విరాట్ కోహ్లీని కొన‌సాగించ‌డానికి ఇదే కార‌ణ‌మా?

Update: 2022-07-16 01:30 GMT
భార‌త క్రికెట్ ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ అంత‌గా ఫామ్ లో లేని సంగ‌తి తెలిసిందే. అంత‌కుముందు మంచినీళ్ల తాగినంత సులువుగా ఫార్మాట్ ఏదైనా సెంచ‌రీలు బాదేసిన విరాట్ ఇప్పుడు ఫామ్ లోకి రావ‌డానికి చెమ‌టోడుస్తున్నాడు. విరాట్ ఏ ఫార్మాట్ లో అయినా సెంచ‌రీ చేసి మూడేళ్లు దాటింది. ఇప్ప‌టివ‌ర‌కు అత‌డు సెంచ‌రీ చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఇంటా బ‌య‌టా అత‌డిపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి,

అయితే తోటి ఆట‌గాళ్లు, కోచ్ నుంచి మాత్రం విరాట్ కోహ్లీకి మంచి మ‌ద్ద‌తే ల‌భిస్తోంది. విరాట్ ఫామ్ పుణికిపుచ్చుకోవ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని.. ఒక్క‌సారి అత‌డు ఫామ్ లోకి వ‌చ్చాడంటే అత‌డిని ఆప‌డం ఎవ‌రి త‌రం కాద‌ని చెబుతున్నారు.

అత‌డి వీరాభిమానులు సైతం అదే చెబుతున్నారు. ఇదే విష‌యాన్ని ఇంగ్లండ్, పాకిస్తాన్ కెప్టెన్లు జోస్ బ‌ట్ల‌ర్, బాబ‌ర్ అజామ్, ఇండియ‌న్ క్రికెట్ టీమ్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కూడా అంటున్నారు.

ఈ జాబితాలో తాజాగా ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ మాంటీ పనేసర్ కూడా చేరాడు. విరాట్ కోహ్లీ వరుసగా విఫలమౌతున్నప్పటికీ.. అత‌డిని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) అత‌డిని త‌ప్పించే సాహ‌సం చేయ‌ద‌ని అంటున్నాడు. విరాట్ ను టీమ్ నుంచి త‌ప్పిస్తే బీసీసీఐ ఆర్థికంగా భారీగా న‌ష్ట‌పోతుంద‌ని ప‌నేస‌ర్ చెబుతున్నాడు. విరాట్ కు ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నార‌ని.. అత‌డి ఆట‌ను చూడ‌టానికి భార‌త్ లోనే కాకుండా ఇత‌ర దేశాల్లోనూ కొన్ని కోట్ల మంది ప్ర‌జ‌లు ఇష్ట‌ప‌డ‌తార‌ని ప‌నేస‌ర్ అంటున్నాడు.

ఈ నేప‌థ్యంలో విరాట్ కోహ్లీని జ‌ట్టు నుంచి త‌ప్పించే సాహ‌సం బీసీసీఐ చేయ‌ద‌ని బ‌ల్ల‌గుద్ది చెబుతున్నాడు. కోహ్లీ లేని మ్యాచ్‌లను ఎవరూ చూడాలని కోరుకోరని మాంటీ ప‌నేస‌ర్ అభిప్రాయం వ్య‌క్తం చేశాడు. విరాట్ లేక‌పోతే దీని ప్రభావం స్పాన్సరర్లపై ఉంటుంద‌న్నాడు. విరాట్ లేక‌పోతే స్పాన‌ర‌ర్లు త‌గ్గిపోతార‌ని.. దీంతో బీసీసీఐకి భారీ న‌ష్టం త‌ప్ప‌ద‌ని ప‌నేస‌ర్ చెబుతున్నాడు. ఫుట్ బాల్ కు క్రిస్టియానో రొనాల్డో ఎలాగో.. క్రికెట్ కు విరాట్ కోహ్లీ అలాంటివాడ‌ని మాంటీ ప‌నేస‌ర్.. విరాట్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.

ప్ర‌స్తుతం విరాట్ ఫామ్ లో లేక‌పోయినా అత‌డు త‌న ల‌య‌ను అందుకుంటే ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు ప్ర‌మాద ఘంటిక‌లు మోగిన‌ట్టేన‌ని మాంటీ ప‌నేస‌ర్ చెబుతున్నాడు. బీసీసీఐ కూడా స్పాన‌రర్ల‌ను సంతోషంగా ఉంచ‌డానికి విరాట్ ను కొన‌సాగిస్తుంద‌ని ప‌నేస‌ర్ అభిప్రాయ‌ప‌డ్డాడు.
Tags:    

Similar News