మోహ‌న్ బాబును టీడీపీలో చేర్చుకోవ‌ద్ద‌ని ఒత్తిడి తెస్తోంది అందుకేనా?

Update: 2022-07-29 11:30 GMT
క‌లెక్ష‌న్ కింగ్ (ఇప్పుడు కాదు లెండి.. ఒక‌ప్పుడు) మోహ‌న్ బాబుకు ఎప్పుడు కోప‌మొస్తుందో.. ఎప్పుడు న‌వ్వుతారో ఎవ‌రికీ తెలియ‌దు. ముక్కుసూటి మ‌నిషిగా, కోపిష్టిగానే అంతా మోహ‌న్ బాబుని చూస్తారు. ఎన్టీఆర్ హ‌యాంలో అన్న‌య్యా అంటూ ఆయ‌న‌తో అత్యంత స‌న్నిహితంగా మెలిగిన మోహ‌న్ బాబు.. 1995లో చంద్ర‌బాబు టీడీపీని హ‌స్త‌గ‌తం చేసుకున్న‌ప్పుడు ఆయ‌న‌తో క‌లిసి న‌డిచారు. ఇందుకు కానుక‌గా రాజ్య‌స‌భ సీటును కూడా ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత హెరిటేజ్ వాటాల విష‌యంలో గొడ‌వ‌లు, ఇత‌ర కార‌ణాల‌తో చంద్ర‌బాబుతో విబేధాలు వ‌చ్చాయ‌ని అంటుంటారు.

గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మికి మోహ‌న్ బాబు కూడా ఒక కార‌ణ‌మ‌ని చెబుతుంటారు. క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన మోహ‌న్ బాబు గ‌త టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో తిరుప‌తిలో ఉన్న త‌న కాలేజీకి ఫీజురీయింబ‌ర్స్‌మెంట్ నిధులు ఇవ్వ‌డం లేద‌ని రోడ్లెక్కి నిర‌స‌న వ్య‌క్తం చేసి ధ‌ర్నా చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే ప‌లు మీడియా సంస్థ‌ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇచ్చి చంద్ర‌బాబును ఏకిప‌డేశారు. ఆ త‌ర్వాత కొడుకు విష్ణుతో క‌లిసి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోయినా ఆ పార్టీ త‌ర‌ఫున ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం కూడా చేశారు.

ఇందుకు న‌జ‌రానాగా మోహ‌న్ బాబుకు రాజ్య‌స‌భ సీటు లేదా టీటీడీ చైర్మ‌న్ లేదా ఏదైనా కేబినెట్ హోదాతో కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తార‌ని వార్త‌లు వ‌చ్చినా ఏదీ నిజం కాలేదు. మ‌రోవైపు సినిమా టికెట్ల వ్య‌వ‌హారంలో వైఎస్ జ‌గ‌న్ త‌న‌ను పెద్ద‌గా గుర్తించ‌కుండా చిరంజీవికి పెద్ద‌పీట వేయ‌డం కూడా మోహ‌న్ బాబుకు న‌చ్చ‌లేద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ విష‌యంలో వైఎస్ జ‌గ‌న్ వైఖ‌రిపై ఆయ‌న అలిగార‌ని స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల తాను బీజేపీ మ‌నిషిన‌ని, బీజేపీ భావాలే త‌న‌కు ఉన్నాయ‌ని వ్యాఖ్య‌లు చేశారు. అంత‌కుముందు న‌రేంద్ర మోడీ ప్ర‌ధాన‌మంత్రి అయ్యాక కుటుంబ‌మంతా ఢిల్లీ వెళ్లి ఆయ‌న‌ను క‌లిసి ఫొటోలు దిగివ‌చ్చారు. తీరా ఇప్పుడు మ‌ళ్లీ చంద్ర‌బాబు వ‌ద్ద‌కు కూతురుతో క‌ల‌సి వెళ్లి ఆయ‌న‌తో గంట‌న్న‌ర‌సేపు మంత‌నాలు ఆడివ‌చ్చార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మోహ‌న్ బాబును మాత్రం టీడీపీలో చేర్చుకోవ‌ద్ద‌ని తెలుగు త‌మ్ముళ్లు చంద్ర‌బాబుపై ఒత్తిడి తెస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీని ఎంత బ‌దనాం చేయాలో అంత మోహ‌న్ బాబు చేశార‌ని.. టీడీపీ ఓట‌మిలో ఆయ‌న పాత్ర కూడా ఉంద‌ని తెలుగు త‌మ్ముళ్లు చంద్ర‌బాబుకు చెప్పిన‌ట్టు స‌మాచారం.

ముఖ్యంగా చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ ల‌తో మోహ‌న్ బాబుకు ప్ర‌స్తుతం వైరం ఉంద‌ని తెలుగు త‌మ్ముళ్లు గుర్తు చేసిన‌ట్టు చెబుతున్నారు. మూవీ ఆర్టిస్టు అసోసియేష‌న్ ఎన్నిక‌ల‌ప్ప‌టి నుంచి మెగా ఫ్యామిలీతో వైరం కొన‌సాగించి.. త‌న కొడుక్కి మ‌ద్ద‌తు కోసం మోహ‌న్ బాబు.. బాల‌కృష్ణ శ‌ర‌ణుజొచ్చార‌ని తెలుగు త‌మ్ముళ్లు అంటున్నార‌ట‌. ఇప్పుడు కాపు సామాజిక‌వ‌ర్గం మొత్తం మోహ‌న్ బాబుపై ఆగ్ర‌హంగా ఉంద‌ని.. ఇప్పుడు మోహ‌న్ బాబును టీడీపీలో చేర్చుకుంటే టీడీపీకి ఓటేయాల‌నుకున్న కాపుల‌ను దూరం చేసుకోవ‌డ‌మే అవుతుంద‌ని చంద్ర‌బాబు దృష్టికి తెచ్చార‌ట‌.

మ‌రికొంద‌రు మాత్రం ఈసారి కాపు సామాజిక‌వ‌ర్గం మొత్తం జ‌న‌సేన పార్టీకే ఓట్లేసే అవ‌కాశం ఉంద‌ని.. కాపు ఓటర్లెవ‌రూ టీడీపీకి కానీ, వైఎస్సార్సీపీకి కానీ ఓట్లేసే ప‌రిస్థితే లేద‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం. అందువ‌ల్ల మోహ‌న్ బాబును టీడీపీలో చేర్చుకున్నా ఇబ్బంది ఉండ‌ద‌ని చంద్ర‌బాబుకు తెలిపార‌ని అంటున్నారు. అయితే ఎక్కువ‌మంది మాత్రం మోహ‌న్ బాబు టీడీపీలో చేర‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు కంటే న‌ష్టాలే ఎక్కువ ఉంటాయ‌ని తేల్చిచెప్పిన‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఏ నిర్ణ‌యం తీసుకుంటార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News