లిబియాలో తెలుగు ఇంజినీర్ల‌ను వ‌దిలేశారు

Update: 2016-09-15 09:20 GMT
లిబియాలో గ‌త ఏడాది అపహరణకు గురైన తెలుగు ఇంజినీర్లు విడుదలయ్యారు. తెలుగు ఇంజినీర్లు క్షేమంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన  గోపాలకృష్ణ  -- తెలంల‌గాణ‌కు చెందిన బలరామకిషన్‌  విడుదలయ్యారు.  దీంతో సుమారు 14 నెల‌ల త‌రువాత వీరు సుర‌క్షితంగా విడుద‌లైన‌ట్ల‌యింది.  2015 జులై 29న లిబియాలో వీరు అపహరణకు గురైన విషయం తెలిసిందే.

కాగా సుదీర్ఘ కాలంగా ఆందోళ‌న‌కు గురిచేస్తున్న తెలుగు  ఇంజినీర్ల అప‌హ‌ర‌ణ అంశంలో ప్ర‌భుత్వం ఇంత‌కాలం ఏమీ చేయ‌లేక‌పోయింది. తాజాగా వారు విడుద‌లైన త‌రువాత విదేశాంగ‌ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తన ట్విట్టర్ ఖాతాలో ఆ స‌మాచారాన్ని వెల్ల‌డించారు.  వీరిని విడిపించడానికి తాము చేసిన ప్రయత్నాలు ఫలించాయని, త్వరలోనే ఇద్దరూ ఇండియాకు వస్తారని సుష్మ తెలిపారు. గత సంవత్సరం జూలై 29న కిడ్నాప్ నకు గురైన వీరిద్దరూ ఏడాదికి పైగా బందీలుగా ఉండ‌డంతో వారినేం చేస్తారో అని ఇంత‌కాలం అంతా ఆందోళ‌న చెందారు.  

ఇంజినీర్ల అపహరణ అనంతరం తీవ్రంగా తల్లడిల్లిన కుటుంబసభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ - కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్ - వెంకయ్యనాయుడులను పలుమార్లు కలసి, తమ ఆందోళనను తెలియజేశారు. తాము లిబియా దౌత్య కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నామని బందీల విడుదల కోసం శాయశక్తులా ప్రయత్నిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు... లిబియాలోని భారత దౌత్యాధికారులు కూడా తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ... ఉగ్ర‌వాదులు ఒక ప‌ట్టాన లొంగ‌లేదు. అయితే... అదృష్ట‌వ‌శాత్తు మ‌న ఇంజినీర్ల‌కు వారు ప్రాణ‌హాని త‌ల‌పెట్ట‌లేదు. దీంతో ప్ర‌క్రియ సుదీర్ఘంగా సాగినా కూడా చివ‌ర‌కు చ‌ర్చ‌లు ఫ‌లించి వారిని ఉగ్రవాదులు విడిచిపెట్టారు.
Tags:    

Similar News