లోక్ సభ డిప్యూటీ స్పీకర్ గా వైసీపీ ఎంపీ?... రేసులో ఎవరంటే?

Update: 2019-06-11 12:43 GMT
తాజా ఎన్నికల్లో ఇటు ఏపీ అసెంబ్లీలోనే కాకుండా అటు లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తా చాటిన వైసీపీ... లోక్ సభలో ఓ కీలక పోస్టును దక్కించుకునే దిశగా సాగుతోంది. అంతా అనుకున్నట్లుగా జరిగితే... లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఆ పార్టీకి చెందిన ఎవరో ఒక ఎంపీ దక్కించుకునే ఛాన్సు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఛాన్స్ దక్కితే... వైసీపీ తరఫున ఎంపికైన 22 మంది ఎంపీల్లో ఆ పదవికి జగన్ ఎవరిని ఎంపిక చేస్తారన్న విషయంపై ఇప్పటికే ఆసక్తికర చర్చలు మొదలైపోయాయి.

తాజా ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లున్న ఏపీ అసెంబ్లీలో 151 సీట్లను గెలిచిన వైసీపీ 25 ఎంపీ సీట్లకు గాను 22 సీట్లను గెలుచుకుంది. ఈ 22 మంది ఎంపీల్లో రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వారే అధికంగా ఉన్నారు. మరి వీరిలో జగన్ ఛాయిస్ ఎవరోనన్న అంశం ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే అరకు స్థానం నుంచి గెలిచిన గొడ్డేటి మాధవితో పాటు అమలాపురం నుంచి గెలిచిన చింతా అనురాధలలో ఎవరికో ఒకరికి ఈ స్థానం దక్కే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన కేబినెట్ తో పాటు సీట్ల కేటాయింపులోనూ మహిళలకు ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలకు జగన్ అత్యధిక ప్రాదాన్యం ఇస్తున్నారు. ఈ లెక్కన లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవికి గొడ్డేటి మాధవిని గానీ, లేదంటే చింతా అనురాధను గానీ జగన్ ఎంపిక చేసే అవకాశాలున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయినా లోక్ సభలో అన్ని పార్టీలు ఉండగా డిప్యూటీ స్పీకర్ పదవి వైసీపీకే ఎలా దక్కుతుందన్న అంశంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. సాధారణంగా లోక్ సభలో మూడో అతిపెద్ద పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవిని కేటాయించే సంస్కృతిని అధికార పార్టీలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం లోక్ సభలో మూడో అతిపెద్ద పార్టీగా తమిళనాడుకు చెందిన డీఎంకే ఉంది. అయితే ఆ పార్టీ తరఫున గెలిచిన ఎంపీలు కేవలం డీఎంకే గుర్తు మీద కాకుండా నాలుగు గుర్తుల మీద గెలిచారట. అంటే డీఎంకే కూటమి తరఫున వారు గెలిచారట. ఈ లెక్కన నాలుగో అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీ... ఒకే గుర్తుపై అభ్యర్థులను గెలిపించుకున్న నేపథ్యంలో మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అంతేకాకుండా అధికార బీజేపీతో మంచి సంబంధాలను కొనసాిగిస్తున్న వైసీపీ... డిప్యూటీ స్పీకర్ పదవిని దక్కించుకునే అవకాశాలను మెరుచుపరచుకుందట. ఇదే జరిగితే... లోక్ సభలో వైసీపీ మరింత కీలకమైన రోల్ ను పోషించడం ఖాయమనే చెప్పాలి.
Tags:    

Similar News