కేంద్రప్రభుత్వం సీఎంను వేధిస్తోందా ?

Update: 2022-04-29 06:33 GMT
వినటానికే ఆశ్చర్యంగా ఉన్నా వాస్తవానికి జరుగుతున్నదిదే. ఎప్పుడైతే నరేంద్రమోడి, అమిత్ షా లాంటి అగ్రనేతలందరినీ కాదని ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమత్రయ్యారో అప్పటినుండే వేధింపులు మొదలయ్యాయి. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ఆప్ ప్రభుత్వాన్ని రద్దుచేసి లేదా రద్దుచేయకుండానే మొత్తం పాలనా పగ్గాలను తన చేతిలోకి తీసుకోవాలని ఎన్నిసార్లు నరేంద్రమోడి సర్కార్ ప్రయత్నించినా సాధ్యంకాలేదు.

ఢిల్లీలో పాలనపై కేంద్రప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని నరేంద్రమోడి చాలా పట్టుదలగా ఉన్నారు. అందుకనే ప్రభుత్వంలోని మొత్తం ఐఏఎస్ అధికారులే కాకుండా అధికార యంత్రాంగం కూడా తమ చెప్పుచేతుల్లోనే ఉండేట్లుగా పార్లమెంటులో చట్టాలను కూడా చేసింది. అయితే దీన్ని కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై చివరకు కోర్టులో  పిటీషన్ దాఖలైంది.

ఇప్పటికే ప్రభుత్వం తనిష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకునే అవకాశంలేకుండా కేంద్రప్రభుత్వం లెఫ్ట్ నెంట్ జనరల్ ద్వారా వ్యవహారాలను నడిపిస్తోంది. ప్రస్తుతం ఐఏఎస్ వ్యవస్ధతో పాటు కిందస్ధాయి ఉద్యోగులు మాత్రమే ఢిల్లీ ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు.

యావత్ పోలీసు యంత్రాంగం మొత్తం కేంద్రప్రభుత్వం చెప్పుచేతల్లోనే ఉంటున్నారు. అయినా నరేంద్రమోడీ ప్రభుత్వానికి అదిసరిపోలేదు. కేజ్రీవాల్ ను రాచిరంపాన పెట్టడమే మోడీ ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకున్నది.

మూడోసారి ముఖ్యమంత్రయిన కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని మోడి సర్కార్ తట్టుకోలేకపోతోంది. ఒకవైపు దేశవ్యాప్తంగా మోడి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇదే సమయంలో కేజ్రీవాల్ కు క్రేజు పెరుగుతోంది. పంజాబ్ లో అఖండ విజయంతో అధికారంలోకి రావటమే దీనికి ఉదాహరణ. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు చోట్ల బీజేపీనే అధికారంలోకి వచ్చినా దానికి అనేక కారణాలు దోహదపడ్డాయి.

కేంద్రంలో అధికారంలో ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఢిల్లీపై పాలనా ఆధిపత్యం విషయంలో జరిగిన విచారణలో సుప్రింకోర్టు ఏమని తీర్పిస్తుందో చూడాలి. ఏదోరకంగా కేజ్రీవాల్ ను సతాయించటమే మోడి టార్గెట్ గా పెట్టుకున్న విషయం స్పష్టమైపోతోంది. దేశ రాజధానిలో  తమకు బద్ధ విరోధపార్టీ అధికారంలో ఉండటాన్నిబీజేపీ పెద్దలు తట్టుకోలేకపోతున్నారు. అందుకనే ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు. మరి చివరకు కోర్టు ఏమని తీర్పిస్తుందో చూడాల్సిందే.
Tags:    

Similar News