ఓడిపోవటమే కిషన్ రెడ్డి సుడి తిరిగేలా చేసింది

Update: 2021-07-08 04:39 GMT
ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. కొన్నిసార్లు ఆశించినంత ఫలితం రాదు. దీంతో నిరాశకు గురయ్యే వారు చాలామందే ఉంటారు. అయితే.. తమకు ఎదురైన చెడులోనూ మంచిని వెతుక్కునే వారు కొందరు ఉంటారు. అలాంటి వారికి.. వారు కోరుకున్నట్లే మంచి జరుగుతుంది. తాజాగా మోడీ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా చోటు సంపాదించుకున్న కిషన్ రెడ్డి ఉదంతమే దీనికి నిదర్శనంగా చెప్పాలి. ఎమ్మెల్యేగా ఓటమి చెందటం ఆయన రాజకీయ జీవితంలో అత్యంత దారుణ పరిస్థితిన అనుకున్న వారంతా ముక్కున వేలేసుకునేలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. సినిమాటిక్ గా ఉండే కిషన్ రెడ్డి ప్రస్థానం చూస్తే..ఆయన ఆశావాహ పరిస్థితే ఆయనీ స్థానానికి తీసుకొచ్చిందని చెప్పాలి.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా.. బీజేపీ శాసన సభాపక్ష నేతగా.. ఇలా ఒకటేమిటి? పలు బాధ్యతల్ని చేపట్టిన ఆయనకు.. 2018లో ఎదురైన ఓటమి ఆయన్ను తీవ్రమైన షాక్ కు గురయ్యేలా చేసిందని చెబుతారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో చిన్న ఉద్యోగిగా పని చేసిన ఆయన.. అంచలంచెలుగా ఎదిగి.. చివరకు కేంద్రమంత్రి పదవిని చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి కేంద్రమంత్రిగా ఆయన అపురూపమైన రికార్డును సొంతం చేసుకున్నారు.

2018లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగారు. ఆ నియోజకవర్గం ఆయనకు కొట్టినపిండి. నిజానికి అక్కడే ఆయన రాజకీయ ప్రస్థానం ఆరంభమైంది. ప్రతికూల వాతావరణంలోనూ ఆయన ఎమ్మెల్యేగా నెగ్గారు. అలాంటి కిషన్ రెడ్డి 2018 ఎన్నికల్లో ఆయన అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. ఎవరు గెలిచినా గెలవకున్నా కిషన్ రెడ్డి మీద ధీమా వ్యక్తం చేసిన వారు సైతం షాక్ తిన్నారు. దీంతో.. కిషన్ రెడ్డి రాజకీయ జీవితం మసకబారినట్లేనన్న విశ్లేషణలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికి అలాంటి మాటల్ని పట్టించుకోని ఆయన.. ఓటమి వేదనలోనూ తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగారు. అదే ఆయనకు అనుకోని అవకాశాన్ని కలిగించింది.

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. నిజానికి కిషన్ రెడ్డి తప్పించి సరైన నేత లేకపోవటం.. అప్పటికే ఎమ్మెల్యేగా ఓటమి పాలైన ఆయన్ను ఒప్పించి.. టికెట్ ఇప్పించారు. అసెంబ్లీ లో ఓడిపోయిన వైనం.. ఆయనపై సానుభూతి పెల్లుబికేలా చేసింది. దీనికి తోడు.. ఆయనపై పోటీ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడి మీద ఉన్న ఆరోపణలు.. విమర్శలు కిషన్ రెడ్డికి కలిసి వచ్చేలా చేశాయి.

తలసాని అండ్ కో మితిమీరిన ఆత్మవిశ్వాసం కూడా కిషన్ రెడ్డికి కలిసి వచ్చేలా చేసింది. ఆయన్ను బలహీనమైన అభ్యర్థిగా భావించటం.. టీఆర్ఎస్ నేతల మధ్య లోపించిన సమన్వయం.. మోడీ వేవ్ మొత్తంగా కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీగా విజయం సాధించిన సంచలనంగా మారారు.

ఆయన విజయంలోని కష్టాన్ని గుర్తించిన ప్రధాని మోడీ.. తమ ప్రభుత్వంలో ఆయనకు చోటు కల్పించారు. సహాయ మంత్రిగా అవకాశాన్నిచ్చారు. మోడీకి కళ్లు.. చెవులుగా అభివర్ణించే అమిత్ షాకు చెందిన హోంమంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా పని చేయటం.. దాన్ని సమర్థంగా నిర్వహిచంటంతో పాటు.. వివాదాలకు దూరంగా ఉంటూ.. ఆచితూచి అన్నట్లుగా తీసుకునే నిర్ణయాలు ఆయనకు కేంద్రమంత్రి పదవిని దక్కేలా చేశాయని చెప్పాలి.నిజానికి 2018 ఎన్నికల్లో అంబర్ పేట ఎమ్మెల్యేగా కిషన్ రెడ్డి గెలిచి ఉంటే.. మహా అయితే పార్టీ శాసన సభాపక్ష నేతగా మిగిలి ఉండే వారేమో? కానీ.. ఆయన ఓటమి చెందటం కేంద్రమంత్రి అయ్యేలా చేసిందని చెప్పాలి. 
Tags:    

Similar News