ఆ మాజీ ఎంపీ జనసేనలో చేరుతున్నారా?

Update: 2022-11-10 05:47 GMT
ఉండవల్లి అరుణ్‌ కుమార్‌.. పరిచయం అక్కర్లేని పేరు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి గట్టి అనుచరుడిగా ఉన్న ఉండవల్లి 2004, 2009 ఎన్నికల్లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో ప్రముఖ సినీ నటులు.. కృష్ణంరాజు (ప్రజారాజ్యం పార్టీ), మురళీమోహన్‌ (టీడీపీ)లను ఓడించి సంచలనం సృష్టించారు. ఇక 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పూర్తిగా సైలెంట్‌ అయిపోయారు. కాంగ్రెస్‌లో ఉన్న నాయకులంతా వేరు వేరు పార్టీల్లో చేరిపోయినా ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ మాత్రం ఏ పార్టీలోనూ చేరలేదు.

కాగా ఉండవల్లి అరుణ్‌ కుమార్‌కు మేధావిగా పేరుంది. ఏ విషయంపైన అయినా సాధికారికంగా మాట్లాడతారని చెబుతారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ మళ్లీ యాక్టివ్‌ అయ్యారు. తరచూ ప్రెస్‌మీట్లు పెట్టడం, యూట్యూబ్‌ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం చేస్తున్నారు.

ఈ క్రమంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ను విమర్శించబోనని.. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు అధికారంలోకి రాలేదని అంటున్నారు. అంతేకాకుండా జనసేన పార్టీ గతంలో కంటే బాగా బలపడిందని.. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి బాగానే సీట్లు వస్తాయని పలుమార్లు ఉండవల్లి తేల్చిచెప్పారు.

మరోవైపు పవన్‌ కల్యాణ్‌ సైతం ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ను మేధావిగా, వివిధ అంశాలపైన మంచి పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా ఆయనను గౌరవిస్తున్నారు. గతంలో విభజన అంశాలు, హామీలపై చర్చించడానికి జాయింట్‌ ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ వేసినప్పుడు ఉండవల్లి అరుణ్‌ కుమార్‌కు కూడా పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక ఆహ్వానం పంపారు. ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సైతం ఆ సమావేశానికి వచ్చారు.

అందరిలాగే పవన్‌ కల్యాణ్‌ను చూసి ఆయనతో ఫొటో తీయించుకోవాలని వచ్చానని అప్పట్లో ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ చమత్కరించారు. అప్పటి నుంచి అవకాశమొచ్చిన ప్రతిసారీ జనసేనకు అనుకూలంగానే ఉండవల్లి మాట్లాడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీలో చేరతారని టాక్‌ వినిపిస్తోంది.

ఆయన పార్లమెంటుకు పోటీ చేస్తానన్నా, అసెంబ్లీకి పోటీ చేస్తానన్నా పవన్‌ కల్యాణ్‌ అడ్డు చెప్పరని అంటున్నారు. పార్లమెంటుకు పోటీ చేస్తే రాజమండ్రి నుంచే బరిలోకి దిగే అవకాశముంది.

ఉండవల్లి అరుణ్‌ కుమార్‌పై ఎలాంటి మచ్చ లేకపోవడం, అవినీతికి ఆమడ దూరంలో ఉండటం, విషయ పరిజ్ఞానం తదితర కారణాలతో ఆయనను అభిమానించేవారు కూడా భారీగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ చేరితే ఆ పార్టీకి మంచి బూస్టేనని అంటున్నారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో ఉండవల్లి అరుణ్‌ కుమార్‌కు పెద్ద ఎత్తున అనుచర గణం ఉండటంతో ఆయన చేరితే జనసేనకు అదనపు బలం తోడవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి ఇది రూమరే అయినప్పటికీ ఏమో గుర్రం ఎగరావచ్చు అని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News