చిన్నమ్మ వ‌ర్గానికి ఐటీ అధికారుల భారీ షాక్‌

Update: 2017-04-07 07:09 GMT
త‌మిళ‌నాడులో మ‌రో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. అమ్మ మ‌ర‌ణంతో ఏర్ప‌డిన ఖాళీని భ‌ర్తీ చేసేందుకు జ‌రుగుతున్న ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం రాజ‌కీయ పార్టీలు చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్నిఇన్ని కావు. ఈ నెల 12న జ‌ర‌గ‌నున్న పోలింగ్ కు ముందు నుంచే విప‌రీతంగా డ‌బ్బులు చేతులు మారుతున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అధికార‌పార్టీకి చెందిన అన్నాడీఎంకే నేత‌లు భారీ ఎత్తున డ‌బ్బులు పంచుతున్న‌ట్లుగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. ఇదిలా ఉండ‌గా.. చిన్న‌మ్మ వ‌ర్గానికి షాకిస్తూ రాష్ట్ర మంత్రి విజ‌య‌భాస్క‌ర్‌ కు సంబంధించిన ప‌లు ఆస్తుల‌పై ఐటీ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు.

అదే స‌మ‌యంలో ఆయ‌న స‌న్నిహితుల ఇళ్ల‌ల్లోనూ ఐటీ శాఖ శుక్ర‌వారం ఉదయం నుంచి సోదాలు చేప‌ట్ట‌టం సంచ‌ల‌నంగా మారింది. మంత్రి విజ‌య‌భాస్క‌ర్ ఓట‌ర్లను ప్ర‌భావితం చేస్తున్న‌ట్లుగా ఇప్ప‌టికే నాలుగు కేసులు న‌మోదైన వేళ‌.. తాజాగా ఐటీ దాడులు హాట్ టాపిక్ గా మారాయి. అన్నాడీఎంకే రెండుగా చీలిపోయిన వేళ‌.. విజ‌య‌భాస్క‌ర్ వెలుగులోకి రావ‌ట‌మే కాదు.. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న విజ‌య‌భాస్క‌ర్ నేరుగా తానే రంగంలోకి దిగ‌టం.. డ‌బ్బును భారీఎత్తున పంచుతున్న వేళ‌.. ఈ త‌నిఖీలు అధికార‌ప‌క్షానికి ఇబ్బందిక‌రంగా మారే అవ‌కాశం ఉందంటున్నారు.

తాజా దాడులు మంత్రి ఆస్తుల‌కే ప‌రిమితం కాకుండా.. ఆయ‌నకు అత్యంత స‌న్నిహితంగా ఉండే వారి ఆస్తుల మీద కూడా ఐటీశాఖ క‌న్నేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా.. తాజా ఎన్నిక‌ల్లో శ‌శిక‌ళ‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన ప్ర‌ముఖ న‌టుడు శ‌ర‌త్ కుమార్ ఇంటిపైనా ఐటీ అధికారులు దాడులు నిర్వ‌హించ‌టం విశేషం. శ‌శిక‌ళ వ‌ర్గానికి మ‌ద్ద‌తు ప‌లికిన ప‌క్క‌రోజునే ఐటీ అధికారులు సోదాలు నిర్వ‌హించ‌టం యాధృశ్చికంగా జ‌రిగిందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. చెన్నైతో పాటు తిరుచ్చి.. పుదుకొట్టాయ్ జిల్లాల్లోని దాదాపు 30 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు నిర్వ‌హిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News