ఇదెక్కడి కొత్త పైత్యం గులాబీ బాస్? నిరసనలకు ‘అధికార’ దాడులు చేసుడేంది?

Update: 2021-11-16 05:40 GMT
మారే కాలానికి అనుగుణంగా పరిస్థితుల్లో వచ్చే మార్పుల్ని కాదనలేం. కానీ.. ఆ పేరుతో ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించటంపై మౌనంగా ఉంటే.. అందుకు భవిష్యత్తు తరాలు మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అధికార.. విపక్షాల మధ్య రాజకీయ పోరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికారపక్షం తీసుకునే నిర్ణయాల్ని తప్పు పడుతూ విపక్షాలు నిరసనలకు.. ఆందోళనలను చేపట్టటం తెలిసిందే. అయితే.. విపక్షం చేసే నిరసనలు.. ఆందోళనల కారణంగా ఆత్మరక్షణలో పడటం అధికార పక్షానికి మొదట్నించి అలవాటే. అలా అని.. తమపై చేసే రాజకీయ దాడికి ప్రతిగా భౌతికదాడులకు తెగబడటం సమాధానం కాదనే విషయాన్ని మర్చిపోకూడదు.

ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త కల్చర్ షురూ అయ్యింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మారిన సమీకరణాలు.. టీఆర్ఎస్ అధినాయకత్వంపై బీజేపీ శ్రేణులు చేస్తున్న విమర్శలు..ఆ పార్టీ కీలక నేతల వ్యాఖ్యలతో గులాబీ బ్యాచ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. ఇలాంటి వేళలో.. అధికార టీఆర్ఎస్ వర్గాల మీద మరింత ఒత్తిడిని పెంచేందుకు వీలుగా బీజేపీ పరివారం వ్యవహరిస్తున్న వైఖరిపై టీఆర్ఎస్ వర్గాలు ఉడికిపోతున్నాయి.

తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ధాన్యం కొనుగోళ్ల మీద మీ బాద్యత అంటే మీ బాధ్యత అంటూ ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకోవటం.. ఆరోపణల్ని సంధించటం లాంటివి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా టీ బీజేపీ బాధ్యుడు.. బండి సంజయ్ నల్గొండ జిల్లా పర్యటన చేయటం.. అలా చేస్తే ఆయన్ను అడ్డుకుంటామని టీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరింటం తెలిసిందే. అయితే.. ఈ హెచ్చరికల్ని లెక్క చేయని బండి సంజయ్.. రైతుల సమస్యల్ని తెర మీదకు తెచ్చేందుకు వారి వద్దకు వెళ్లటం.. ధాన్యం అమ్మకాల్లో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు.

అయితే.. బండి పర్యటనను అడ్డుకోవాలన్న నిర్ణయాన్ని తీసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు తీవ్రస్థాయిలో అడ్డుకునే ప్రయత్నం చేయటం.. ఆ సందర్భంగా రాళ్ల దాడి.. కోడిగుడ్ల దాడికి పాల్పడటం.. అందుకు ప్రతిగా బీజేపీ వర్గాలు కూడా అంతో ఇంతో ప్రతిఘటించే ప్రయత్నం చేయటం చూసినప్పుడు.. నిరసనలకు ఈ దాడుల సమాధానం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. తాజాగా బండి సంజయ్ పర్యటనలో ఏదో ఒక సారి రాళ్లు.. కోడిగుడ్ల దాడి జరగకుండా.. అదే పనిగా జరగటం చూస్తే.. కొత్త సంప్రదాయానిక గులాబీ శ్రేణులు తెర తీశాయని చెప్పాలి. ఇలాంటి కల్చర్ ఎప్పుడూ మంచిది కాదన్నది మర్చిపోకూడదు.

అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదు. కానీ.. అధికారం చేతిలో ఉన్నప్పుడు వ్యవహరించే ధోరణికి ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం అధికారపక్షానికి లేకున్నా.. భవిష్యత్తులో మాత్రం ఇలాంటివి మరిన్ని ఉద్రిక్తతలకు అవకాశం ఉంది. అధికారపక్షంలో ఉండేటప్పుడు ఉండే బలానికి.. విపక్షంలోకి వెళ్లాక మిగిలే బలానికి మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉంది.

పవర్లో ఉన్నప్పుడు మొదలు పెట్టే కొన్ని సంస్కృతులకు తర్వాతి కాలంలో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మాత్రమే కాదు.. వాటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటివేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ వర్గాల్ని గులాబీ బాస్ కేసీఆర్ కళ్లాలు వేయాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా సాగుతున్న ఈ ధోరణి రానున్న రోజుల్లో తమకే ఇబ్బందిగా మారుతుందన్న విషయాన్ని కేసీఆర్ గుర్తిస్తే మంచిది.
Tags:    

Similar News