భూమి దిశగా దూసుకొస్తున్న 'చైనా' రాకెట్.. ముప్పు తప్పదా?

Update: 2022-11-04 10:31 GMT
రోజురోజుకు చైనా ప్రపంచానికి పెను సవాలుగా మారుతోంది. బయో వార్.. కరోనాలతో చైనా ఇప్పటికే మానవళికి తీరని నష్టాన్ని కలిగించింది. కరోనా దెబ్బ యావత్ ప్రపంచం అస్తవ్యస్తం కాగా ఒక్క చైనా మాత్రమే ఆర్థికంగా మరింత బలపడింది. ఇప్పుడిప్పుడే ఈ మహమ్మరి నుంచి ప్రపంచ దేశాలు క్రమంగా కోలుకుంటున్నాయి.

కాగా మరోసారి చైనా ప్రపంచానికి మరో ముప్పును తెచ్చిపెట్టిందనే వాదనలు విన్పిస్తున్నాయి. ఈసారి లాంగ్ మార్చి 5బీ రాకెట్ రూపంలో రాబోతుందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా చైనా న్యూ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ నిర్మాణాన్ని కొన్నాళ్లుగా చేపడుతోంది.

ఇందులో భాగంగా గత సోమవారం లాంగ్ మార్చ్ 5 బీ రాకెట్ చివరి మాడ్యూల్ ను విజయవంతంగా ప్రయోగించినట్లు చైనా ప్రకటించింది. అయితే ఈ రాకెట్ భూకక్ష్యను చేరుకున్న తర్వాత తిరిగి భూమిపైకి ప్రవేశించనుంది.  న్యూ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ నిర్మాణంలో భాగంగా చైనా 5  బీ రాకెట్ ప్రయోగాలు గత రెండేళ్లలో మూడుసార్లు ప్రవేశపెట్టింది.

గత సోమవారం ప్రయోగించిన రాకెట్ నాలుగోది కావడం విశేషం. ఇంతకముందు సైతం చైనా ప్రయోగించిన రాకెట్లు భూ కక్ష్యలోకి వచ్చి మండిపోయాయి. అయితే గతేడాది లాంగ్‌ మార్చ్‌ 5బీ రాకెట్‌ శకలాలు ఎలాంటి నియంత్రణ లేకుండానే భూ వాతావరణంలోకి ప్రవేశించి మాల్దీవుల సమీపంలో కుప్పకూలాయి.

ఇక ఈ ఏడాది జులైలో ప్రయోగించిన రాకెట్‌ శకలాలు మలేసియా, ఇండోనేషియా సమీపంలోని ఓ ద్వీపం లో.. ఫిలిప్పీన్స్‌ సమీపంలోని సముద్రంలో పడిపోయినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. కాగా ఈసారి కూడా లాంగ్ మార్చ్ 5 బీ రాకెట్ భూ కక్ష్య లోకి వెళ్లి తిరిగి భూమి పైకి రానుంది. ఇందుకు సంబంధించి 28 గంటల రీ ఎంట్రీ ప్రక్రియ శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం వరకు కొనసాగనుంది.

సుమారు పది అంతస్థుల ఎత్తైన భవనం ఆకారంలో ఉండే ఈ రాకెట్ లోని కొంత భాగం భూ వాతావరణంలోకి తిరిగి వచ్చే సమయంలో దీనిలో కొన్ని భాగాలు మండిపోయే అవకాశం ఉంది. వీటి శకలాలు భూమిపై ఎక్కడ పడుతాయనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదని ఏరోస్పేస్‌ కార్పొరేషన్‌ పేర్కొనడం ఆందోళనను కలిగిస్తోంది.

శాస్త్రవేత్తల అంచనా ప్రకారం జనసాంద్రత తక్కువ ఉండే ప్రదేశాలు.. సముద్రాలు.. ఖాళీ ప్రదేశాల్లో ఈ రాకెట్ శకలాలు పడే అవకాశం ఉంది. అలా కాకుండా జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ రాకెట్ శకలాలు పడితే మాత్రం పెను ముప్పు తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు  చైనా రీ ఎంట్రీ కౌంట్ డౌన్ ప్రారంభించడంతో అందరి దృష్టి లాంగ్ మార్చ్ 5 బీ రాకెట్ ప్రయోగం పైనే నెలకొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News