చంద్ర‌బాబుకు ముప్పు పొంచి ఉందా.. ఎన్ఎస్‌జీ త‌నిఖీలు అందుకేనా?

Update: 2022-08-26 05:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆయా పార్టీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. విమ‌ర్శ‌ల స్థానంలో తిట్లు, బూతులు చోటు చేసుకుంటున్నాయ‌నే విమ‌ర్శ‌లు ప్ర‌జ‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అధికార పార్టీ వైఎస్సార్సీపీ, ప్ర‌తిప‌క్ష పార్టీలు టీడీపీ, జ‌న‌సేన నేత‌ల విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు హ‌ద్దులు దాటిపోతున్నాయ‌ని అంటున్నారు.

తాజాగా చిత్తూరు కుప్పంలో జ‌రిగిన అల్ల‌ర్లు, హింస.. వైఎస్సార్సీపీ, టీడీపీ మ‌ధ్య మ‌రింత ఆజ్యానికి కార‌ణ‌మవుతోంద‌ని చెబుతున్నారు. త‌మ‌నే టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు చిత‌క‌బాదారని వైఎస్సార్సీపీ ఆరోపిస్తుంటే.. అధికార పార్టీ పోలీసుల‌ను ఉప‌యోగించుకుని త‌మ‌పైనే దాడి చేయించింద‌ని ప్ర‌తిప‌క్ష పార్టీ టీడీపీ విమ‌ర్శిస్తోంది. అంతేకాకుండా టీడీపీ అధినేత చంద్ర‌బాబుపైనే వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌లు దాడికి ప్ర‌య‌త్నించార‌ని చెబుతున్నారు. జెడ్ కేటగిరీ భ‌ద్ర‌త ఉన్న చంద్ర‌బాబుకు పోలీసులు భ‌ద్ర‌త క‌ల్పించ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబుకు భ‌ద్ర‌త క‌ల్పిస్తున్న నేష‌న‌ల్ సెక్యూరిటీ గ్రూప్ (ఎన్ఎస్‌జీ) ఏపీకి వ‌చ్చి చంద్ర‌బాబు భ‌ద్ర‌త‌ను ప‌రిశీలించ‌డం హాట్ టాపిక్‌గా మారింది. కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న‌వారికి, వీఐపీల‌కు, ఉగ్ర‌వాదులు, మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న‌వారికి జెడ్, జెడ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందుకోసం దేశంలో నేష‌న‌ల్ సెక్యూరిటీ గ్రూప్ (ఎన్ఎస్‌జీ) ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఏపీలో మారిన రాజ‌కీయ ప‌రిస్థితులు, ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన‌డంతో ఎన్ఎస్‌జీ డీఐజీ స‌మ‌ర‌దీప్ సింగ్ నేతృత్వంలోని బృందం ఏపీకి వ‌చ్చి త‌నిఖీలు చేప‌ట్టింది. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యాన్ని, ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు నివాసాన్ని ప‌రిశీలించింది. ప్ర‌తి అంత‌స్తుకి, ప్ర‌తి గ‌దికి వెళ్లి నిశిత ప‌రిశీల‌న చేసింది.

టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో చంద్రబాబు చాంబర్‌, ఆయన సందర్శకుల్ని ఎక్కడ కలుస్తారు? ఆయనను కలిసేందుకు వచ్చేవారిని ఎలా తనిఖీ చేస్తున్నారు? ఏయే పరికరాలను వినియోగిస్తున్నారు? స్థానిక పోలీసులు ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు? వంటి విషయాలను ఎన్ఎస్‌జీ స‌మ‌ర‌దీప్ సింగ్ సేక‌రించారు. టీడీపీ కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ ప‌రుచూరి అశోక్‌బాబు... ఆయ‌న‌కు అన్ని వివరాలూ అంద‌జేశారు.

పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ప‌రిశీల‌న అనంతరం సమరదీప్ సింగ్‌ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలోనూ భద్రతాపరమైన అంశాల్ని త‌నిఖీ చేశారు. చంద్ర‌బాబు భ‌ద్ర‌త‌కు సంబంధించి పలువురు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల్నీ సైతం ఎన్‌ఎస్‌జీ డీఐజీ స‌మ‌ర‌దీప్ సింగ్ కలిసినట్టు చెబుతున్నారు. చంద్రబాబు పర్యటనల్లో ఇటీవల వైఎస్సార్సీపీ నాయకులు తరచూ గొడవలు సృష్టిస్తుండటడం, కొన్ని నెలల క్రితం టీడీపీ కార్యాలయంపై వైఎస్సార్సీపీ నాయకుల ప్రోత్సాహంతో అల్లరి మూకల దాడి చేయ‌డం తాజాగా కుప్పంలో చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి వంటి పరిణామాల నేపథ్యంలో చంద్ర‌బాబు భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింద‌ని చెబుతున్నారు. చంద్రబాబుకి కల్పిస్తున్న భద్రతను పర్యవేక్షించేందుకు ఎన్‌ఎస్‌జీ డీఐజీ స‌మ‌ర‌దీప్ సింగ్ రావడం అందులో భాగమేనని పేర్కొంటున్నారు.
Tags:    

Similar News