జాతీయ రాజ‌కీయాల్లో కేసీఆర్‌కు క‌లిసి వ‌చ్చే అంశాలివేనా?

Update: 2021-11-08 23:30 GMT
తెలుగు వాడు.. జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్ప‌డం కొత్త‌కాదు. ఉమ్మ‌డి రాష్ట్రంలో అన్న‌గారు.. నంద మూరి తార‌క‌రామారావు.. పార్టీ పెట్టిన కొత్త‌లోనే ఎన్డీయే ఏర్పాటుకు ప్ర‌య‌త్నించి స‌క్సెస్ అయ్యారు. అప్ప ట్లో ప్ర‌ధా న మంత్రిగా ఆయ‌న‌కు అవ‌కాశం వ‌చ్చింద‌ని.. అయితే.. తెలుగు రాష్ట్రానికే ఆయ‌న ప‌రిమితం అవ్వాల‌నే ఉద్దేశంతో ఆయ‌న ఆగిపోయార‌ని.. ఈ క్ర‌మంలోనే ఉత్త‌రాదివారిని గ‌ద్దెనెక్కించార‌ని అంటారు. ఇక‌, ఆ త‌ర్వాత కూడా టీడీపీ అధినేత‌గా, ఉమ్మ‌డి ఏపీ సీఎంగా.. చంద్ర‌బాబుకు కూడా కేంద్రంలో చ‌క్రం తిప్పే ఛాన్స్ వ‌చ్చింది. ఒకానొక సంద‌ర్భంలో ఆయ‌నకు కూడా ప్ర‌ధాని అయ్యే అవ‌కాశం ద‌క్కింద‌ని అంటారు.

అయితే.. ఆయ‌న దానిని అందిపుచ్చుకోలేక పోయారు. దీనికి ప్ర‌ధానంగా.. భాషా ప‌ర‌మైన ఇబ్బందులు.. ఉత్త‌రాది రాష్ట్రాల‌ను మెప్పించ‌గ‌లిగే.. వ్యూహాలు వంటివి కొంత లోటుగా క‌నిపించాయి. ఇక‌, ఆ త‌ర్వాత‌.. మ‌ళ్లీ కేంద్రంలో చ‌క్రం తిప్పే నాయ‌కులు ఉమ్మ‌డి ఏపీ నుంచి ఎవ‌రూ క‌నిపించ‌లేదు. కానీ.. ఇప్పుడు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. కేంద్రంలో చ‌క్రం తిప్పాల‌ని నిర్ణ‌యించుకుంటున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీనికి సంబంధించి.. ఆయ‌న గ‌త తొలి పాల‌న‌లోనే.. కొంత ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ కూట‌మి పేరుతో.. ఆయ‌న ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను క‌లిశారు.

అయితే.. కార‌ణాలు ఏవైనా కూడా ఆయ‌న దూరంగానే ఉండిపోయారు. ప‌రోక్షంగా .. బీజేపీకి స‌హ‌క‌రించా ర‌నే వాద‌న ఉంది. అయితే.. ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకోలేక‌పోయిన ప‌రిస్థితితో పాటు.. మోడీపై ప్ర‌జా వ్య‌తిరేక‌త వెల్లువెత్తుతున్న ప‌రిస్థితి కూడా క‌నిపిస్తోంది. అయితే.. మోడీని ఢీ కొని.. లేదా.. ఉత్త‌రాది నేత‌ల‌ను ఏకం చేసే నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. కొన్నాళ్లు ఈ విష‌యంలో బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌య‌త్నం చేసినా.. ఆమెను విభేదించారు చాలా మంది ఉన్నారు. ఆమె ముక్కుసూటి త‌నం.. ఆమెకు ప్ర‌ధాన శ‌త్రువుగా మారిపోయింది.

పైగా.. నిల‌క‌డ లేని రాజ‌కీయాలు చేస్తార‌ని.. స్పాట్ డెసిష‌న్లు తీసుకుంటార‌ని.. ఆమెపై ముద్ర‌లు చాలానే ఉన్నాయి. దీంతో జాతీయ రాజ‌కీయాల్లో శూన్య‌త ఉంది. ఈ క్ర‌మంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌.. వ‌చ్చే సార్వ‌త్రిక స‌మ‌రం నాటికి ఢిల్లీలో చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో కేసీఆర్‌కు క‌లిసి వచ్చే ప్ర‌ధాన ప‌రిణామాలు బాగానే క‌నిపిస్తున్నాయి. ఒక‌టి ఇప్ప‌టి వ‌ర‌కు భాషా ప‌ర‌మైన ఇబ్బందులు ఉన్న నాయ‌కులుగా ఉన్న తెలుగు రాష్ట్రాల‌కు కేసీఆర్ ఒక ఆశాజ‌న‌కం. ఉత్త‌రాదిలో హిందీలో ఆయ‌న ఇర‌గ‌దీయ‌గ‌ల నేర్ప‌రి. పైగా మాట‌ల మాంత్రికుడు కూడా. ఇది ఆయ‌న‌కు బాగా వ‌ర్క‌వుట్ అవుతుంది.

మ‌రో ముఖ్య అంశం.. ఎవ‌రినైనా.. ఆయ‌న త‌నను ఆక‌ర్షించేలా చేయ‌గ‌ల రాజ‌కీయ చాణ‌క్యుడు. అంతేకాదు.. వ్యూహాలు వేయ‌డంలోను.. వాటిని నెర‌వేర్చ‌డంలోనూ ఆయ‌న దిట్ట‌. ఎవ‌రినీ తీసిపారేయ‌డు. అదేస‌మ‌యంలో.. ఎంత‌టి వారినైనా.. త‌న వ్యూహాల‌కు అనుగుణంగా తిప్పుకొనే సామ‌ర్థ్యం ఉన్న నాయ‌కుడు. దీంతో ఉత్త‌రాది నేత‌లు.. ప్ర‌జ‌ల‌ను కూడా త‌న వ‌శం చేసుకునే అవ‌కాశం ఉంది. మ‌రో విష‌యం.. తెలంగాణ‌లో మ‌జ్లిస్ పార్టీ కేసీఆర్‌కు అండ‌గా.. జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పే అవ‌కాశం ఉంది. సెక్యుల‌ర్ పార్టీగా.. త‌న‌ను తాను ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు కేసీఆర్‌కు మ‌జ్లిస్ దోహ‌ద‌ప‌డుతుంది.

పైగా.. ఢిల్లీలో ఇప్పుడు టీఆర్ ఎస్ భ‌వ‌న్ నిర్మాణంలో ఉంది. సో.. పార్టీ స్థిరంగా.. జాతీయ రాజ‌కీయాలు చేస్తుంద‌నే సంకేతాలు ఇచ్చేందుకు ఇది చాలా వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇక‌, పొరుగు రాష్ట్రాల్లోనూ కేసీఆర్‌కు స‌త్సంబంధాలు ఉన్నాయి. బీజేపీని వ్య‌తిరేకించే నాయ‌కులు, పార్టీల‌కు.. కేసీఆర్ ఆశాజ‌న‌కంగా క‌నిపించే అవ‌కాశం మెండుగా క‌నిపిస్తోంది. సో.. ఈ ప‌రిణామాల‌న్నీ.. కేసీఆర్‌కు జాతీయ‌స్థాయిలో మేలు చేస్తాయ‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. అందుకే కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌ని.. చెబుతున్నారు.




Tags:    

Similar News