టీడీపీ బీజేపీ పొత్తు సెట్ అయిపోయింది... అందుకే గోల అంతా...?

Update: 2022-12-24 07:20 GMT
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు. సమాయనుకూలంగా చేతులు కలపడమే. దాన్ని బట్టి ప్లస్ మైనస్ లను చూసుకోవాల్సి ఉంటుంది. ఇక చూస్తే 2014 ఎన్నికల వేళకు తెలుగుదేశం పార్టీ బీజేపీల మధ్య పొత్తు కుదిరింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఏపీలో గెలిచింది. అయితే ఆనాడు తెలంగాణాలో బీజేపీ టీడీపీ పొత్తు వల్ల బీజేపీకి అయిదు సీట్లు లభించాయి. ఇక 2018 నాటికి పొత్తులు పెటాకులు అయ్యాయి.

ఏపీలో మోడీ షాల మీద పెద్ద యుద్ధమే చంద్రబాబు చేశారు. అయితే 2019లో ఓటమి తరువాత మొత్తం సీన్ మారిపోయింది. చంద్రబాబు మళ్ళీ కమలం కోసం పొద్దుతిరుగుడు పువ్వులా తిరుగుతూనే ఉన్నారు. ఇక తెలంగాణాలో కూడా పరిణామాలు చకచకా మారిపోయాయి. ప్రతీ ఉప ఎన్నికలోనూ టీయారెస్ బీజేపీ టార్గెట్ చేస్తూ వచ్చింది. దాంతో టీయారెస్ కాస్తా బీయరెస్ గా మారి బీజేపీ మీద యుద్ధం ప్రకటించింది.

ఇవన్నీ ఇల్లా ఉంటే మరో వైపు బీజేపీ బీయారెస్ ని ఓడించడానికి అన్ని రకాలైన అస్త్రాలను రెడీ చేసుకుంటోంది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితుడైన మీడియా మొఘల్ ని అమిత్ షా కలిశారు. ఆయనతో చర్చలు జరిపారు. ఆ మీడియా మొఘల్ తెలుగుదేశం మేలు కోరుకున్న వారు కావడంతో బీజేపీ టీడీపీల పొత్తునకు అక్కడ బీజం పడింది అని అంటున్నారు.

అదే విధంగా జూనియర్ ఎన్టీయార్ ని అమిత్ షా స్వయంగా పిలిపించుకుని హైదరాబాద్ లోని తాను బస చేసిన హొటల్ లో డిన్నర్ చేశారు. ఎన్టీయార్ కూడా టీడీపీకి చెందినవారే. ఇలా ముందు నుంచి ప్లాన్ ప్రకారమే టీడీపీ బీజేపీల మధ్య పొత్తుకు రూట్ పడింది అని అంటున్నారు. ఇక ఇపుడు మరో అడుగు ముందుకు పడింది.

అందుకే చంద్రబాబు ఖమ్మం జిల్లా టూర్ పెట్టుకుని మరీ భారీ బహిరంగ సభను నిర్వహించారు.అని అంటున్నారు. ఈ పొత్తులు ఇలా ముందుకు రావడానికి మరో కారణం ఉంది అంటున్నరు. టీయారెస్ అలాగే ఉండిపోతే తెలుగుదేశాన్ని ఏపీ మూలాలు ఉన్న పార్టీ అని విమర్శించగలదు, పైగా తెలంగాణావాదాన్ని మళ్ళీ వినిపించి 2018 నాటి గెలుపుని రిపీట్ చేసుకోగలదు. అయితే టీయారెస్ బీయారెస్ గా మారింది. జాతీయ పార్టీ అని చెప్పుకుంటోంది.

ఏపీలో కూడా పోటీ చేయడానికి చూస్తోంది. దాంతో చంద్రబాబు తెలంగాణాలో ప్రవేశించి హడావుడి చేసినా ఏమీ చేయలేని పరిస్థితి. మరో వైపు చూస్తే బీజేపీకి కూడా టీడీపీతో పొత్తు అంటే 2018 నాటి కాంగ్రెస్ అనుభవాలు గుర్తుకు వస్తాయి. అందుకే ఇన్నాళ్ళూ ఆగింది. ఇపుడు బీయరెస్ గా టీయారెస్ మారడంతో బీజేపీకి కూడా టీడీపీతో పొత్తుకు ఏ అభ్యంతరం లేకుండా పోతోంది.

అందుకే చంద్రబాబు తెలంగాణలో పెద్ద ఎత్తున తిరుగుతూ చెడుగుడు ఆడిస్తున్నారు. అంతే కాదు మళ్లీ హైదరాబాద్ అభివృద్ధి అంటూ మాట్లాడుతున్నారు. ఉత్తర తెలంగాణా జిల్లాలలో కూడా వరసబెట్టి సభలను నిర్వహించి తెలుగుదేశాన్ని బలోపేతం చేయడానికి బాబు చూస్తున్నారు. తెర వెనక బీజేపీ టీడీపీ పొత్తు ఖరారు అయిపోయింది అని అంటున్నారు. సరైన సమయం చూసి రెండు పార్టీలు పొత్తు మీద ప్రకటన చేస్తాయని అంటున్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణాలో ఉన్న ఆ పొత్తు ఏపీకి కూడా పాకడం ఖాయం కాబట్టి వైసీపీ ఇపుడు టోన్ పెంచి మరీ చంద్రబాబు మీద విమర్శలు చేస్తోంది అని అంటున్నారు. మరో వైపు బీయారెస్ నేతలు కూడా అవే ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీతో పొత్తు కోసమే చంద్రబాబు ఈ ఎత్తులు వేస్తున్నారు అని బీయారెస్ నేతలు అంటే ఈ పార్టీ కాక పోతే ఆ పార్టీ ఈ రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రం అంటూ  జగన్  కూడా విమర్శలు గుప్పించారు. దీని బట్టి చూస్తే రెండు పార్టీలు చంద్రబాబుని టార్గెట్ చేయడం వెనక పొత్తుల కధ ఉందని అంటున్నారు. మొత్తానికి బీజేపీ టీడీపీ లోపాయికారి పొత్తు బయటపడిన నాడు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనాలు నమోదు అవుతాయని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News