జ్యువెల్లర్స్ మెడపై ఐటీ కత్తి..మునుగుతారా? తేలతారా?

Update: 2020-02-27 16:34 GMT
నిజమే... ఇప్పుడు ఆదాయపన్ను శాఖ జారీ చేసిన నోటీసులతో దేశంలోని 15 వేల మంది బంగారు ఆభరణాల వ్యాపారుల మెడపై కత్తి వేలాడుతోంది. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం నరేంద్ర మోదీ సర్కారు పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న సంచలన నిర్ణయం నేపథ్యంలో... పాత రూ.1000 - రూ.500 నోట్లను మార్చుకునేందుకు భారీ ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేశారని దేశంలోని జ్యువెల్లరీ రంగంలో వ్యాపారం చేస్తున్న వారితో పాటు కస్టమర్లపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఆ తర్వాత ఈ విషయాన్ని పక్కనపెట్టేసిన ఐటీ శాఖ... తాజాగా సదరు ఫైలు బూజు దులిపేసింది. అంతేకాకుండా నాడు అక్రమాలకు పాల్పడ్డారని భావిస్తున్న 15,000 మంది బంగారు వర్తకులకు ఏకంగా నోటీసులు జారీ చేసింది. ఈ వహారంలో ఆరోపణలు ఎదుర్కొని ఇప్పుడు నోటీసులు తీసుకుంటున్న బంగారు వ్యాపారులు మునుగుతారా? లేదంటే... ఎలాగోలా బయటపడతారా? అన్న దిశగా ఆసక్తికర చర్చకు తెరలేసింది.

ఈ వ్యవహారం అసలు వివరాల్లోకి వెళితే... 2016 నవంబర్‌ 8న ప్రధాని నోట్ల రద్దును వెల్లడించగానే పెద్దసంఖ్యలో కస్టమర్లు నెక్లెస్‌ లు - రింగ్‌ లు సహా కనిపించిన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి పాతనోట్లను విడిపించుకున్నారని గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే సమయంలో బంగారం వర్తకులు కూడా కస్టమర్లకు సహకరించడంతో పాటుగా తమ వద్ద ఉన్న పాత నోట్లను వదిలించుకునేందుకు భారీ ఎత్తున బంగారాన్ని వర్తకులు కొన్నారన్న ఆరోపణలు వినిపించాయి. అప్పటి ఆ అమ్మకాలపై ఆదాయ పన్ను అధికారులు ఇప్పుడు తమకు డిమాండ్‌ నోటీసులు పంపుతున్నారని జ్యువెల్లర్స్ వాపోతున్నారు. రెండు వారాల్లో జరిగే అమ్మకాలు తాము ఆ ఒక్క రాత్రే జరిపామని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఓ వ్యాపారి పేర్కొన్నారు. ఇదే విషయంపై ఆ రాత్రి ఎంతమేరకు టర్నోవర్‌ జరిగిందో వివరాలు వెల్లడించాలని తనకు మూడు నెలల కిందట ట్యాక్స్‌ నోటీసులు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ ఉత్తర్వులపై ఆయన అప్పీల్‌ కు వెళ్లారు. అయితే మన చట్టాల ప్రకారం వివాదాస్పద మొత్తం 20 శాతం సదరు వ్యాపారి డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా కేసు ఓడిపోతే మిగిలిన మొత్తం చెల్లించాల్సి ఉంటుందట. ఇదే జరిగితే తాము తమ వ్యాపారాలను మూసివేయాల్సి వస్తుందని సదరు వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ వ్యాపారి మాదిరిగా దేశవ్యాప్తంగా 15,000 మంది జ్యూవెలర్లకు ట్యాక్స్‌ డిమాండ్లను జారీ చేశారని ఇండియన్‌ బులియన్‌ అండ్‌ జ్యూవెలర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి సురేంద్ర మెహతా వెల్లడించారు. జెమ్స్‌ - జ్యూవెలరీ రంగానికి చెందిన వారి నుంచి పన్ను అధికారులు రూ 50,000 కోట్లు వసూలు చేయాలని అంచనా వేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అప్పీల్‌ కు వెళ్లదల్చుకునే వారు 20 శాతం డిపాజిట్‌ చేయడం - కేసు ఓడిపోతే మిగిలిన మొత్తం చెల్లించాల్సి రావడం పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుందని - జ్యూవెలర్లు రుణాలు చెల్లించడంలో డిఫాల్ట్‌ అయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తంగా ఐటీ నోటీసులు ఇప్పుడు జ్యువెల్లర్స్ మెడపై కత్తి వేలాడేశాయన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.


Tags:    

Similar News