వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియా మేల్కొంటోందా?

Update: 2020-01-13 09:11 GMT
ఎన్నిక‌ల‌కు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోష‌ల్ మీడియా ఎన‌లేని రీతిలో అండ‌గా క‌నిపించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ‌యంలో సోష‌ల్ మీడియా పాత్ర అంతా ఇంతా కాదు. ప్ర‌ధాన మీడియా వ‌ర్గాలు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా ప‌ని చేశాయి. టీవీ చాన‌ళ్లు, వార్తా ప‌త్రిక‌లు.. అన్నీ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేక‌మే. అలాంటి స‌మ‌యంలో పార్టీని ఓన్ చేసుకుని అనేక మంది సోష‌ల్ మీడియాలో పార్టీ అజెండాను గ‌ట్టిగా వినిపించారు. తెలుగుదేశం పార్టీని బాగా ఎండ‌గ‌ట్టారు. కౌంట‌ర్లు ఇస్తూ, సెటైర్లు వేస్తూ.. తెలుగుదేశం పార్టీని దించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ను పెంచ‌డంలో సోష‌ల్ మీడియా ప్ర‌ధాన పాత్ర పోషించింది.

అయితే పోలింగ్ పూర్తి అయిన వెంట‌నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయ‌క‌త్వం సోష‌ల్ మీడియాను ప‌ట్టించుకోవ‌డం మానేసింది. ఎన్నిక‌ల‌కు ముందు అనేక మందిని ఊరించి, ఊర‌డించి సోష‌ల్ మీడియాలో ప‌ని చేయించుకున్నారు. అయితే ఒక్క‌సారి ఎన్నిక‌లు కాగానే.. వైసీపీ నాయ‌క‌త్వం తీరు మారిపోయింది. అప్ప‌టి వ‌ర‌కూ ప‌ని చేయించుకున్న వారిని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశారు. పోలింగ్ పూర్తి కాగానే వారి తీరు మారింది. అధికారం సంపాదించుకోగానే మ‌రింత‌గా మారిపోయారు. సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌ను వైసీపీ నాయ‌క‌త్వం ఖాత‌రు చేయ‌డం పూర్తిగా ఆగిపోయింది.

తాము అధికారం లో ఉన్నాం కాబ‌ట్టి.. ఇక ఎవ‌రి అవ‌స‌రం త‌మ‌కు లేద‌న్న‌ట్టుగా వైసీపీ నేత‌లు వ్య‌వ‌హ‌రించ‌సాగారు. అయితే అధికారంలో ఉన్న‌ప్పుడే అవ‌స‌రం ఎక్కువ‌ని గ్ర‌హించ‌లేక‌పోయారు. ఇదే స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు సోష‌ల్ మీడియా లో యాక్టివ్ అయ్యారు. వైసీపీ వాళ్లు ఎక్క‌డ దొరుకుతారా.. అన్న‌ట్టుగా వారు విరుచుకుప‌డుతున్నారు. అమ‌రావ‌తి ఇష్యూలో అయితే తెలుగుదేశం పార్టీ వాళ్లు సోష‌ల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఫేక్ ఫొటోల‌ను కూడా వ్యాప్తి చేయ‌గ‌లిగారు. అంత జ‌రుగుతుంటే వైసీపీ స్ట్రాంగ్ గా కౌంట‌ర్ ఇవ్వ‌లేక‌పోయింది. దానికి కార‌ణం..  సోష‌ల్ మీడియాలో పార్టీ బ‌లం బాగా త‌గ్గిపోవ‌డ‌మే.

అధికారంలోకి రాగానే.. ఇక సోష‌ల్ మీడియా అవ‌స‌రం లేద‌న్న‌ట్టుగా వైసీపీ భావించింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం వాళ్లు అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుంటూ ఉన్నారు. దీంతో వైసీపీ నాయ‌క‌త్వం మేలుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్నం అయిన‌ట్టుగా ఉంది. ప్ర‌స్తుతానికి అయితే వైసీపీ నేత‌లు సోష‌ల్ మీడియా శ్రేణుల‌ను త‌ట్టిలేపే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట‌. తామున్నామ‌ని పార్టీ కోసం ప‌ని చేయాల‌ని అంటున్నార‌ట‌. అయితే వైసీపీ నాయ‌క‌త్వంలో నిర్ల‌క్ష్యం పేరుకుపోయిన దాఖ‌లాలు క‌నిపిస్తున్నాయి. ఎవ‌రు త‌మ కోసం ప‌ని చేశారో వారిని విస్మ‌రించిన ప‌రిస్థితి క‌నిపిస్తూ ఉంది. ఇలాంటి స‌మ‌యంలో.. ఏ మేర‌కు ప్ర‌త్య‌ర్థుల దాడుల‌ను తిప్పికొట్ట‌గ‌ల‌రో చూడాలి!
Tags:    

Similar News