3 రోజులుగా ఆ మంత్రికి చుక్క‌లు చూపిస్తున్న ఐటీ

Update: 2017-08-04 08:03 GMT
అధికారం క‌ర్ర లాంటిది. దానికి ఉండే బ‌లం దానికి ఉంటుంది. కానీ.. దాన్ని ప‌ట్టుకొని పెత్త‌నం చేసే వాడి సామ‌ర్థ్యంతోనే క‌ర్ర ఎంత క‌ఠిన‌మైన‌ద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంది. గ‌డిచిన కొద్దికాలంగా త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల్ని దెబ్బ తీసే విష‌యంలో మోడీ ప‌రివారం చేస్తున్న ప్ర‌య‌త్నాలపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నా.. బీహార్‌.. గుజ‌రాత్ ఎపిసోడ్ ల త‌ర్వాత సాదాసీదా జ‌నానికి సైతం మోడీలోని మ‌రో కోణం బాగానే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పాలి.

గుజ‌రాత్ రాష్ట్రంలో జ‌రుగుతున్న రాజ్య‌స‌భ ఎన్నిక‌ల పుణ్య‌మా అని విప‌క్ష కాంగ్రెస్‌ను దెబ్బ తీసేందుకు అమిత్ షా నేతృత్వంలో మొద‌లైన ఆట ఇప్పుడు ఎంత‌వ‌ర‌కూ వెళ్లిందో తెలిసిందే.

గుజ‌రాత్ లో కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసేందుకు మొద‌లైన ప్ర‌య‌త్నాల్లో భాగంగా ముందుగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్ని ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ద్వారా దెబ్బ తీశారు. దీంతో.. అలెర్ట్ అయిన కాంగ్రెస్ త‌మ పార్టీ ఎమ్మెల్యేల్ని.. తాము అధికారంలో ఉన్న క‌ర్ణాట‌క రాష్ట్రానికి త‌ర‌లించి.. క్యాంపు పెట్టింది. ప‌వ‌ర్ ఉన్న రాష్ట్రంలో అయితే.. త‌మ ఎమ్మెల్యేలు సేఫ్ గా ఉంటార‌ని ఆ పార్టీ అధినాయ‌క‌త్వం భావించింది.

అయితే.. మోడీ లాంటి నేత కేంద్రానికి సూప‌ర్ బాస్ ఉన్న‌ప్పుడు ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయ‌న్న దానికి సాక్ష్యంగా.. తాజాగా క‌ర్ణాట‌క‌లో సాగుతున్న ఐటీ సోదాలుగా చెప్ప‌క త‌ప్ప‌దు. గుజ‌రాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మంచి చెడ్డ‌లు చూసుకునే బాధ్య‌త‌ను క‌ర్ణాట‌క రాష్ట్ర మంత్రి డీకే శివ‌కుమార్ కు అప్ప‌గించారు. పార్టీ అధినాయ‌క‌త్వం ఆదేశాల్ని తూచా త‌ప్ప‌కుండా పాటిస్తున్న ఆయ‌న‌కు దిమ్మ తిరిగిపోయేలా షాకిచ్చేలా ఐటీ శాఖ రంగంలోకి దిగింది.
రిసార్ట్ లో సేద తీరుతున్న గుజ‌రాత్ ఎమ్మెల్యేల గ‌దుల్ని త‌నిఖీ చేసిన ఐటీ శాఖ అధికారులు.. వారికి మంచి చెడ్డ‌లు చూసే మంత్రి శివ‌కుమార్ కి చెందిన ఆస్తుల‌పై దృష్టి సారించారు.

గ‌డిచిన మూడు రోజులుగా సోదాల మీద సోదాలు చేస్తున్న ఐటీ అధికారుల పుణ్య‌మా అని అయ‌న అడ్డంగా బుక్ అయ్యార‌న్న మాట వినిపిస్తోంది. ఆయ‌న ఆస్తుల‌తో పాటు.. ఆయ‌న నిర్వ‌హించే వ్యాపారాలు.. స్నేహితులు.. బంధువుల ఇళ్ల‌పైనా దాడులు నిర్వ‌హిస్తున్న అధికారులు.. నాన్ స్టాప్ గా త‌నిఖీలు చేస్తున్నారు. మొద‌టిరోజు 39 చోట్ల సోదాలు నిర్వ‌హించిన ఐటీ శాఖ‌.. రెండో రోజు దాదాపు 23 చోట్ల సోదాలు నిర్వ‌హించారు. దాదాపుగా 300 మంది సిబ్బంది ఈ త‌నిఖీల్లో పాల్గొన్న‌ట్లుగా చెబుతున్నారు.  అధికారుల త‌నిఖీల సంద‌ర్భంగా రూ.11.43 కోట్ల న‌గ‌దు.. రూ.22 కోట్ల విలువ చేసే ఆస్తి ప‌త్రాలు స్వాధీనం చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే శివ‌కుమార్ ఇంట్లో 5 లాక‌ర్ల‌ను అధికారులు గుర్తించారు. వీటిల్లో రెండింటిని మాత్ర‌మే తెర‌వ‌గా.. మ‌రో మూడింటిని తెరిచేందుకు శివ‌కుమార్ స‌సేమిరా అంటున్న‌ట్లు చెబుతున్నారు. దీంతో.. నిపుణుల సాయంతో ఈ లాక‌ర్ల‌ను తెరిచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఒక‌వేళ‌.. ఆ లాక‌ర్లు తెరిస్తే మ‌రెన్ని సంచ‌ల‌నాలు న‌మోదు అవుతాయ‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రోవైపు.. మూడు రోజులుగా సాగుతున్న ఐటీ సోదాల మార‌థాన్ మ‌రెన్ని రోజులు సాగుతాయ‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మార‌టంతో పాటు.. క‌ర్ణాట‌క కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ఈ ప‌రిణామం భారీ షాకింగ్ గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 
Tags:    

Similar News