క్యాంప్ రాజ‌కీయానికి ఐటీ షాక్

Update: 2017-08-02 06:44 GMT
దేశీయ రాజ‌కీయాల‌కు కొత్త పాఠాలు నేర్పిస్తున్నారా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ  అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌య్యేలా తాజాగా ఒక ప‌రిణామం చోటు చేసుకుంది. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై ఐటీతో షాకివ్వ‌టం మోడీ స‌ర్కారుకు ఒక అల‌వాటుగా మారింద‌న్న మాట గ‌డిచిన కొంత‌కాలంగా వినిపిస్తున్న‌దే. ఈ విమ‌ర్శ‌కు బ‌లం చేకూరేలా తాజా ప‌రిణామాలు చోటు చేసుకున్నాయ‌ని చెప్పాలి.  స‌మ‌కాలీన భార‌తంలో చోటు చేసుకోని రీతిలో విచిత్ర‌మైన వ్య‌వ‌హారం తాజా సంచ‌ల‌నంగా మారింది.

గుజ‌రాత్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప‌లువురు ఇటీవ‌ల బీజేపీలోకి చేర‌టం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఉన్న ఎమ్మెల్యేల‌ను కాపాడుకునేందుకు తాను అధికారంలో ఉన్న క‌ర్ణాట‌క రాష్ట్ర రాజ‌ధాని బెంగ‌ళూరుకు పంపాల‌ని కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగా హుటాహుటిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని బెంగ‌ళూరులోని రిసార్ట్ లో క్యాంపు నిర్వ‌హిస్తున్నారు. దేశ రాజ‌కీయాల్లో ఈ త‌ర‌హా క్యాంపుల్ని రాజ‌కీయ పార్టీలు నిర్వ‌హించ‌టం మామూలే.

అయితే.. ఇలాంటి క్యాంపుల‌కు ఎలా చెక్ చెప్పాల‌న్న అంశంపై దేశ రాజ‌కీయ పార్టీల‌కు స‌రికొత్త పాఠాలు నేర్పించేలా మోడీ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా చెప్పాలి. బెంగ‌ళూరులోని గుజ‌రాత్ క్యాంప్‌ పైన ఐటీ దాడులు చేస్తున్న అంశం ఇప్పుడు పెనుసంచ‌ల‌నంగా మారింది.  మొద‌ట క‌ర్ణాట‌క మంత్రి ఇంట్లో త‌నిఖీలు చేప‌ట్టిన ఐటీ అధికారులు.. త‌ర్వాత ఎమ్మెల్యేల గ‌దుల‌ను సోదాలు నిర్వ‌హిస్తున్నారు.

క‌ర్ణాట‌క కాంగ్రెస్ మంత్రి డీకే శివ‌కుమార్ ఇంటిపై బుధ‌వారం ఉద‌యం ఐటీ అధికారులు దాడి చేశారు. క‌న‌క‌పురాలోని సదాశివ‌న‌గ‌ర్ లోని మంత్రి నివాసంలో సోదాలు నిర్వ‌హించారు. ఆపై ఆయ‌న నివాసానికి స‌మీపంలోని ఈగ‌ల్ట‌న్ గోల్ఫ్ రిసార్ట్ లో ఉంటున్న గుజ‌రాత్ ఎమ్మెల్యేల గ‌దుల్ని త‌నిఖీలు చేస్తున్నారు. గుజ‌రాత్ లో నెల‌కొన్న రాజ‌కీయాల నేప‌థ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను బెంగ‌ళూరుకు తీసుకురాగా.. వారికి మంత్రి శివ‌కుమార్ ఇన్ ఛార్జ్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

గుజ‌రాత్ లో జ‌రుగుతున్న రాజ్య‌స‌భ సీటుకు బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా పోటీలోకి దిగ‌గా.. ఆయ‌న‌కు ప్ర‌త్య‌ర్థిగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి రాజ‌కీయ స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రిస్తున్న అహ్మ‌ద్ ప‌టేల్ రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా దిగారు. దీంతో.. అహ్మ‌ద్ ప‌టేల్ ఓడించే విష‌యాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ కాంగ్రెస్ ను దెబ్బ తీసేలా ప్లాన్ చేసింద‌ని చెబుతున్నారు.

ఇందులో భాగంగా నిర్వ‌హించిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ తో ఐదుగురు కాంగ్రెస్ నేత‌లు పార్టీకి రాజీనామాలు చేసి బీజేపీలోకి చేరారు. దీంతో.. మిగిలిన ఎమ్మెల్యేల్ని కాపాడుకునేందుకు బెంగ‌ళూరుకు త‌రలించారు. ఇప్పుడు.. అక్క‌డా సీబీఐ సోదాల పేరుతో రంగంలోకి దిగ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News