క‌రోనా త‌ర్వాత రాహుల్ చేసే యాత్ర పేరు ఇదేనా?

Update: 2021-05-20 13:30 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా మూడేళ్ల స‌మ‌యం ఉంది. అయినా ఎందుక‌నో గానీ.. అప్పుడే 2024లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై అప్పుడే విశ్లేష‌ణ‌లు మొద‌లైపోయాయి. ఇందుకు చాలా కార‌ణాలున్నా... క్ర‌మంగా త‌గ్గిపోతున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ గ్రాఫే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్పాలి. క‌రోనా సెకండ్ వేవ్ ను క‌ట్ట‌డి చేసే విష‌యంలో ఘోరంగా విఫ‌ల‌మైపోయిన మోదీ... ఇంటా బ‌య‌టా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. ప‌లు స‌ర్వే సంస్థ‌లు చేసిన స‌ర్వేల్లో మోదీ గ్రాఫ్ త‌గ్గిపోతోంది. అయితే అదే మాదిరిగా కాంగ్రెస్ యువ‌రాజు రాహుల్ గాంధీ గ్రాఫ్ మాత్రం పెర‌గ‌డం లేదు. మ‌రేం చేస్తే... త‌గ్గిన మోదీ గ్రాఫ్ ను రాహుల్ వైపు మ‌ళ్లించ‌వ‌చ్చు? ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. ఈ చ‌ర్చ ఇప్ప‌టికే ఆ పార్టీలో ప‌తాక స్థాయికి వెళ్ల‌గా... రాహుల్ గాంధీతో దేశ‌వ్యాప్తంగా ఓ పాద‌యాత్ర చేయిస్తే త‌ప్పించి ప్ర‌యోజ‌నం లేద‌న్న భావ‌న‌కు కూడా పార్టీ కీల‌క నేత‌లు వ‌చ్చారు. ఆ యాత్ర‌కు రాజీవ్ భ‌రోసా యాత్ర అనే పేరు కూడా పెట్టేసిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ దేశాన్ని అత‌లాకుత‌లం చేస్తోంది. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక కేసులు న‌మోద‌వుతున్న దేశంగా భార‌త్ రికార్డుల‌కెక్కిపోయింది. అంతేకాకుండా మృతుల విష‌యంలోనూ దేశంలో పరిస్థితి దారుణంగానే ఉంద‌ని చెప్పాలి. ఇలాంటి ప‌రిస్థితిని క‌ట్ట‌డి చేసి... క‌రోనాను తొలి ద‌శ‌లో క‌ట్ట‌డి చేసిన మాదిరిగా ఇప్పుడు క‌ట్ట‌డి చేసే విష‌యంలో మోదీ స‌ర్కారు ఘోరంగా విఫ‌ల‌మైంద‌నే చెప్పాలి. ఈ విష‌యం ఆధారంగానే మోదీ గ్రాఫ్ క్ర‌మంగా త‌గ్గిపోతోంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. మోదీ గ్రాఫ్ త‌గ్గితే... అందుకనుగుణంగా రాహుల్ గ్రాఫ్ పెర‌గాలి క‌దా. అయితే అలా రాహుల్ గ్రాఫేమీ పెర‌గ‌లేద‌ని చాలా స్ప‌ష్టంగానే తెలుస్తోంది. మోదీ గ్రాఫ్ త‌గ్గిపోతున్న నేప‌థ్యంలో రాహుల్ గ్రాఫ్ పెర‌గ‌క‌పోతే... కాంగ్రెస్ పార్టీ కాకుండా మ‌రో ప్ర‌త్యామ్నాయం రావాల్సిందే క‌దా. అది కాంగ్రెస్ పార్టీకి ఆత్మ‌హ‌త్యాస‌దృశ్య‌మే. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితి నుంచి త‌ప్పించుకోవాలంటే... రాహుల్ గాంధీ గ్రాఫ్ ను బ‌ల‌వంతంగానైనా పెంచాల్సిందే. మ‌రి ఇందుకోసం ఏం చేయాలి? ఇదీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సాగుతున్న చ‌ర్చ‌.

ఎలాగూ క‌రోనా త‌గ్గేదాకా ఇటు బీజేపీ అయినా, అటు కాంగ్రెస్ అయినా... పెద్ద‌గా రాజ‌కీయ యాక్టివిటీస్ మొద‌ల‌య్యే ప‌రిస్థితి లేదు. అంటే... రాహుల్ గాంధీని జ‌నాల్లోకి ఏ రీతిన పంపాల‌న్న దానిపై కాంగ్రెస్ పార్టీకి కొంత మేర స‌మ‌యం అందుబాటులో ఉన్న‌ట్లే లెక్క‌. ఈ స‌మ‌యంలోనే దేశంలోని అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీల‌ను, ఆ పార్టీకి చెందిన సీఎంల‌ను పిలిచి మాట్టాడాల‌ని, రాహుల్ కోసం ఓ యాత్ర‌ను ప్లాన్ చేయాల‌న్న‌ది కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత‌ల భావ‌న‌గా క‌నిపిస్తోంది. దేశ‌వ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల‌ను ట‌చ్ చేసేలా యాత్ర‌ను ప్లాన్ చేయ‌డం ద్వారా... రాహుల్ గాంధీని నిత్యం జ‌నాల్లో ఉండేలా చేయ‌వ‌చ్చ‌ని ఆ పార్టీ ప్లాన్‌. ఇదే జ‌రిగితే... ప్ర‌భ క‌రిగిపోతున్న మోదీకి ప్ర‌త్యామ్నాయంగా రాహులే క‌నిపిస్తార‌ని కూడా ఆ పార్టీ అంచ‌నా వేస్తోంది. అంతేకాకుండా దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో ఆయా ప్రొంతీయ పార్టీల అధినేత‌లు పాద‌యాత్ర‌ల‌తో అధికారం చేజిక్కించుకున్న వైనాన్ని కూడా ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ ప‌రిశీలిస్తోంది. ఇలా అన్ని ఈక్వేష‌న్ల‌ను ఆలోచించిన మీద‌ట రాహుల్ గాంధీ దేశ‌వ్యాప్తంగా యాత్ర చేయాల్సిందేన‌ని పార్టీ ఓ నిర్ధార‌ణ‌కు అయితే వ‌చ్చింది. ఈ యాత్ర‌కు రాజీవ్ భ‌రోసా యాత్ర అనే పేరును కూడా ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. చూద్దాం మ‌రి ఈ యాత్ర ఎప్పుడు కార్య‌రూపం దాలుస్తుందో?  దీనితోనైనా రాహుల్ జాత‌కం మారుతుందో?  లేదో?
Tags:    

Similar News