వలంటీర్స్ ... వైసీపీకి డ్యామేజేనా

Update: 2022-06-25 02:30 GMT
వలంటీర్లు అంటే ప‌విత్ర‌మ‌యిన ఉద్యోగం అని, కార్య‌కర్తలంటే సేవ‌కు కేరాఫ్ గా ఉండాల‌ని వైసీపీ పెద్ద‌లు ప‌దే ప‌దే చెబుతుంటారు. కానీ వలంటీర్లు మాత్రం చ‌ట్ట వ్య‌తిరేక చ‌ర్య‌ల‌లో పాల్గొంటూ పోలీసుల‌కు దొరికిపోతున్నారు. కొన్ని నీతి మాలిన ప‌నులు చేస్తూ మీడియాకు చిక్కుతున్నా చ‌ర్య‌లు లేవ‌ని విప‌క్షం మండిప‌డుతోంది.

త‌మ హయాంలో జ‌న్మ‌భూమి క‌మిటీల‌ను ఇవాళ్టికీ తిట్టే వైసీపీ పెద్ద‌లు త‌రుచూ నాటు సారా అమ్ముతూ, పేకాడుతూ దొరికిపోయిన కార్య‌క‌ర్త‌ల విష‌యంలో ఏం సమాధానం చెబుతార‌ని, పింఛ‌ను మొత్తాలు ప‌ట్టుకుని పారిపోయిన వ‌లంటీర్ల  క‌థేంటో అంద‌రికీ తెలుసని విప‌క్షం మండిప‌డుతోంది. ఈ నేప‌థ్యాన ఇటు  ఉమ్మ‌డి శ్రీ‌కాకుళం జిల్లాలోనూ అటు ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలోనూ రెండు వేర్వేరు వివాదాలు న‌మోదు అయి ఉన్నాయి.

ఓవైపు వైసీపీ కార్య‌క‌ర్త‌లంతా క‌డుపు మంట‌తో ర‌గిలిపోతున్నార‌న్న వార్త‌లొస్తున్నాయి. మ‌రోవైపు వారి కోపానికి మరియు ఆవేశానికి కార‌ణం అవుతున్న వలంటీర్ల‌పై ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ రెండూ కూడా ఇప్పుడు చ‌ర్చ‌కు తావిస్తున్నాయి. శ్రీ‌కాకుళం జిల్లా, మంద‌స మండ‌లం, మేఘ‌మాల గ్రామానికి చెందిన   స‌వ‌ర రాజారావు (వలంటీరు) నాటా సారా అమ్ముతుండ‌గా స్పెష‌ల్ ఎన్ఫోర్స్‌మెంట్ బ్యూరో కు చెందిన పోలీసులు ప‌ట్టుకున్నారు.

గ్రామంలో ఆయ‌న‌తో పాటు స‌వర విజ‌య్ అనే వ్య‌క్తి కూడా నాటుసారా అమ్ముతున్నారు. వీరిద్ద‌రినీ పోలీసులు అదుపులోకి తీసుకుని స‌మీప స్టేష‌న్-కు త‌ర‌లించారు.

ఇదే ఘ‌ట‌న‌లో మ‌రో ఇద్ద‌రు కూడా పట్టుబ‌డినా వారు త‌మ‌పై దాడి చేసి ప‌రార‌య్యార‌ని పోలీసులు చెబుతున్నారు. బాధ్య‌త గ‌ల వృత్తిలో ఉన్న వారంతా ఈ విధంగా బాధ్య‌త త‌ప్పి ప్ర‌వ‌ర్తించ‌డం, నాటుసారా క‌ట్ట‌డి చేయాల్సి న వారే వాటి అమ్మ‌కాల‌పై దృష్టి పెట్ట‌డం త‌దిత‌ర వైనాల‌పై వివాదాలు రేగుతున్నాయి.

ఇదిలా ఉంటే పులివెందులలో వలంటీర్లపై కార్య‌క‌ర్త‌లు ఫైర్ అయ్యారు. ఇక్క‌డి ప్లీన‌రీ ( నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ప్లీన‌రీ)లో కార్య‌క‌ర్త‌లంతా ఆగ్ర‌హంతో ఊగిపోయారు. అంతా వ‌లంటీర్లే చేస్తున్నార‌ని ఎంపీ అవినాశ్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లారు. గ్రామాల్లో కానీ మండ‌లాల్లో కానీ త‌మ మాట ఎక్క‌డా నెగ్గుకు రావ‌డం లేద‌ని అంటున్నారు. ముఖ్యంగా పంట‌ల బీమా అన్న‌ది చాలామందికి వ‌ర్తించ‌లేద‌ని, దీనిపై అధికారుల‌తో మాట్లాడి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరారు.
Tags:    

Similar News