ఐఎస్ ఐఎస్ నెక్ట్స్ టార్గెట్ భారీగా ఉంది

Update: 2015-11-16 16:26 GMT
ఐఎస్ ఐఎస్ అరాచ‌క తీవ్రవాదులు ఫ్రాన్స్ లో జ‌రిపిన భీకర దాడుల నుంచి ప్ర‌పంచం ఇంకా తేరుకోక‌ముందే ఆ క్రూర మూక‌లు త‌మ తదుప‌రి లక్ష్యాన్ని ప్ర‌క‌టించాయి. ఈ సారి ప్ర‌పంచ పెద్ద‌న్న అమెరికాను హెచ్చ‌రించాయి. అదికూడా అమెరికా గుండెకాయ వాషింగ్ట‌న్ డీసీ పై దాడులు చేయ‌నున్న‌ట్లు చెప్పాయి. ఈ మేర‌కు ఫ్రాన్స్ లో కంటే భీకర దాడులు చేస్తామని వీడియోను ఐఎస్ ఉగ్రవాదులు విడుదల చేశారు.

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా పేరుతో ప్ర‌త్యేక దేశం ఏర్పాటు ల‌క్ష్యంగా ఐఎస్ ఐఎస్ ఉగ్ర‌వాదులు పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో వాళ్లు పాగా వేసిన సిరియాపై ప‌లు దేశాలు వైమానిక‌ దాడులు చేస్తున్నాయి. ఈ విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ... "సిరియాపై దాడి చేసే ఏ దేశాన్ని విడిచి పెట్టబోము. వాషింగ్టన్ - రోమ్ లలో వైమానిక దాడులు చేస్తాం" అని హెచ్చరించారు. న‌ల్ల‌టి మాస్క్ ధ‌రించి ఉన్న ఒంట‌రి వ్య‌క్తి వీడియోను ఐఎస్ ఐఎస్ త‌న వీడియోలు రెగ్యుల‌ర్‌ గా పోస్ట్ చేసే వెబ్‌ సైట్‌ లో ఉంచారు. ఈ క్ర‌మంలో త‌న పేరును అల్జెరియన్ అల్ గరీబ్‌ గా చెప్పుకొన్న ఆ క్రూరుడు ప్ర‌పంచ దేశాల‌కు హెచ్చరికలు చేశాడు.

దేవుడి ద‌య‌తో తాము ప్రాన్స్‌ లో దాడులు చేశామ‌ని వాషింగ్టన్ - రోమ్ - బ్రిటన్ లలో కూడా ఇదే త‌ర‌హా దాడులు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. సిరియాలోని తమ ప్రాబల్య ప్రాంతాల్లో అగ్రరాజ్యాలు జరుపుతున్న వైమానిక దాడులను 'క్రూసెడర్ క్యాంపెయిన్'గా  అభివర్ణించాడు. ఇదిలాఉండ‌గా ఈ వీడియోలోని ఉగ్రవాదులు హెచ్చరిక‌ల‌పై ప్ర‌పంచ దేశాలు అల‌ర్ట్ అయ్యాయి.
Tags:    

Similar News