అభ్యర్థిపై ఇంత వ్యతిరేకత ఉందా ?

Update: 2022-10-19 04:24 GMT
మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో  టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పై జనాల్లో వ్యతిరేకత ఎలాగున్నా పార్టీ నేతల్లోనే బాగా వ్యతిరేకత పెరిగిపోతోందట. అభ్యర్ధితో కలిసి ప్రచారం చేయటానికి ఎంఎల్ఏలు సీనియర్ నేతలు ఏమాత్రం ఇష్టపడటం లేదట.

కేసీయార్ తో అభ్యర్ధికి ఉన్న సన్నిహితం కారణంగా ప్రచారానికి వస్తున్న మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలను ప్రభాకర్ రెడ్డి ఏమాత్రం లెక్కచేయటంలేదట. అభ్యర్ధితో కలిసి ప్రచారానికి వెళితే పార్టీకి డ్యామేజి గ్యారెంటీ అని ఎంఎల్ఏలు మంత్రి కేటీయార్ కు చెప్పారట.

మునుగోడు నియోజకవర్గంలో గడచిన మూడున్నరేళ్ళల్లో అభివృద్ధే జరగలేదని ప్రచారంలో కూసుకుంట్ల పదేపదే చెబుతున్నారట. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి జరగకపోవటానికి తమ ప్రభుత్వమే కారణమని అభ్యర్ధి అంగీకరిస్తున్నట్లవుతోంది. నియోజకవర్గంలో అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని జనాలు నిలదీస్తున్నారట. దాంతో ఏమి సమాధానం చెప్పాలో అభ్యర్థితో పాటు ప్రచారంలోని ఎంఎల్ఏలకు దిక్కుతోచటం లేదని సమాచారం.

నిజానికి కూసుకుంట్లను అభ్యర్ధిగా వద్దని పార్టీనేతలే కేసీయార్ కు ఒకటికి మూడు సార్లు తెగేసిచెప్పారు. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే పనిచేసేదిలేదని నేతలు ఎంత మొత్తుకున్నా కేసీయార్ ఏమాత్రం పట్టించుకోలేదు. అభ్యర్ధి ప్రకటనను వాయిదా వేశారు కానీ చివరకు కూసుకుంట్లనే ప్రకటించారు. దాంతో నేతల్లో, కార్యకర్తల్లో బాగా అసంతృప్తి పెరిగిపోతోంది. అయితే ఇదంతా ఒక ఎత్తయితే ఇపుడు ప్రచారంలో జరుగుతున్న వ్యవహారాలు మరొక ఎత్తుగా తయారవుతోంది.

ప్రభుత్వంపైన బండలు వేసుకునేట్లుగా కూసుకుంట్ల ప్రచారం జరుగుతోందని మంత్రులు, ఎంఎల్ఏలు మొత్తుకుంటున్నారట. నియోజకవర్గంలో కేసీయార్ ఎలాంటి అభివృద్ది చేయలేదనే కారణంచూపే కాంగ్రెస్ ఎంఎల్ఏగా కోమటిరెడ్డి రాజగోపాల్ చెప్పిందాన్ని ఇపుడు కూసుకుంట్ల నిజం చేస్తున్నట్లుందని ఎంఎల్ఏలు గోలచేస్తున్నారట.

అయినా కూసుకుంట్లను నియంత్రించే వాళ్ళు కనబడటం లేదు. దాంతో అభ్యర్ధిని విడిగా ప్రచారం చేసుకోమని తాము మాత్రం విడిగానే ప్రచారంలోకి వెళతామని చాలామంది ఎంఎల్ఏలు, నేతలు తెగేసి చెబుతున్నారట. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News