ఆసుపత్రుల్లో సెల్ ఫోన్లను పూర్తిగా బంద్ పెట్టాల్సిందేనా?

Update: 2020-05-17 00:30 GMT
గడిచిన కొన్నినెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న మాయదారి రోగానికి సంబంధించిన మరో అంశం తాజాగా తెర మీదకు వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నింటికంటే ఎక్కువగా వినియోగిస్తున్నది మొబైల్ ఫోనే. దీంతో పొంచి ఉన్న ముప్పు ఎక్కువేనన్న విషయం తాజా అధ్యయనంలో బయటకు వచ్చింది. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. ఆసుపత్రుల్లో పని చేసే వైద్యులు.. వైద్య సిబ్బంది వినియోగించే మొబైళ్ల కారణంగా ప్రాణాంతక రోగం పొంచి ఉన్నట్లేనని చెప్పక తప్పదు.

మొబైల్ ఫోన్లు వైరస్ వాహకాలేనని.. వాటి ఉపరితల భాగాలు అత్యంత డేంజర్ అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వాటిపై తిష్ట వేసే వైరస్.. ఫోన్ ను వినియోగించే సమయంలో నేరుగా వ్యక్తి శరీర భాగాల్లోకి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అన్నింటికి మించి ఆసుపత్రుల్లో పని చేసే వైద్యులతో పాటు.. సిబ్బందికి నేరుగా ముఖం.. నోరు.. కళ్ల నుంచి వైరస్ అంటుకునే ప్రమాదం పొంచి ఉంది.

ఆసుపత్రుల్లో పని చేసే వారు తప్పనిసరిగా తమ సెల్ ఫోన్లను తరచూ శానిటైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తించే వారంతా తక్కువలో తక్కువ తమ సెల్ ఫోన్ ను పావు గంట నుంచి రెండు గంటల వరకూ వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాయదారి రోగం ఏ క్షణంలోనైనా విరుచుకు పడే వీలున్నట్లు చెబుతున్నారు. దీనికి రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి.

అందులో ఒకటి ఆసుపత్రుల్లో పని చేసే వైద్యులు.. వైద్య సిబ్బందికి తమ విధి నిర్వహణ సమయంలో సెల్ ఫోన్ వాడకుండా వాటిని ముందే సేఫ్ గా దాచి ఉండటం. వారు డ్యూటీ అయిపోయిన తర్వాతే సెల్ ను ముట్టుకుంటే మంచిదంటున్నారు. లేనిపక్షంలో తరచూ శానిటైజ్ చేయటం మంచిదంటున్నారు. సెల్ ఫోన్లతో పాటు.. కంప్యూటర్ల వినియోగించే వేళలోనూ జాగ్రత్తలు తప్పనిసరని చెప్పక తప్పదు. ఇదంతా కష్టమనుకుంటే.. సెల్ ఫోన్లకు ప్లాస్టిక్ కవర్ తో ఉంచేయటం.. అలానే వాడటం.. రోజుకు.. రెండు మూడుసార్లు కవర్లను పడేయటం మంచిదంటున్నారు.
Tags:    

Similar News