ఐటీ ఉపాధి.. హైదరాబాద్‌ టు అమరావతి!

Update: 2015-06-29 17:30 GMT
హైదరాబాద్‌లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విస్తరణ తొలి రోజుల్లో మనకు ఎక్కువగా ఏయే పదాలు ఎక్కువగా వినిపించేవో గుర్తుందా!? మెడికల్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌, మెడికల్‌ ఎబ్‌స్ట్రాక్షన్‌ అనే పేర్లు ఎక్కువగా వినిపించేవి. కంప్యూటర్‌ నేర్చుకున్న అమ్మాయిలు.. అమ్మలు ఇంట్లో ఉండి కూడా మెడికల్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ చేసేవారు. అప్పట్లోనే వేలాది రూపాయలు ఆర్జించేవారు. ఇప్పుడు ఈ రంగం నవ్యాంధ్రకు చేరుకుంటోంది.

నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన గుంటూరులోకి మెడికల్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌, మెడికల్‌ ఎబ్‌స్ట్రాక్షన్‌ రంగాలు ప్రవేశిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లోనే వీటికి సంబంధించి శిక్షణ, ఉద్యోగం, ఉపాధి అవకాశాలన్నీ కేంద్రీకృతమయ్యాయి. మిగిలిన సీమాంధ్రలో దీనికి సంబంధించిన ఆనవాళ్లు కూడా లేవు. అక్కడి ఎవరైనా వీటిని చేయాలంటే హైదరాబాద్‌ రావాల్సిందే. ఇంకా విచిత్రం ఏమిటంటే సీమాంధ్రకు చెందిన ఎంతోమంది అక్కడి నుంచి వలస వచ్చి మరీ హైదరాబాద్‌లో ఎంటీ కంపెనీలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉపాధి కల్పించారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌లో ఎంటీ కంపెనీలు ఏర్పాటు చేసిన నవ్యాంధ్రకు చెందిన పారిశ్రామికవేత్తలు ఇప్పుడు విజయవాడ, గుంటూరు నగరాల్లో మెడికల్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ కంపెనీలు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడలో ఎంమోడల్‌, మెడ్‌ట్రాన్స్‌ వంటి కంపెనీలు ఉండగా, తాజాగా సాయన్స్‌ వంటి మూడు కంపెనీలు ప్రారంభమయ్యాయి. సాయన్స్‌ తన శాఖను గుంటూరులోని అరండల్‌ పేటలో కూడా ఏర్పాటు చేస్తోంది. ఇక మెడికల్‌ ఎబ్‌స్ట్రాక్షన్‌లో తొలి కంపెనీని విజయవాడలో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.

Tags:    

Similar News