జనసేనతో పొత్తు కటీఫేనా ?

Update: 2022-08-31 09:30 GMT
వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షమైన జనసేనతో పొత్తు కటీఫ్ అయినట్లేనా ? బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తాజా ప్రకటన చూసిన తర్వాత అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. వైజాగ్ లో జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ 175 అసెంబ్లీ స్ధానాల్లో పోటీ చేస్తుందన్నారు. ఏపీలో బీజేపీ స్పష్టమైన దిశా నిర్దేశంతోనే ముందుకు వెళుతోందని చెప్పారు. పొత్తుల విషయంపై  మీడియాలో వచ్చే కథనాలకు తాము స్పందించేదిలేదని కూడా అన్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఉన్నదే 175 స్ధానాలు. అన్నింటిలోను బీజేపీనే పోటీ చేస్తుందని జీవీఎల్ చెప్పారంటే అర్ధమేంటి ? మిత్రపక్షం జనసేనకు ఒక్క సీటు కూడా కేటాయించకపోటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ? జీవీఎల్ మాటలకు అర్ధమేంటంటే జనసేనతో పొత్తుండదని చెప్పకనే చెప్పినట్లయ్యింది. డైరెక్టుగా జనసేనతో పొత్తుండదు అని ప్రకటించలేదంతే.

సరే ఇపుడు జీవీఎల్ చెప్పిందే శిలాశాసనమా అంటే అలాని అనుకునేందుకు లేదు. మొత్తానికి బీజేపీ-జనసేన మధ్య విభేదాలు మరోసారి బయటపడినట్లయ్యింది. రెండుపార్టీలు పేరుకుమాత్రమే మిత్రపక్షాలుగా ఉన్నాయంతే.

ఎప్పుడెప్పుడు బీజేపీ పొత్తులో నుండి బయటపడదామా అని జనసేన ప్రయత్నిస్తున్నా సాధ్యపడుతున్నట్లు లేదు. అందుకనే రెండుపార్టీలు కూడా ఎవరికి ఎవరితోను సంబంధాలు లేకుండా ఎవరి కార్యక్రమాలను వాళ్ళు చేసుకుంటున్నారు.

ఇక జీవీఎల్ ప్రకటనను చూస్తే ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే 175 సీట్లలోను పోటీ చేసేంత సీన్ బీజేపీకి లేదన్నది నూరుశాతం వాస్తవం. అసలు మిత్రపక్షం జనసేనతో కలిసున్నపుడే రెండు పార్టీలకు గట్టి అభ్యర్ధులు దొరకటం కష్టమనే చెప్పాలి.

అలాంటిది బీజేపీ సొంతంగా పోటీ చేయటమంటే మాటలు కాదు. ప్రజాబలంలేని జీవీఎల్ లేదా సోము వీర్రాజు లాంటి నేతలు మీడియాలో వంద ప్రకటనలు చేస్తారు. నిజంగానే జీవీఎల్ చెప్పినట్లు బీజేపీ ఒంటరిగానే పోటీలోకి దిగితే అప్పుడు మొదలవుతుంది పార్టీకి  అసలు సినిమా.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News