భూ కబ్జాలకు టీడీపీ మద్దతు పలుకుతోందా?

Update: 2020-10-25 04:30 GMT
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే  అందరిలోను ఇదే అనుమానలు పెరిగిపోతున్నాయి. తాజాగా విశాఖపట్నంకు సమీపాన ఉన్న రుషికొండ, ఎందాడ ప్రాంతాల్లోని గీతం విశ్వవిద్యాలయంకు చెందిన కాంపౌండ్ ను, ప్రధాన ద్వారాన్ని రెవిన్యు అధికారులు కూల్చేశారు. పోలీసుల కాపలాతో జేసీబీలను పెట్టి శనివారం అర్ధరాత్రి తర్వాత కూల్చివేతలు మొదలయ్యాయి. దీనిపై చంద్రబాబునాయుడు, లోకేష్ తో పాటు యావత్ టీడీపీ నేతలు  గోల మొదలుపెట్టారు. వీళ్ళకు మద్దతుగా నిలబడే మీడియా కూడా కూల్చివేతలనే ప్రధానంగా హైలైట్ చేస్తోంది.

అసలు విషయం ఏమిటంటే విశ్వవిద్యాలయానికి చెందిన ఏ భవనాన్ని ప్రభుత్వం కూల్చలేదు. కాకపోతే యాజమాన్యం కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవటంలో భాగంగానే కాంపౌండ్ వాల్, ప్రధాన ద్వారాన్ని కూల్చేసింది. సంవత్సరాల తరబడి యాజమాన్యం ప్రభుత్వానికి చెందిన 40 ఎకరాలను కబ్జా చేసి తన ఆధీనంలో ఉంచేసుకుంది. దాని ప్రస్తుత విలువ సుమారు రూ . 800 కోట్లు. గీతం యాజమాన్యం ఆధీనంలో ప్రభుత్వ భూమి ఉందన్న విషయం ఎప్పటి నుండో అందరు చెప్పుకుంటున్నదే. కాకపోతే అప్పట్లోని ప్రభుత్వాలకు యాజమాన్యం సన్నిహితంగా ఉన్న కారణంగానే ఎవరు దానిజోలికి వెళ్ళలేదు.

చివరగా చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడే కబ్జా భూమికి సంబంధించిన నోటీసులు యాజమాన్యానికి వెళ్ళింది. అయితే ఆ తర్వాత ఎటువంటి చర్యలు లేవు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే కబ్జాపై దృష్టి పెట్టింది. దీనికన్నా ముందు విశాఖ నగరంలోని సీతమ్మధార ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ స్ధలాన్ని ఆక్రమించిన కారణంగా మాజీ మేయర్, మాజీ ఎంపి సబ్బంహరి ఇంటి కాంపౌండ్ వాలును కూడా ప్రభుత్వం కూల్చేసిన సంగతి తెలిసిందే. ఇదే పద్దతిలో గీతం విశ్వ విద్యాలయం కాంపౌండ్ వాలును కూడా కూల్చేసింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇటు సబ్బం అయినా అటు గీతం అయినా ప్రభుత్వ స్ధలాలను దర్జాగా కబ్జా చేసేశారు. కబ్జాలో ఉన్న ప్రభుత్వ స్ధలాన్ని స్వాధీనం చేసుంటుంటే టీడీపీ నేతలు గోల చేస్తుండటమే విచిత్రంగా ఉంది. అంటే కబ్జాలను చంద్రబాబు అండ్ కో ప్రోత్సహిస్తున్నారా ? అన్న అనుమానాలు పెరుగుతున్నాయి.  నిజానికి చంద్రబాబు హయాంలోనే గీతం చెరలో ఉన్న 40 ఎకరాలను క్రమబద్దీకరిస్తే ఇపుడు గొడవుండకపోను. మరపుడు ఎందుకు చేయలేదు ?  ఇదే ప్రశ్న మంత్రి అవంతి శ్రీనివాస్ అడుగుతుంటే టీడీపీ నుండి సమాధానం లేదు. ఏదేమైనా కబ్జాలో ఉన్న స్ధలాన్ని విడిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే దాన్ని చంద్రబాబు లాంటి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వ్యతిరేకించటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు.
Tags:    

Similar News