'ముర్ము' కు మ‌ద్ద‌తు వెనుక మ‌ర్మం ఇదేనా బాబూ..!

Update: 2022-07-14 02:30 GMT
రాజ‌కీయాల్లో ఏదీ ఊరికేనే జ‌ర‌గ‌దు. నీకిది.. నాక‌ది త‌ర‌హాలోనే రాజ‌కీయాలు ఉంటాయి. ఏ పార్టీ అయినా.. ఎలాంటి నాయ‌కుడు అయినా.. ఇదే ఫార్ములాను అనుస‌రిస్తారు. సో.. ఈ విష‌యంలో ఏ పార్టీ మిన‌హాయింపు కాదు. ఇవ‌న్నీ ఇప్పుడు ఎందుకు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయంటే.. ప్ర‌స్తుతం రాష్ట్రప‌తి ఎన్నిక‌ల వేడి దేశ‌వ్యాప్తం గా తీవ్రంగా ఉంది. కేంద్రంలో ఉన్న మోడీ స‌ర్కారుకు నేరుగా ఉన్న ఎంపీల మ‌ద్ద‌తు స‌రిపోదు. అందుకే.. ద‌క్షిణాది రాష్ట్రాల నుంచి త‌న‌కు అందివ‌చ్చిన పార్టీల‌తో ఆయ‌న ముందుకు సాగుతున్నారు.

ఈ క్ర‌మంలో వైసీపీ అనూహ్యంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఆది నుంచి బీజేపీకి వైసీపీ మ‌ద్ద‌తు ఉంది. ఈ క్ర‌మంలో తాజాగా ఇప్పుడు.. టీడీపీ బీజేపీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తివ్వ‌డ‌మే ఆశ్చ‌ర్యంగానూ.. ఆస‌క్తిగాను.. అంత‌కుమించి.. ఉత్కంఠ‌గాను ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఎందుకంటే.. గ‌త 2019 ఎన్నిక‌ల్లో ఒక‌రినొక‌రు విభేదించుకున్న బీజేపీ-టీడీపీలు నిన్నటి వ‌ర‌కు కూడా ఎడ‌మొహం పెడ‌మొహం గానే ఉన్నాయి. క‌నీసం.. చంద్ర‌బాబుకు అప్పాయింట్‌మెంటు కూడా ఇవ్వ‌లేదు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో తాము క‌లిసేది లేద‌ని.. కూడా బీజేపీ నాయ‌కులు స్ప‌ష్టం చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితిలో అనూహ్యంగా చంద్ర‌బాబు బీజేపీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తివ్వ‌డం.. ఆశ్చ‌ర్యంగానే ఉంది. దీనివెనుక ఏం జ‌రిగింది? అనేది ఇప్పుడు చ‌ర్చ‌. ప్ర‌స్తుతం టీడీపీ ఒంట‌రి పోరు సాగిస్తోంది. దేశ‌వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల‌ను చూసుకుంటే.. ఏదో ఒక జాతీయ పార్టీతో అవి నెయ్యం చేస్తున్నాయి. గ‌తంలో బీజేపీ.. త‌ర్వాత కాంగ్రెస్ వైపు చంద్ర‌బాబు మొగ్గారు. అయితే.. ఇప్ప‌టికీ.. కాంగ్రెస్ పుంజుకునే ప‌రిస్థితిలో లేదు.

మ‌రోవైపు కేంద్రంలో  మోడీ హ‌వా నానాటికీ పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ అయితేనే.. భ‌విష్య‌త్తులో బాగుంటుంద‌ని.. ఇత‌రత్రా చిన్న చిన్న అపార్థాలు ఉన్నా.. నెమ్మ‌దిగా స‌ర్దుమ‌ణుగుతాయ‌ని..చంద్ర‌బాబు భావించిన‌ట్టు తెలుస్తోంది. దీనికి కేంద్రంలోని కీల‌క స్థానంలో ఉన్న ఏపీకి చెందిన ఓ నాయ‌కుడు కూడా స‌ల‌హా ఇచ్చార‌ని అంటున్నారు. పైగా ఆదివాసీ మ‌హిళ‌, పొరుగునే ఉన్న ఒడిసా కు చెందిన నాయ‌కురాలు కావ‌డంతో ద్రౌప‌దీ ముర్ముకు మ‌ద్ద‌తివ్వ‌డం ద్వారా.. సామాజిక న్యాయానికి కూడా పెద్ద‌పీట‌వేసిన‌ట్టు ఉంటుంద‌ని.. ఆలోచించి.. ఉభ‌య కుశ‌లోప‌రిగా చంద్ర‌బాబు ఆలోచ‌న చేసినట్టు ఉన్నార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.
Tags:    

Similar News