ఐపీఎల్ పాయె.. ప్ర‌పంచ క‌ప్ కూడా?

Update: 2021-06-06 23:30 GMT
క‌రోనా మ‌హ‌మ్మారి బీసీసీఐని గ‌ట్టి దెబ్బ‌లే కొడుతోంది. ఎంతో ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేసుకొని మొద‌లు పెట్టిన ఐపీఎల్ ను అర్ధంత‌రంగా ఆపేసింది. ప‌టిష్ట‌మైన బ‌యోబ‌బుల్ ను ఛేదించి మ‌రీ ఆట‌గాళ్ల‌ను ట‌చ్ చేసింది. ఈ టోర్నీ పూర్తిగా నిలిచిపోతే సుమారు 2 వేల కోట్ల‌పైచిలుకు ఆదాయానికి గండిప‌డుతుంద‌ని అంచ‌నా. అంత మొత్తాన్ని వ‌దులుకోవ‌డానికి సిద్ధంగా లేని బీసీసీఐ.. టోర్నీని దుబాయ్ కి షిఫ్ట్ చేయాల‌ని నిర్ణ‌యించింది. దీనివ‌ల్ల కూడా ఓ 500 కోట్ల మేర‌ ఆదాయాన్ని కోల్పోతుంద‌ని అంచ‌నా.

అయితే.. త్వ‌ర‌లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నిర్వ‌హించాల్సి ఉంది. ఈ సారి నిర్వహ‌ణ బాధ్య‌త బీసీసీఐదే. షెడ్యూల్ ప్ర‌కారం.. అక్టోబ‌ర్‌, న‌వంబ‌ర్ నెల‌ల్లో ఈ టోర్నీ జ‌రగాల్సి ఉంది. ఈ టోర్నీ భార‌త్ లో జ‌రిగితే బీసీసీఐకి మ‌రింత ఆదాయం స‌మ‌కూరుతుంది. కానీ.. క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో.. గతేడాది నుంచీ అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అనుమానించిన‌ట్టుగానే.. భార‌త్ నుంచి వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర‌లిపోతోంది. తాము ఇండియాలో నిర్వ‌హించ‌లేమ‌ని ఐసీసీకి చెప్పింద‌ట బీసీసీఐ.

ప్ర‌స్తుతానికి సెకండ్ వేవ్ త‌గ్గుతోంద‌ని భావించి ముంద‌డుగు వేసినా.. థ‌ర్డ్ వేవ్ ఎలాంటి ప‌రిస్థితిని సృష్టిస్తుందోన‌నే ఆందోళ‌న ఉంది. ఐపీఎల్ విష‌యంలో ఇదే జ‌రిగింది. ఐపీఎల్ మొద‌లు పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న స‌మ‌యానికి కొవిడ్ తీవ్ర‌త సాధార‌ణంగానే ఉంది. ఆ త‌ర్వాత విజృంభించింది. ఐపీఎల్ లో జ‌ట్లు 8 మాత్ర‌మే ఉన్న‌ప్ప‌టికీ.. కొవిడ్ చుట్టేసింది. ఇప్పుడు ప్ర‌పంచ‌క‌ప్ అంటే జ‌ట్ల సంఖ్య డ‌బుల్ కానుంది. మొత్తం 16 జ‌ట్లు పాల్గొంటాయి. కాబ‌ట్టి.. ఖ‌చ్చితంగా ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌నే భ‌యం ఉంది. ప్ర‌పంచ‌క‌ప్ మొద‌లైన త‌ర్వాత ఐపీఎల్ త‌ర‌హా ప‌రిస్థితి ఎదురైతే.. మ‌రిన్ని చికాకులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని బీసీసీఐ భావిస్తోంద‌ట‌.

దీంతో.. వ‌ర‌ల్డ్ క‌ప్ ను కూడా దుబాయ్ కేంద్రంగా నిర్వ‌హించాల‌ని యోచిస్తున్న‌ట్టు స‌మాచారం. నిర్వ‌హ‌ణ హ‌క్కులు భార‌త్ వే కాబ‌ట్టి.. వేదిక నిర్ణ‌యంలో ఐసీసీ పాత్ర‌తోపాటు బీసీసీ నిర్ణ‌యాన్నికూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. అందువ‌ల్ల.. త‌మ ఆధ్వ‌ర్యంలోనే టోర్నీని దుబాయ్ లో నిర్వ‌హించాల‌ని చూస్తోంద‌ట‌. బీసీసీఐ. ఆ విధంగా.. లాభంలో కోత ప‌డినా కొంత మొత్త‌మైనా వ‌స్తుంద‌ని ఆలోచిస్తోంద‌ట‌. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రాబోతుంద‌ని స‌మాచారం.



Tags:    

Similar News