ఆఫీసులకు రప్పించేందుకు టార్గెట్ పెట్టేసుకున్న ఐటీ కంపెనీలు

Update: 2021-08-04 03:18 GMT
కరోనా నేపథ్యంలో దాదాపు ఏడాదిన్నరకు పైనే ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించే పని మొదలు పెట్టాయి ఐటీ కంపెనీలు. ఇంటి నుంచి పని చేసిన మొదట్లో ఉత్పాదకత మునుపటి కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ.. రోటీన్ గా సాగుతున్న పనితో.. వారి ఉత్పాదకత మీద ప్రభావాన్ని ఐటీ సంస్థలు గుర్తిస్తున్నాయి. అందుకే.. ఇంటి నుంచి పని విధానానికి స్వస్తి పలికి.. ఉద్యోగుల్ని ఆఫీసులకు రావాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం కూడా ఐటీ ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించాలని కోరుతున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైజస్ అసోసియేషన్ పొట్టిగా చెప్పాలంటే హైసియా ఒక సర్వేను నిర్వహించింది. అందులో 500 మంది కంటే తక్కువగా ఉద్యోగులు ఉన్న ఐటీ సంస్థల్లో ఇప్పటికే 20 శాతం మంది ఉద్యోగులు ఆఫీసులకు వస్తున్నట్లుగా చెబుతున్నారు. 76 శాతం కంపెనీల్లో తొమ్మిది శాతం ఉద్యోగులు ఆఫీసులకు వస్తుండగా.. మీడియం.. హైరేంజ్ కంపెనీల్లో మాత్రం ఐదు శాతం ఉద్యోగులు ఆఫీసులకు వస్తున్నట్లు గుర్తించారు.

ఇదిలా ఉంటే.. ఈ డిసెంబరు చివరి నాటికి తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించాలని మొత్తం సంస్థల్లో 33 శాతం అనుకుంటే.. మరో 41 శాతం కంపెనీలు మాత్రం 2022లో ఆ పని పూర్తి చేయాలని భావిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో దాదాపు ఆరు లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వారిలో రెండు లక్షల మంది దూర ప్రాంతాల్లోని తమ ఇంట్లో నుంచి పని చేస్తున్న పరిస్థితి.

ఇదిలా ఉంటే.. ఆఫీసుకు పిలిపించిన పని చేయించే వైనంలో రెండు డోసులు టీకాలు పూర్తి అయిన వారిని వారానికి మూడు రోజుల పాటు ఆఫీసులకు రావాలని చెప్పనున్నట్లుగా చెబుతున్నారు. ఇంటి నుంచి పని చేయటం కారణంగా ఉత్పాదకత తగ్గిందంటూ 22 శాతానికి పైగా కంపెనీలు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. మరింతకాలం వర్కు ఫ్రం హోంను నిర్వహిస్తే.. సంస్థల మీద తీవ్ర ప్రభావం పడుతుందన్న మాట వినిపిస్తోంది. ఈ కారణంగానే ఉద్యోగుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆఫీసులకు పిలిపించి పని చేయించాలని 27 శాతం కంపెనీలు అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

అయితే.. భార్యభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు అయితే.. వారి పిల్లల సంగతి ఏమిటన్నదిఇప్పుడు ప్రశ్నగా మారింది. ఒకవైపు స్కూళ్లు తెరవకుండానే పిల్లల్ని ఇంట్లో ఉంచేసి.. ఆఫీసులకు రావటం కష్టమవుతుందని.. తమ ఇబ్బందిని కంపెనీలు గుర్తించాలని కోరుతున్నాయి. మొత్తంగా వర్కుఫ్రం హోంను తగ్గించేసి.. ఆఫీసులకు పిలిపించి పని చేయించుకోవటం ఇప్పుడు ఎక్కువైనట్లుగా చెప్పాలి. చూస్తుంటే.. రానున్న రోజుల్లో హైదరాబాద్ రోడ్లు మరింతగా కిటకిటలాడటం ఖాయమని చెప్పక తప్పదు.
Tags:    

Similar News