు ఉన్నారు. ఏపీలో చూస్తే మూడవ శక్తిగా జనసేనకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓటింగ్ కూడా ఆ పార్టీకే ఎక్కువగా ఉంది. అయితే నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ మిత్రపక్షం పేరిట జనసేనను శాసిస్తోందా అన్న చర్చ అయితే ఆంధ్రా రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. దానికి తాజాగా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్.

ఆయన జనసేన గురించి ఆ పార్టీని తమ నియంత్రణలో ఎలా పెట్టుకుంటామో చెప్పిన తీరు గురించి అంతటా చర్చ అయితే సాగుతోంది. పొత్తుల పేరిట ఇతర పార్టీలను తమ వైపు ఆకర్షించడం వేరు. ఏకంగా మేము శాసితామని చెప్పడం వేరు. జనసేన రాజకీయ విధానాన్ని కూడా మేమే డిక్టేట్ చేస్తామన్న తీరులో సోము వీర్రాజు తాజా ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు.

అదెలా అంటే ఏపీలో తాము వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోమని సోము చెప్పేసారు. తమ పొత్తు మిత్ర బంధం అంతా జనసేనతోనే అని కూడా అన్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ అదే నోటితో జనసేనను టీడీపీతో కలవనీయకుండా చేస్తామన్నట్లుగా చెప్పడమే ఇపుడు మ్యాటర్ గా ఉంది.

కుటుంబ పార్టీలు ఏపీలో రాజ్యమేలుతున్నాయి. వాటి వల్ల కలిగే నష్టాన్ని కష్టాని పవన్ కి వివరించడం ద్వారా ఆయన్ని మా వైపు ఉంచుకుంటామని సోము చెప్పుకొచ్చారు. ఆ మీదట మరో మాట అన్నారు. అదే ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది. ఆ మాట ఏంటి అంటే పవన్ మా దగ్గరే ఉండాలి.మాతోనే ఉండాలని.

ఇది కనుక చూస్తే కచ్చితంగా శాసించే విధంగానే ఉందని విమర్శలు వస్తున్నాయి. పవన్ మాతో ఉండేటట్లుగా చేసుకుంటామని చెప్పడం అంటే అది ఒక రకంగా బెదిరింపు ధోరణిగా ఉందని అంతా అంటున్నారు. మరొ సోము ఫ్లో లో అలా మాట్లాడారా లేక మరే విధంగా చెప్పారా అన్నది పక్కన పెడితే మాత్రం ఆయన కామెంట్స్ మాత్రం రచ్చ చేస్తున్నాయి.

ఈ రకమైన ప్రకటనల ద్వారా బీజేపీ తన చేతులతో జనసేనను నడిపిస్తొందా అన్న చర్చ కూడా వస్తోంది. పవన్ ఎవరితో కలవాలి ఎవరితో కలవవద్దు అన్నది బీజేపీయే చెప్పడమే చిత్రంగా ఉంది. టీడీపీతో పొత్తు వద్దని మా అధినాయకత్వం పవన్ కి చెప్పింది అని ఈ మధ్యనే సోము వీర్రాజు చెప్పారు. అంటే దాని అర్ధం పవన్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేరనా. లేక తమ ఆధీనంలో తమకు నచ్చినట్లుగా ఉండాలనా అన్నదే బిగ్ క్వశ్చన్ గా ఉంది.

పోనీ ఇంతలా పవన్ మావాడు అంటున్న బీజేపీ ఆయనను ఏ విధంగా గౌరవిస్తోంది అన్నది కనుక చూస్తే గతంలో ఆయన చెప్పిన దేని మీద వారి నుంచి సరైన స్పందల రాలేదు. బద్వేల్ బై పోల్ లో పోటీ వద్దు అని పవన్ అంటే పోటీ పడింది బీజేపీ, అలాగే పవన్ కోరినట్లుగా రోడ్డు మ్యాప్ ఇమ్మంటే అదేమీ లేదన్నట్లుగా వ్యవహరించారు.

పవన్ని ఉమ్మడి సీఎం అభ్యర్ధిగా ప్రకటించమని కోరినా మౌనం దాల్చారు. దీన్ని బట్టి చూస్తే పవన్ని తమకు ఉన్న కేంద్ర స్థాయి  అధికారాలలతో శాసించడం ద్వారా ఆయన తమ రూట్లో నుంచి తప్పించుకోకుండా చేయడమే బీజేపీ విధానమని అంటున్నారు. అలా చేయడం ద్వారా ఏపీలో ఓట్లు చీలి మరోసారి వైసీపీ అధికారంలోకి రావడమే బీజేపీ ప్లాన్ గా ఉందా అంటే డౌట్లు అలాగే ఉన్నాయి మరి.

ఏది ఏమైనా ఈ పరిణామాల మీద జనసైనికులు ఎవరూ మాట్లాడకపోవడమూ చిత్రంగా ఉంది. మరి తమది స్వతంత్ర పార్టీ అని తమకు కూడా సొంత విధానాలు ఉన్నాయని జనసేన వారు ఎందుకు గట్టిగా చెప్పలేకపోతున్నారు అన్నది కూడా ఇక్కడ చూడాల్సిన విషయం అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News