పెద్ద బాంబునే పేల్చిన పుతిన్

Update: 2015-11-17 04:33 GMT
‘ఇస్తామిక్ స్టేట్ అంతమే మా పంతం’ అంటూ పెద్ద పెద్ద మాటల్ని జీ20 దేశాలు చెప్పటం తెలిసిందే. జీ20 దేశాలకు సంబంధించి ప్రస్తుతం టర్కీలోని అంటాల్యాలో సదస్సు జరుగుతోంది. ఈ సదస్సు జరగటానికి ముందే ప్యారిస్ లో ఉగ్రవాదులు నరమేధాన్ని సృష్టించారు. దీనిపై జీ20 దేశాధినేతలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేయటమే కాదు.. ప్రపంచంలో ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) సంస్థ అన్నది లేకుండా చేస్తామంటూ ప్రతిన పూనారు.

అగ్రదేశాలకు చెందిన నేతలంతా ఇంత పంతంగా ఉంటే ఇస్లామిక్ స్టేట్ ఆటలు కట్టించొచ్చని ఆనందపడినోళ్లు ఉన్నారు. అదే సమయంలో.. జీ20 దేశాల అధినేతలకు నిజంగా ఆ కమిట్ మెంట్ ఉంటే ఇస్లామిక్ స్టేట్ యవ్వారం ఇంతవరకు వచ్చేదా? అన్న ప్రశ్నను తమకు తాము వేసుకున్నోళ్లు ఉన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లోనే రష్యా అధ్యక్షుడి నోటివెంట పెద్ద బాంబే బయటకు వచ్చింది. ఇస్లామిక్ స్టేట్ కు సంబంధించి జీ20 దేశాల బృందంలోని కొన్ని దేశాలు అనుసరిస్తున్న వైఖరిపై తన మనసులోని మాట చెప్పిన పుతిన్ సంచలనం సృష్టించారు. ఐఎస్ కు నిధులు ఇస్తున్న వారిలో జీ20 దేశాల్లోని కొన్ని దేశాలు కూడా ఉన్నాయంటూ కుండబద్ధలు కొట్టారు.

ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాలు ఐఎస్ కు ఆర్థికంగా తమ సహకారాన్ని అందిస్తున్నాయని చెప్పిన పుతిన్ మాటతో కలకలం రేగింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశాలు కొన్ని జీ20 కూటమిలో ఉండటం ఏమిటన్న ప్రశ్నలు బయటకు వచ్చాయి. నిజానికి ఐఎస్ లాంటి సంస్థ ఇంత శక్తివంతంగా తయారు కావటానికి కొన్ని దేశాల సహకారం పక్కా అన్న అభిప్రాయం ఉంది. ఆ వాదనను నిజం చేస్తూ.. రష్యా అధ్యక్షుడు చేసిన తాజా వ్యాఖ్యలు కలకలాన్ని రేకెత్తిస్తున్నాయి. జీ20 దేశాల్లో ఐఎస్ కు ఆర్థికంగా కొన్ని దేశాలు దన్నుగా నిలిచాయని చెప్పిన ఆయన.. ఆ పాపానికి ఒడికడుతున్న దేశాల వివరాలు కూడా చెప్పి ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News