తలుపులు మూసేయ్... ఇదేం పాలిటిక్స్ సేనానీ...?

Update: 2022-04-07 08:53 GMT
రాజకీయం అంటే నేటి కంటే రేపటికి ఎన్నో ఆశలు ఉంటాయి. ఎల్లుండి సీన్ మరోలా ఉంటుంది. నిజానికి చివరి సెకన్ దాకా అంతా గుప్పిట పట్టి ఉంచితేనే రాజకీయం పంట పండుతుంది. కానీ ఎనిమిదేళ్ల రాజకీయ జీవితంలో జన‌సేనాని మాత్రం పొరపాట్లూ తడబాట్లే అలవాట్లుగా చేసుకున్నారు అని అంటున్నారు.

జనసేన పేరిట ఒక రాజకీయ పార్టీ పెడుతున్నట్లుగా 2014 మార్చి 14న పవన్ కళ్యాణ్ ప్రకటించినపుడు ఎంత హైప్ వచ్చిందో అందరికీ తెలుసు. ఆ టైం లో కనుక బరిలో దిగి ఉంటే ఫలితం వేరేగా ఉండేది. కానీ ఏపీ అభివృద్ధి అంటూ పవన్ భారీ త్యాగమే చేశారు. ఒక వైసీపీని పవర్ లోకి రానీయను అని శపధం కూడా చేశారు.

ఇదే రాంగ్ స్ట్రాటజీ అంటున్నారు. ఒకరిని రానివ్వను అనడం కంటే నేనే వస్తున్నా అని జనాల వద్దకు వెళ్ళడంలోనే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఎవరు రావాలో ఎవరు కావాలో అపుడు జనాలు నిర్ణయిస్తారు. ఇక 2019 ఎన్నికల వేళ కూడా పవన్ టీడీపీని వీడి ఇతర పార్టీలను కలుపుకుని ఇండైరెక్ట్ గా టీడీపీకి మేలు చేసే పాలిటిక్స్ చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఫలితం కూడా బ్యాడ్ గానే వచ్చింది.

ఇపుడు చూస్తే ఆయన వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనినివ్వను అంటూ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చి మరో రాంగ్ స్టెప్ వేశారు అని అంటున్నారు. ఓట్ల చీలిక కలయిక ఇవ‌న్నీ జనాల చేతుల్లో పెట్టి తన జెండాను,  అజెండాను ముందుకు తీసుకుపోయి ఉంటే జనసేన రెపరెపలు ఈ పాటికి ఇంకా గట్టిగా వీచేవని అంటున్నారు.

వ్యతిరేక ఓట్లను చీలనివ్వను అని చెప్పడం ద్వారా పవన్ టీడీపీతో పొత్తు ఉంటుందని ఇండైరెక్ట్ గా చెప్పినట్లు అయింది. అంతే కాదు, ఆయన తన రాజకీయ వ్యూహాలను కూడా రివీల్ చేసినట్లు అయింది. దీంతో ఏపీలో రెండు ప్రధాన పార్టీలతో విసుగు చెందిన వారు మూడవ పార్టీగా జనసేన వైపు చూసే చాన్స్ ని కోరి ఆయనే మిస్ చేసుకున్నారు అంటున్నారు.

నిజానికి లోకల్ బాడీ ఎన్నికల్లో జనసేన గోదావరి జిల్లాల్లో పెర్ఫార్మెన్స్ బాగానే చూపించింది. దాంతో ఆ పార్టీ వైపు చాలా మంది చూశారు. అలా వచ్చిన ఊపుని సొమ్ము చేసుకునే వీలు ఉండి కూడా పవన్ తొందరపడ్డారా అన్న చర్చ అయితే సాగుతోంది. రాజకీయ పార్టీలు ఎత్తిగిల్లాలీ అంటే సరైన వ్యూహాలు అవసరం. అవి ఉంటేనే తిమ్మిని బమ్మిని చేయగలరు.

అయితే జనసేన లైన్ అంతా టీడీపీ వైపే అన్నట్లుగానే తేటతెల్లం కావడం, దాని మీద వైసీపీ నుంచి కూడా వరసబెట్టి కామెంట్స్ పడడంతో జనసేనకు అవకాశం ఉన్నా ఎదగలేకపోతోంది అంటున్నారు. ఇపుడు చూస్తే టీడీపీ నుంచి కూడా జనసేనలోకి దూకాలనుకున్న కొందరు మాజీ మంత్రులు, సీనియర్ నేతలు కూడా మనసు మార్చుకున్నారు అని ప్రచారం సాగుతోంది.

ఆ విధంగా ఉత్తరాంధ్రా ఉభయ గోదావరి జిల్లాలో బలమైన రాజకీయ శక్తిగా 2024 నాటికి ఎదిగే వీలున్నా పవన్ వ్యతిరేక ఓట్లు చీలిపోనీయను అని పదే పదే అంటూ పార్టీ తలుపులు తానే వేసేస్తున్నారు అని విశ్లేషిస్తున్నారు. ఇక చూస్తే జనసేనతో మిగిలిన పార్టీలకు  పొత్తులు ఖాయమని రాజకీయం తెలిసిన వారు అంతా అనుకునే పరిస్థితి. ఇలాంటి నేపధ్యంలో జనసేనలో చేరేందుకు ఎవరు ముందుకు వస్తారు అన్నదే చర్చగా ఉంది.

మొత్తానికి వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అని చెప్పడం ద్వారా పవన్ టీడీపీ నెత్తిన పాలు పోశారని అంటున్నారు. రేపటి రోజున వెల్లువెత్తే చేరికలు అన్నీ కూడా పసుపు శిబిరం దిశగా సాగుతాయనే అంచనా వేస్తున్నారు. మొత్తానికి సేనాని తన  రాజకీయం మార్చకుండా గుర్రాన్ని దౌడ్ తీయమంటే అయ్యే పనేనా అన్నదే ప్రశ్నగా ముందుకు వస్తోంది.
Tags:    

Similar News