కోవిడ్ సమస్య తగ్గినట్లేనా ?

Update: 2021-10-14 09:20 GMT
రాష్ట్రంలో కరోనా సమస్య తగ్గినట్లే ఉంది. ప్రభుత్వం తాజాగా వివిధ రంగాల్లో ఇచ్చిన రిలాక్సేషన్ చూస్తుంటే కరోనా మహమ్మారి బూతం ప్రభావం తగ్గిపోయినట్లే అనిపిస్తోంది. సినిమా థియేటర్లలో నూరుశాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం తాజాగా అనుమతి మంజూరుచేసింది. ఇంతకాలం మొత్తం సామర్ధ్యంలో 50 శాతం మాత్రమే టికెట్లు అమ్ముకోవాలనే నిబంధనను అమలు చేసింది. అలాంటిది గురువారం నుంచి నూరుశాతం టికెట్ల అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. దీంతో ఇకనుండి సినిమా థియేటర్లు కళకళలాడుతాయని భావిస్తున్నారు.

అలాగే కర్ఫ్యూ వేళలను కూడా రాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకే అమలు చేయబోతున్నట్లు ప్రకటించింది. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు 250 మంది వరకు హాజరవ్వచ్చని అనుమతిచ్చింది. అంటే ఇకనుండి పెళ్ళిళ్ళు, ఇతర ఫంక్షన్లు కూడా పెద్ద సంఖ్యతో కనువిందు చేయబోతున్నాయి. ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా 50 మందిని మాత్రమే వివాహాలకు ప్రభుత్వం అనుమతిస్తోంది.

నిజానికి అధికారికంగా వివాహాలు, ఇతర ఫంక్షన్లకు హాజరయ్యేవారిపై పరిమిత సంఖ్యకే అనుమతుంది. అయితే అనధికారికంగా 50 మంది కన్నా ఎక్కువే హాజరవుతున్నారు. అందుకనే తాజా రిలాక్సేషన్ లో భాగంగానే అధికారికంగానే 250 మంది హాజరవ్వచ్చని ప్రభుత్వమే అనుమతించింది. దీంతో పెళ్ళి మండపాలు మళ్ళీ కళకళలాడబోతున్నాయనే అనుకోవాలి. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన రిలాక్సేషన్ ఈనెల 31 వ తేదీవరకు అమల్లో ఉంటుంది. అప్పటికి పరిస్థితిని సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది.

పనిలో పనిగా ఇప్పుడు అమలులో ఉన్న కొన్ని జాగ్రత్తలను కూడా ప్రభుత్వం ప్రస్తావించింది. ఫంక్షన్లకు హాజరైన జనాలు కచ్చితంగా కోవిడ్ జాగ్రత్తలు పాటించాల్సిందే అని, నోటికి మాస్కులు తప్పక ధరించాల్సిందే అని గుర్తుచేసింది. శానిటైజర్ వాడకం తప్పదని, భౌతిక దూరం పాటించాల్సిందే అని చెప్పింది. భౌతిక దూరం పాటించటం మన దగ్గర అన్నిసార్లు సాధ్యం కాకపోయినా శానిటైజర్ వాడకం, మాస్కు ధరించటం మాత్రం తప్పదు. మొత్తం మీద మెల్లి మెల్లిగా కోవిడ్ సమస్య నుండి సమాజం బయటపడుతున్నదనే అనుకోవాలి.
Tags:    

Similar News