బోండా సీటులో ట్విస్ట్ లేదా..?

Update: 2022-01-08 08:30 GMT
ఇటీవల కృష్ణా జిల్లా రాజకీయాల్లో వంగవీటి రాధా అంశం బాగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న ఆయన...అనూహ్యంగా కొందరు తనని చంపడానికి రెక్కీ నిర్వహించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కొడాలి నాని, వల్లభనేని వంశీల సమక్షంలో చేశారు. దీంతో కొడాలి నాని, పోలీసు పెద్దలతో మాట్లాడి సెక్యూరిటీ కూడా పెట్టించారు. సీఎం జ‌గ‌న్ సైతం ఈ విష‌యం గురించి ఆరా తీయ‌డంతో పాటు రాధాకు ప్ర‌త్యేక భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ భ‌ద్ర‌త‌ను రాధా తిర‌స్క‌రించారు. ఈ పరిణామాలతో రాధా వైసీపీ వైపుకు వెళుతున్నారని ప్రచారం మొదలైంది.

రాధా ఈ ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే ఆయనని వరుసపెట్టి టీడీపీ నేతలు కలిశారు. ఇక చంద్రబాబు సైతం, రాధా ఇంటికి వెళ్ళి పరామర్శించారు. రాధాకు అన్నివిధాలా అండగా ఉంటామని చెప్పారు. దీంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. రాధా టీడీపీలోనే కొనసాగుతున్నారని క్లారిటీ వచ్చింది. ఇదే సమయంలో ఆయన, కాపు వర్గాన్ని టీడీపీకి దగ్గర చేసే పనిలో ఉన్నారని తెలిసింది. మళ్ళీ పార్టీని గెలిపించడానికి కృషి చేస్తున్నారని తెలిసింది. ఇదే సమయంలో ఆయన మళ్ళీ ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధమవుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని ప్రచారం మొదలైంది.

అది కూడా తన సొంత సీటు విజయవాడ సెంట్రల్‌లో పోటీ చేస్తారని టాక్ వస్తుంది. అయితే సెంట్రల్‌లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఉన్నారు. ఇక ఆయన, రాధా కోసం తన సీటుని త్యాగం చేయక తప్పదని ప్రచారం జ‌రుగుతోంది. అయితే ఇదంతా కేవలం ప్రచారమే అని తెలుస్తోంది. అసలు రాధా సీటు విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదని, ఆయన పోటీ చేస్తానని కూడా అడగడలేదని బెజవాడ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. ఇటు బోండా కూడా సెంట్రల్‌లోనే పనిచేస్తున్నారు.

పైగా ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం 25 ఓట్ల స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. బోండా ప‌దేళ్లుగా సెంట్ర‌ల్ సీటులో టీడీపీని ప‌టిష్టం చేస్తూ అక్క‌డ నాయ‌కుడిగా ఎదిగారు. ఇప్పుడు రాధా కోసం ఉమాను త‌ప్పిస్తే మ‌ళ్లీ అక్క‌డ పెద్ద ముస‌లం మొద‌ల‌వుతుంది. ఇప్ప‌టికే వెస్ట్‌లో ఉన్న గొడ‌వ‌ల‌కు తోడు అప్పుడు సెంట్ర‌ల్ కూడా పెద్ద కిచిడీగా మారుతుంది. బాబు కూడా ఆ రిస్క్ చేయ‌ర‌ని.. రాధాకు ప్రాధాన్యం ఇవ్వాల‌నుకుంటే అది మ‌రో యాంగిల్లోనే ఉంటుంద‌ని టీడీపీ నేత‌లు చెపుతున్నారు.
Tags:    

Similar News