ఐపీఎల్ నుంచి సురేష్ రైనా తప్పుకోవడానికి అసలు కారణం అదేనా?

Update: 2020-08-30 07:10 GMT
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2020 సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా అనూహ్యంగా తప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి రైనా తప్పుకున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కేఎస్ విశ్వనాథన్ ప్రకటించాడు. దాంతో.. ఆ కారణాలేంటి..? అని పెద్ద ఎత్తున అభిమానులు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీని ప్రశ్నించడంతో.. ఎట్టకేలకి సమాధానం లభించింది.

సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకానుండగా.. ఆగస్టు 21న యూఏఈకి చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆరు రోజులు క్వారంటైన్‌లో ఉంది. ఆ క్వారంటైన్ గడువు శుక్రవారంతో ముగియాల్సి ఉండగా.. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్‌ దీపక్ చాహర్‌తో పాటు 10 మంది టీమ్ స్టాఫ్‌కి కరోనా పాజిటివ్‌గా శుక్రవారం తేలింది. దాంతో.. సురేశ్ రైనా శుక్రవారం రాత్రి తీవ్ర భయాందోళనకి గురైనట్లు వెలుగులోకి వచ్చింది. శనివారం చెన్నై టీమ్‌ యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌‌కి కూడా కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే.
 
ఇక మరో వాదన కూడా వినిపిస్తోంది.  చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవడంతో శుక్రవారం రాత్రి భయాందోళనకి గురైన రైనా.. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, హెడ్‌కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్‌తో పదే పదే చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాను ఐపీఎల్ 2020 సీజన్ నుంచి తప్పుకుని.. ఇండియాకి వెళ్లిపోతున్నట్లు వారితో రైనా స్పష్టం చేశాడట. కానీ.. రైనా నిర్ణయాన్ని వ్యతిరేకించిన ధోనీ.. అతనికి చాలాసేపు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా.. లాభం లేకపోయిందని చెన్నై టీమ్ అధికారి ఒకరు తెలిపారు. దాంతో.. ఢీలా పడిపోయిన రైనాని బలవంతంగా టీమ్‌తో ఉంచడం మంచిదికాదని భావించిన చెన్నై ఫ్రాంఛైజీ.. అతడ్ని భారత్‌కి పంపే ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా చెన్నై టీమ్‌లో కరోనా ఇప్పుడు ఐపీఎల్ 2020 సీజన్‌ని కూడా సందిగ్ధంలో పడేసింది.

టోర్నీ నుంచి రైనా వైదొలగడానికి మరో కారణం కూడా వినిపిస్తోంది. ఇటీవల గుర్తు తెలియని దుండగుల దాడిలో అతని మామ చనిపోగా.. అత్త పరిస్థితి తీవ్రంగా ఉందట. దాంతో.. అతను ఇండియాకి వచ్చేస్తున్నట్లు చెప్తున్నారు.
Tags:    

Similar News