బీచ్ ఐటీ : విశాఖకు సరికొత్త చిరునామా

Update: 2022-06-16 02:30 GMT
విశాఖ అంటే దానికి ముందు ఎన్నో బిరుదులు కితాబులు ఉంటాయి. కల్చరల్ సిటీ అంటారు. ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటారు. టూరిజం హబ్ అని సినీ రాజాదాని అని కూడా చెబుతారు. ఇక విశాఖను ఐటీ రాజధానిగా చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైఎస్సార్ హయాంలో విశాఖకు ఐటీ కంపెనీలు వచ్చాయి. ఆ తరువాత చంద్రబాబు విశాఖను ఐటీ సెజ్ గా అభివృద్ధి చేశారు.

విశాఖలో ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని దేశంలో గుర్తింపు కలిగిన ఐటీ సిటీగా చేయాలని బాబు హయాంలో ఎన్నో ప్రణాళికలు రూపొందించారు. అవి కొన్ని కార్యరూపం దాల్చాయి. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదట్లో విశాఖ ఐటీ మీద పెద్దగా ఫోకస్ చేయకపోయినా ఇపుడిపుడే ఐటీ రంగంలో అభివృద్ధి చేయలన్న ఆలోచన వచ్చింది.

ఐటీతోనే ప్రగతి ఆధారపడిఉందని వైసీపీ పాలకులు బాగానే  గుర్తించారు. రాష్ట్ర ఆదాయాల‌లో ఎక్కువ భాగం ఐటీ ద్వారా ఇపుడు దేశంలో చాలా చోట్ల వస్తోంది. తెలంగాణా అయితే ఐటీ పరిశ్రమను తెలనగణాలో నలుమూలలకు విస్తరిస్తోంది. దానికి తగిన విధంగా సదుపాయాలను కల్పిసోంది.

ఏపీ సర్కార్ కూడ బీచ్ ఐటీ అన్న కాన్సెప్టు ని ముందుకు తెస్తోంది. దీని ఉద్దేశ్యం ఏంటి అంటే బీచ్ చుట్టూ ఐటీ కంపెనీలను ఏర్పాటు చేయడం అన్న భావనను  దీన్ని వర్జీనియా నుంచి స్వీకరించారు.  అక్కడ ఉన్నట్లుగా ఐటీ అంతా బీచ్ వైపునే  అభివృద్ధి చేయబడింది, అలా బీచ్ వెంబడి ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయబడ్డాయి. దాన్ని స్పూర్తిగా తీసుకున్న జగన్ సర్కార్ ఇటీవల దావోస్ వెళ్ళినపుడు అక్కడ ఈ కాన్సెప్ట్ ని ప్రమోట్ చేసింది.

విశాఖలో అందమైన బీచ్ ఉంది. దానితో పాటుగా ఐటీని డెవలప్ చేయడం ద్వారా రెండిందాల మేలు చేకూరుతుందన్నది ప్రభుత్వ ఆలోచన. పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా బీచ్ ఐటీకి కొత్త రూపుని షేపునూ తీసుకురానున్నారు.

ఈ కాన్సెప్ట్ ద్వారా దేశంలో పేరు గడించిన  ఐటీ దిగ్గజ కంపెనీలను విశాఖ రప్పించనున్నారు. వారికి అవసరం అయిన సదుపాయాలను అన్నీ సమకూర్చడం ద్వారా విశాఖలో మొత్తం ఐటీ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు అన్న మాట. దాని ద్వారా బెంగుళూరు, హైదరాబాద్లకు ధీటుగా విశాఖ ఐటీ రంగాన అభివృద్ధి చెందుతుంది అన్నది ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది.

ఇదిలా ఉంటే బీచి ఐటీ కాన్సెప్ట్ కంటే ముందే ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ తన కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయనుంది. దీని వల్ల స్థానికులు వేయి మంది దాకా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంటున్నారు. రానున్న రోజులలో ఇది మరింతగా వృద్ధి చెంది కొత్త కంపెనీల రాకకు కూడా మార్గం సుగమం అవుతుంది అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే నాడు ఉమ్మడి ఏపీ అంతటా హైదరాబాద్ లోనే విస్తరించి ఉన్న ఐటీ ని వైఎస్సార్ సీఎం అయ్యాక కొంత విశాఖలో  కూడా ఉండాలని భావించి పునాది రాయి వేశారు. చంద్రబాబు సైతం విభజన ఏపీలో తన వంతుగా కృషి చేశారు. ఇపుడు జగన్ సర్కార్ దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక విశాఖ కొత్త చిరునామాతో ప్రగతి దారులు పట్టడం ఖాయం. ఆ దిశగా అడుగులు పడితే విశాఖతో పాటు ఉత్తరాంధ్రాకే అతి పెద్ద మేలు జరిగినట్లుగా అంతా భావిస్తున్నారు.
Tags:    

Similar News