ఇస్రో.. ఈ చిన్న ఉప‌గ్ర‌హ వాహ‌క నౌక‌తో ప్ర‌యోజ‌నం ఇదేనా?

Update: 2022-08-07 08:33 GMT
దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ (ఇస్రో) స‌రికొత్త చ‌రిత్ర‌కు శ్రీకారం చుడుతోంది. తాను కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ)ను నింగిలోకి ఎక్కుపెట్టింది. తిరుపతి జిల్ల్లా సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు ప్రయోగాన్ని నిర్వ‌హించారు. రాకెట్ విజ‌యవంతంగా మూడు ద‌శ‌ల‌ను పూర్తి చేసుకుంది. దీనిద్వారా తక్కువ ఎత్తులో సమీప భూకక్ష్యలోకి ఈవోఎస్‌-02, ఆజాదీశాట్‌ ఉపగ్రహాలు ప్రవేశపెట్టనున్నారు. కాగా ప్ర‌యోగంలో టెర్మినల్‌ దశకు సంబంధించిన సమాచారం రావడంలో కొంత జాప్యం జరిగినట్లు ఇస్రో తెలిపింది. ప్రస్తుతం రాకెట్‌ గమనాన్ని విశ్లేషిస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్ తెలిపారు. ఉపగ్రహాలు నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా చేరుకున్నాయో.. లేదో.. విశ్లేషించి మిషన్‌ తుది ఫలితంపై త్వరలో సమాచారమిస్తామని చెబుతున్నారు.

కాగా ఇస్రో ఇప్పటిదాకా చిన్న, మధ్యస్థ, ఓ మోస్తరు బరువైన ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ ద్వారానే కక్ష్యలోకి పంపేది. దీన్ని తయారుచేసేందుకు 600 మంది 70 రోజులు శ్రమించాల్సి వచ్చేది. అదే చిన్న ఉపగ్రహ వాహకనౌకను ఆరుగురు శాస్త్రవేత్తలు 72 గంటల్లోనే త‌యారుచేయ‌గ‌ల‌రు. ఇందుకయ్యే ఖర్చు కూడా రూ.30 కోట్ల లోపేన‌ని చెబుతున్నారు. ఈ చిన్న ఉప‌గ్ర‌హ‌క వాహ‌క నౌక పొడవు 34 మీటర్లు, వ్యాసం 2 మీటర్లు ఉంటుంది. ఇది 10 నుంచి 500 కిలోల వరకు బరువున్న వాణిజ్య ఉపగ్రహాలను సమీప భూకక్ష్యలో ప్రవేశపెట్టగలద‌ని అంటున్నారు. ఇది అంతరిక్ష రంగం, ప్రైవేటు భారతీయ పరిశ్రమల మధ్య మరింత సహకారానికి మార్గం వేస్తుంద‌ని చెబుతున్నారు.

ఆగ‌స్టు 7న నింగిలోకి పంపిన‌ ఈవోఎస్‌-02 ఉపగ్రహం బరువు 140 కిలోలు. ఇది భూమిని అన్ని కోణాల్లో పరిశీలిస్తుంద‌ని ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఇది దేశంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం ఇంటర్నెట్‌ కనెక్టివిటీని అందించడంలో సాయపడుతుంద‌ని అంటున్నారు.

ఇక ఆజాదీశాట్‌ బరువు 8 కిలోలు. 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థులు దీన్ని త‌యారు చేశారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం, ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌కు గుర్తుగా దీన్ని రూపొందించారు. దీని జీవితకాలం ఆరు నెలలు. ఇందులో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పాడిన జాతీయ గీతం రికార్డ్‌ వెర్షన్‌ను పొందుప‌ర్చి నింగిలోకి పంపారు.
Tags:    

Similar News