బీజేపీని పవన్ ఇరుకున పెడుతున్నారా ?

Update: 2022-09-10 13:30 GMT
జపాన్లో భద్రపరచిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలు భారత్ కు తీసుకురావాలి..ఇది జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన డిమాండ్. కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ నేతాజీ అస్థికలు మనదేశానికి తెప్పించాలని ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. పవన్ ఈ డిమాండ్ చేయటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పవన్ ఇదే డిమాండ్ ను వినిపించారు.

ఇదే విషయమై పవన్ ఎన్నిసార్లు డిమాండ్లు చేస్తున్నా బీజేపీ మాత్రం స్పందించడం లేదు. బీజేపీ వైఖరి చూస్తుంటే నేతాజీ అస్థికలను మన దేశానికి తెప్పించటం ఇష్టం లేదనే అనిపిస్తోంది. ఎందుకంటే ఇదే డిమాండ్ యూపీఏ హయాంలోనే కాదు అంతకుముందు బీజేపీ అధికారంలో ఉన్నపుడు కూడా చాలామంది వినిపించారు. ఎంతమంది డిమాండ్లు చేస్తున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న కూటములు మాత్రం సానుకూలంగా స్పందించడం లేదు.

నేతాజీ అస్థికలు భారత్ కు తెప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకని ప్రయత్నాలు చేయటం లేదనే విషయం ఎవరికీ అర్దంకావటంలేదు. ఈ విషయం మిగిలిన వాళ్ళ కన్నా మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఇంకా ఎక్కువగా తెలుసు.

తాను చేస్తున్న డిమాండ్ బీజేపీకి ఇష్టం లేదని తెలిసీ పవన్ పదే పదే ఎందుకు డిమాండ్ చేస్తున్నట్లు ? తన డిమాండ్ల వల్ల కేంద్రప్రభుత్వం ఇరుకున పడుతుందని పవన్ కు తెలీదా .

నేతాజీ అస్థికలు భారత్ కు తెప్పించటమే కాకుండా చంద్రబోస్ మనవరాలు రాజశ్రీ చౌదరి అనుమతి తీసుకుని డీఎన్ఏ పరీక్షలు కూడా చేయించాలని పవన్ డిమాండ్ ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు అస్ధికలను తమ డీఎన్ఏతో పరీక్షలు చేయించాలని చంద్రబోస్ వారసులే డిమాండ్ చేసినట్లు లేదు.

వారసులే చేయని డిమాండ్ ను పవన్ ఎందుకు చేస్తున్నారనే విషయం ఎవరికీ అంతుబట్టడంలేదు. నేతాజీ అస్ధికలు భారత్ కు తెప్పిస్తేనే కేంద్రం నిర్వహిస్తున్న ఆజాదీకీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల లక్ష్యం సిద్ధిస్తుందని మెలిక పెట్టారు. మొత్తానికి బీజేపీని పవన్ ఇరుకునపెడుతున్నట్లే ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News