తెలంగాణ బీజేపీలో వివేక్ ఉన్నాడా..!

Update: 2022-01-10 16:30 GMT
భార‌తీయ జ‌న‌తా పార్టీ తెలంగాణ‌లో దూసుకుపోతోంది. బండి సంజ‌య్ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి రేసుగుర్రంలా ప‌రుగులు తీస్తోంది. ఇత‌ర పార్టీల ముఖ్య నాయ‌కుల‌ను చేర్చుకొని వారికి పార్టీ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టి బ‌లం పుంజుకుంటోంది. ఉప ఎన్నిక‌లు ఆ పార్టీకి క‌లిసి వ‌స్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు.. దుబ్బాక‌, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో విజ‌య‌దుందుభి మోగించి తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తామేన‌ని నిరూపించుకుంటోంది.

అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టేది.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేది త‌మ పార్టీయేన‌ని బీజేపీ చాటి చెప్పుకుంటోంది. పార్టీ పెద్ద‌ల‌తో వ‌రుస ప‌ర్య‌ట‌న‌లు చేప‌ట్టి ఆయా జిల్లాలో సంస్థాగ‌తంగా బ‌ల‌ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే పార్టీ బ‌లోపేతంపై ఒక‌వైపు ఇంత‌గా తీవ్ర ప్ర‌య‌త్నాలు జ‌రుగుతుంటే.. మ‌రోవైపు కొన్ని జిల్లాల్లో గ్రూపు త‌గాదాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంద‌ట‌. అందులో భాగంగా పార్టీ ఒక జిల్లా వైపు అస‌లు క‌న్నెత్తి చూడ‌డం లేద‌ట‌. పార్టీ స‌మావేశాల‌ను కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌.

ఇదంతా.. బీజేపీ సీనియ‌ర్ నేత ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పెద్ద‌ప‌ల్లి జిల్లాలోనే జ‌రుగుతోంద‌ట‌. పార్టీలో క్రియాశీల‌కంగా ప‌నిచేస్తూ.. ఈటెల రాజేంద‌ర్ వంటి నేత‌ల‌ను బీజేపీలో చేరేలా ఒప్పించి పార్టీ బ‌లోపేతం కోసం ప‌ని చేస్తున్న‌ పెద్ద‌ప‌ల్లి మాజీ ఎంపీ వివేక్ త‌న జిల్లాను మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. అస‌లు ఆయ‌న పార్టీలో ఉన్నారా ? అన్న సందేహాలు కూడా కొంద‌రిలో క‌లుగుతున్నాయి. అక్క‌డి పార్టీ జిల్లా అధ్య‌క్షుడు సోమార‌పు స‌త్య‌నారాయ‌ణ‌.. వివేక్ మ‌ధ్య గ్రూపు త‌గాదాలు న‌డుస్తున్నాయ‌ని పార్టీ శ్రేణులు బ‌హాటంగానే చ‌ర్చించుకుంటున్నాయి.

వివేక్ తో సంబంధం లేకుండానే పార్టీ జిల్లా అధ్య‌క్షుడు స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నార‌ట‌. పార్టీ ప‌ద‌వి ఇచ్చింది కానీ ప‌వ‌ర్ ఇవ్వ‌లేద‌ని ఇటీవ‌ల కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఆవేద‌న వ్య‌క్తం చేశార‌ట‌. వివేక్ మ‌రో గ్రూపును ప్రోత్స‌హిస్తూ జిల్లాలో పార్టీని న‌ష్ట‌ప‌రుస్తున్నార‌ని త‌న అనుచ‌రుల వ‌ద్ద చెప్పుకున్నార‌ట‌. రాష్ట్రం మొత్తం మీద పార్టీ కార్య‌క‌లాపాలు జ‌రుగుతుంటే.. పెద్ద‌ప‌ల్లి వైపు మాత్రం ఎవ‌రూ క‌న్నెత్తి చూడ‌డం లేద‌ని అంటున్నారు. ఈ స‌మావేశంలో పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేల‌తో పాటు సీనియ‌ర్ నేత‌లు కూడా పాల్గొన్నార‌ట‌.

తెలంగాణ‌లోని 32 జిల్లాల్లో బీజేపీ రాజ‌కీయ శిక్ష‌ణ త‌ర‌గ‌తులు జ‌రిగితే ఒక్క పెద్ద‌ప‌ల్లి జిల్లాలో మాత్ర‌మే ఎలాంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌లేద‌ట‌. జిల్లా అధ్య‌క్షుడిగా సోమార‌పు స‌త్య‌నారాయ‌ణ‌ను నియ‌మించినా రెండేళ్లుగా జిల్లా క‌మిటీని కూడా వేయ‌లేద‌ట‌. ఈ అంశంపై సోమార‌పు స‌హా సీనియ‌ర్ నేత‌లంతా ఒక‌వైపు.. వివేక్ వ‌ర్గం మ‌రోవైపు ఉండి గ్రూపు రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ట‌. బీజేపీ పెద్ద‌లు ఈ జిల్లా రాజ‌కీయాల‌పై ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో.. స‌మ‌స్య‌ను ఏ విధంగా ప‌రిష్క‌రిస్తారో వేచి చూడాలి.
Tags:    

Similar News