ప్యారిస్ లో ఉగ్రదాడికి ఐఎస్ పెట్టిన ఖర్చెంత..?

Update: 2015-11-23 03:57 GMT
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో సృష్టించిన నరమేదానికి సంబంధించి విస్మయకర విషయాలు బయటకు వస్తున్నాయి. 119 మంది అమాయకుల్ని అత్యంత దారుణంగా హతమార్చటంతో పాటు.. యూరప్ సహా.. ప్రపంచ దేశాల్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటన కోసం పెట్టిన ఖర్చు కేవలం రూ.5లక్షలు మాత్రమేనట. ప్యారిస్ ఉగ్రదాడికి పెట్టిన ఖర్చు విషయం పైన  తాజాగా రాయటర్స్ ఒక అంచనా వేసింది. ఈ అంచనా ప్రకారం రూ.5లక్షల స్వల్ప మొత్తంతో ఇంతటా భారీ దారుణమారణకాండ చేపట్టినట్లుగా వెల్లడించింది.

తమ దేశంపై జరిపిన ఉగ్రదాడి కోసం ఫ్రాన్స్.. బెల్జియం దేశాలు ఐఎస్ తీవ్రవాదుల మీద పోరాటం చేయటంతో పాటు.. అదనపు రక్షణ చర్యల కోసం దాదాపు రూ.7వేల కోట్లు ఖర్చు చేస్తే.. దారుణ మారణకాండ కోసం ఐఎస్ ఖర్చు చేసింది మాత్రం రూ.5లక్షలు మాత్రమే కావటం గమనార్హం. 8 మంది ఉగ్రవాదులు తమ దాడుల కోసం రచించిన ప్రణాళిక.. దాన్ని అమలు చేసేందుకు చేసిన ఖర్చు ఇంత తక్కువా? అన్న ఆశ్చర్యం కలగక మానదు. దారుణమైన ఉగ్రదాడి కోసం ఐఎస్ ఉగ్రవాదులు ఉపయోగించిన వస్తువులు చూస్తే చాలా సాదాసీదాగా కనిపిస్తాయి.

ఉగ్రవాదులు ఉన్న ఇంటి అద్దెతో సహా లెక్కలు వేస్తే.. ఖర్చు మొత్తం రూ.5లక్షలేకావటం గమనార్హం. రూ.5లక్షల్లో కూడా నాలుగు రైఫిళ్ల కోసమే పెట్టిన ఖర్చే ఎక్కువ. అది మినహాయిస్తే.. మిగిలిన వాటి కోసం పెట్టిన ఖర్చు చాలా స్వల్పం కావటం విశేషం. రసాయన పదార్థాల కోసం ప్రతి బెల్ట్ కు వినియోగించింది రూ.500 నుంచి రూ.1200 మాత్రమే. సూసైడ్ బెల్ట్ కోసం సుమారు రూ.16వేలు.. ఉగ్రవాదులు నివాసం ఉన్న రెండు అపార్ట్ మెంట్ల అద్దె కోసం దాదాపు రూ.70వేలు.. ఉగ్రదాడి కోసం వినియోగించిన మూడు అద్దె కార్ల కోసం సుమారు రూ.65వేలు.. ఉగ్రదాడికి వినియోగించటానికి కొనుగోలు చేసిన 2వేల బుల్లెట్లు (అంచనా) సుమారు రూ.60వేలకు మించదని చెబుతున్నారు. విధ్వంసం చేయటానికి పెద్ద ఎత్తున నిధులు అక్కర్లేదన్న విషయాన్న ప్యారిస్ ఘటన ద్వారా ఉగ్రవాదులు చెప్పకనే చెప్పేశారన్న మాట. మానవత్వంతో వ్యవహరించటానికి ఖర్చు అవుతుందేమో కానీ.. అలాంటేదేమీ లేకుండా రాక్షసంగా.. విధ్వంసమే లక్ష్యంగా దాడులు జరిపే వారికి పెద్ద ఎత్తున నిధులు కూడా అవసరం లేదన్న మాట.
Tags:    

Similar News