షాకిస్తున్న కిరాణా ఓనరింటి రూ.కోట్ల ముచ్చట

Update: 2016-11-28 06:23 GMT
ఒక షాకింగ్ ఉదంతం తమిళనాడులో చోటు చేసుకుంది. దీని గురించి విన్న వారు ఎవరైనా నోట మాట రాకుండా ఉండిపోవాల్సిందే. కిరాణా షాపు నడిపే ఒక వ్యక్తి ఇంటి నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్న సొమ్ము వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. తమిళనాడులోని వేలూరులో కిరాణాషాపు నడిపే ఒక యజమాని ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టల కొద్దీ నోట్లు.. బంగారు ఆభరణాలు బయటకురావటం హాట్ టాపిక్ గా మారింది.

నోట్ల రద్దు నేపథ్యంలో తన దగ్గరున్నపాత నోట్లతో సదరు కిరాణా షాపు యజమాని కేశవ మొదలియార్ రూ.కోటి విలువ చేసే బంగారాన్ని కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోటి రూపాయిల మేర బంగారం కొనటంతో అతని ఆస్తుల మీద దృష్టి పెట్టిన ఐటీ అధికారులకు షాకుల మీద షాకులు తగిలిన పరిస్థితి. ఎందుకంటే.. కేశవ మొదలియార్ కు వేలూరులో 70కి పైగా ఇళ్లు ఉన్నాయట. పేరుకు కిరాణం షాపు అనే కానీ.. అతగాడి ఆస్తులు భారీగా ఉన్నట్లు తెలుసుకున్నారు.

వేలూరులోని సత్తువాచారి గంగయమ్మ ఆలయం వద్ద షాపు నిర్వహించే ఇతడి ఇంటికి ఐటీ అధికారులు వెళ్లారు. ఇంటి మొత్తాన్ని సోదాలు నిర్వహించిన వారికి.. నేల మాళిగలో పెద్ద ఎత్తున నోట్ల కట్టల్ని దాచిన ఉదంతాన్ని గుర్తించారు. అధికారులు ఈ మొత్తాన్ని లెక్కించగా ఇది రూ.17 కోట్లుగా తేల్చారు. ఈ భారీ నగదుతో పాటు కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు.. బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంత మొత్తం సాదాసీదాగా కనిపించే కిరాణం షాపు యజమాని ఇంట్లో బయటపడటంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News